అల్లరి చేస్తున్నాడని విద్యార్థిని డస్ట్‌బిన్‌లో పెట్టిన టీచర్- అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం
అల్లరి చేస్తే తెలిసేలా చెప్పాలసిన టీచర్ సహనం కోల్పోయారు. విద్యార్థిని డస్ట్‌బిన్‌లో పెట్టి అవమానించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. సఖినేటిపల్లి మండలం వివి మెరక ఎంపీపీ స్కూల్లో విద్యార్థి పట్ల స్కూల్ టీచర్ మానవత్వం లేకుండా ప్రవర్తించారు. ఎంపీపీ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న పదేళ్ల బాలుడి తీవ్రంగా అవమానించారు. అల్లరి చేస్తున్నాడని డస్ట్ బిన్‌లో పెట్టి మూత పెట్టారు. పది నిమిషాలు డస్డ్‌బిన్‌లో ఉన్న బాలుడు... తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.
సాయంత్రానికి ఇంటికి వెళ్లి స్కూల్‌లో జరిగిన అవమానం తల్లిదండ్రులకు చెప్పాడా బాలుడు. టీచర్ తనను డస్ట్‌బిన్‌లో పెట్టి మూత పెట్టారని వాపోయాడు. పిల్లాడి బాధ విన్న ఆ తల్లిదండ్రులకు విపరీతంగా కోపం వచ్చింది. ఉదయం స్కూల్‌కు వెళ్లి అడుగుదామన్నారు.
ఉదయం స్కూల్‌కు వచ్చిన పేరెంట్స్ టీచర్‌ను నిలదీశారు. తప్పు చేస్తే పద్ధతిగా చెప్పాల్సిన టీచర్ ఇలా చేయడమేంటని నిలదీశారు. డస్ట్‌బిన్‌లో పెట్టడం వల్ల పిల్లాడు మానసికంగా చాలా ఇబ్బంది పడ్డారని వాపోయారు. తల్లిదండ్రులకు గ్రామస్థులు కూడా మద్ధతు ఇచ్చారు. తల్లిదండ్రులకు సర్దిచెప్పిన ప్రధానోపాధ్యాయుడు వివాదాన్ని సద్దుమణిగేలా చూశారు. అయితే టీచర్‌పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకునే వారకు ఊరుకునేది లేదన్నారు.