Konaseema Latest News: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం- గోదావరిలో 8 మంది యువకులు గల్లంతు
Konaseema Latest News: ఈత సరదా ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. గోదావరిలో ఈతకు వెళ్లిన యువకులు గల్లంతయ్యారు. వాళ్ల కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు.

Konaseema Latest News: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం మండలం కమిని లంక సమీపంలో విషాదం చోటు చేసుకుంది. ఈత సరదాతో స్నానానికి గోదావరిలో దిగి ఎనిమిది మంది యువకులు గల్లంతయ్యారు.
కె.గంగవరం మండలం శేరుల్లంక గ్రామంలో ఓ శుభకార్యానికి వచ్చిన వివిధ ప్రాంతాల నుంచి యువకులు వచ్చారు. కాకినాడ, రామచంద్రపురం, మండపేట గ్రామాల నుంచి వచ్చిన వారంతా ఒక చోట చేరారు. పెద్దలు ఫంక్షన్ బిజీలో ఉంటే యువకులు సరదాగా గోదావరి గట్టుకు వెళ్లారు. ఈత సరదాతో గోదావరిలో దిగారు. దాదాపు 11 మంది యువకులు స్నానానికి వెళ్లారు. వెళ్లిన కాసేపటికే 8 మంది కొట్టుకుపోయారు.
కాకినాడకు చెందిన నలుగురు క్రాంతి(20), పాల్ (18), సాయి (18) సతీష్ (19)ఐ.పోలవరం మండలం ఎర్రగరువుకు చెందిన మహేష్, రాజేష్ (13), మండపేటకు చెందిన రోహిత్, శేరుల్లంకకు చెందిన మహేష్ కనిపించకుండా పోయారు. గోదావరిలో గల్లంతయ్యారు.
స్నానికి వెళ్లిన కాసేపటికే కనిపించకుండా పోయిన వారి గురించి బంధువులకు తెలిసింది. శుభకార్యంలో ఉన్న వారంతా పరుగు పరుగున గోదావరి గట్టు వద్దకు వచ్చారు. ఇంతలో అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. అంతా కలిసి గోదావరిలో వెతుకుతున్నారు. రాత్రి కావడం, వర్షాలు పడుతుండటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.
అప్పటి వరకు శుభకార్యంలో అనందంగా ఉన్న వారంతా ఈ యువకుల గల్లంతు తర్వాత విషాదంలో మునిగిపోయారు. బాధిత కుటుంబాలు తమ బిడ్డల కోసం ఎదురు చూస్తున్నారు.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
ముమ్మిడివరం ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 8 మంది గల్లంతు కావడంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరుతో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. గాలింపు చర్యలు జరుగుతున్న తీరును సీఎం చంద్రబాబుకు కలెక్టర్ వివరించారు. గల్లంతైన వారి కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సీఎం సూచించారు. గల్లంతైన వారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పవన్ కీలక ఆదేశాలు
ముమ్మిడివరం వద్ద గోదావరిలో ఎనిమిది మంది యువకులు గల్లంతైన ఘటనపై ఉప ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి తెలియగానే డా.బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. గల్లంతైన యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టాలని సూచించారు.
మంత్రి వాసంశెట్టి సుభాష్ విచారం
గోదావరిలో యువకుల గల్లంతుపై మంత్రి వాసంశెట్టి సుభాష్ విచారం వ్యక్తం చేశారు. ముమ్మిడివరం మండలంలో స్నానానికి వెళ్లి 8 మంది గల్లంతైన ఘటన బాధాకరమన్నారు. గల్లంతైన యువకుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం అని మంత్రి అన్నారు. యువకుల గల్లంతుపై అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ధైర్యంగా ఉండాలని అవసరమైన సహాయం అందిస్తామని బాధితుల కుటుంబాలకు మంత్రి హామీ ఇచ్చారు.





















