Konaseema Tourism: కోనసీమలో మీకు కొబ్బరి తోట ఉంటే పర్యాటక శాఖ డబ్బులు ఇస్తుంది! కండీషన్స్ అప్లై
Konaseema Tourism: కేరళాను తలపించేలా ప్రకృతి సొబగులతో నిండిన కోనసీమలో పర్యాటక అభివృద్ధికి వేగంగా సాగుతోంది. కోనసీమ కొబ్బరి తోటల్లో రిసార్ట్స్‌ల నిర్మాణాలు జోరందుకుంటున్నాయి.

Konaseema Tourism: పచ్చని తీవాచీ పరచిన చందంగా కొబ్బరితోటలు.. వాటి మధ్యలో అందమైన పొదరిల్లు, చుట్టూ ఆహ్లాదాన్ని పంచేలా పూలమొక్కలు.. ఓ వైపు గలగలా పారే నదీపాయల ఒంపు సొంపులు ఇలా గనుక విడిది ఉంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి. ఇలాంటివి ఎక్కువగా కేరళలోనే చూస్తుంటాం. ఇలాంటి ప్రకృతి సొబగులు ఇప్పుడు మన కోనసీమలో కూడా కనిపించబోతున్నాయి. కోనసీమలో ఉండే ప్రత్యేకతలను అనుకూలంగా మార్చుకొని పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది ప్రభుత్వం. అందుకే కోనసీమ వ్యాప్తంగా రిసార్ట్సులు నిర్మాణాలను ప్రోత్సహించి పర్యాటకులను ఆకర్షించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది..
కోనసీమ ప్రాంతం అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది అందమైన కొబ్బరి తోటలు.. కోనసీమకు మూడు వైపులా గౌతమి, వశిష్ట, వైనతేయ, వృద్ధగౌతమి నదీపాయలు.. నోరూరించే పసందైన వంటకాలు.. ఇలా అన్నీ ప్రత్యేకతలతో కూడుకుని ఉంటాయి.. అయితే మరో కేరళాను మరపించే ప్రకృతి రమణీయతతోపాటు ఎన్నో వసతులు, ఆధునిక సొబగులు ఉన్నా కూడా పర్యాటకంగా అభివృద్ధికి నోచుకోవడంలేదు. దీంతో ఈప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడం ద్వారా దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతోంది.. దీనికోసం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించిన అధికారులు ఆదిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు..
వసతి, సకల సదుపాయాలతో రిసార్ట్స్‌ల నిర్మాణం..
పర్యాటకులను ముఖ్యం ఆకర్షించేది ప్రకృతి అందాలే కాదు.. వాటిని ఎంజాయ్ చేయడానికి సరైన సదపాయాలు, వసతులు కూడా చాలా ప్రాముఖ్యం.. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చే పర్యాటకులు బస చేసేందుకు మంచి ఆకర్షనీయమైన రిసార్ట్స్‌లు అత్యంత అవసరం. అందుకే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఆదిశగా ప్రణాళికలు రూపకల్పన చేశారు. వాటిలో ముఖ్యంగా కొబ్బరితోటల్లో రిసార్ట్స్‌ల నిర్మాణం.. సకల సదుపాయాలతో గనుక రిసార్ట్స్‌లు నిర్మించగలిగితే పర్యాటకులను మరింత ఆకర్షించే వీలుంటుందని గమనించిన ఏపీ టూరిజంశాఖ ఆదిశగా అడుగులు ముందుకు వేస్తోంది..
ఈ సదుపాయాలతో నిర్మించగలిగితే ప్రోత్సాహం..
కోనసీమ ప్రాంతంలో రిసార్ట్సుల నిర్మాణానికి ఏపీ టూరిజం శాఖ తగిన ప్రోత్సాహాలను అందిస్తుందంటున్నారు అధికారులు. నిబంధనలకు అనుగుణంగా గనుక నిర్మిస్తే ప్రభుత్వం నుంచి తక్కువ సమయంలోనే అనుమతులు ఇప్పించడం, నిర్మాణ అనంతరం రాయితీలు కల్పించడం, మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పాటునందించడం వంటి పనులు వేగంగా చేసేందుకు ప్రోత్సహం అందిస్తుందని భరోసా ఇస్తున్నారు.. రిసార్ట్సుల నిర్మాణం హైవే మార్గానికి కానీ, లేదా దానిని ఆనుకుని ఉన్నంత సమీపంలో ఉండాలి, రెండు లేదా మూడు ఎకరాల విస్తీర్ణం ఉండాలి, నదీతీరానికి సమీంలో ఉన్న కొబ్బరి తోటల్లో నిర్మాణాలు ఉండాలి. అందులో కాటేజీలు, స్విమ్మింగ్ ఫూల్, చుట్టూ ఫెన్షింగ్ లేదా కాంపౌండ్‌వాల్ నిర్మాణం చేపట్టి ఉండాలి. ఇలా గనుక రిసార్ట్సులు నిర్మాణం చేపడితే ఏపీ టూరిజం బృందం వచ్చి పరిశీలన అనంతరం అనుమతులు ఇస్తారని చెబుతున్నారు.
ఇప్పటికే జోరందుకున్న రిసార్ట్సుల నిర్మాణం..
కోనసీమవ్యాప్తంగా ప్రైవేటు రిసార్ట్సుల నిర్మాణాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే అంబాజీపేట మండలం గంగలకుర్రులో కొబ్బరితోటల్లో రిసార్స్ట్ పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇంకా పేరూరు గ్రామ పరిధిలో నిర్మాణం దాదాపు పూర్తి అవుతోంది.. ఇలా రాజోలు, ముమ్మిడివరం తదితర ప్రాంతాల్లో రిసార్ట్సుల నిర్మాణానికి ఔత్సాహిక కోనసీమవాసులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు ఏపీ టూరిజం శాఖ కూడా తగిన ప్రోత్సాహాన్ని అందిస్తుందని ప్రకటించడంతో మరింత మంది రిసార్స్ట్‌ల నిర్మాణానికి ఆసక్తి చూపుతున్నారు.





















