Paschrlapudi Blow Out: దేశాన్ని వణికించిన గ్యాస్ లీక్ పాశర్లపూడి బ్లో ఔట్‌కి 30ఏళ్ళు!
Paschrlapudi Blow Out: దేశాన్ని వణికించిన గ్యాస్ లీక్ పాశర్లపూడి బ్లో ఔట్‌కి 30ఏళ్ళు పూర్తి అయ్యాయి. జనవరి 8 నాడు విపత్తు సంభవించి కోనసీమను వణికించింది.

Paschrlapudi Blow Out: కోనసీమ అంటే ప్రకృతి అందాలు..పండుగలు..రకరకాల వంటకాలు మాత్రమే అనుకునే రోజుల్లో జరిగిన అగ్ని ప్రమాదం దేశాన్నే వణికించింది. ONGC గ్యాస్ లీక్ వల్ల ఏర్పడిన పాశర్లపూడి బ్లో ఔట్ కోనసీమ పేరును దేశ వ్యాప్తంగా గుర్తుండిపోయేలా చేసింది. మరో భోపాల్ దుర్ఘటనలా మారుతుందా అనే విశ్లేషణలు, భయాలు వెలువడేలా చేసిన పాశర్లపూడి బ్లో ఔట్ ఘటన కు 30 ఏళ్ళు పూర్తయ్యాయి. అసలారోజు ఏం జరిగింది.. ఇప్పుడు చూద్దాం..!
8 జనవరి 1995..సాయంత్రం 6:50కి ఎగసిపడిన మంటలు
ప్రస్తుతం కోనసీమ జిల్లాలో మలికిపురం మండలంలోని ఇరుసమండ గ్రామం వద్ద జరిగిన ONGC గ్యాస్ లీక్ గురించి అందరూ భయపడుతున్నారు. కానీ దీన్ని మించిన అత్యంత ప్రమాదం 30 ఏళ్ల క్రితమే జరిగింది. అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాశర్లపూడి అనే గ్రామంలో ONGC గ్యాస్ డ్రిల్లింగ్ పనులు జరుపుతున్నప్పడు ఒక్కసారిగా లీకేజ్ ఏర్పడి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అందరూ సంక్రాంతి పండుగకు రెడీ అవుతున్న సమయంలో 8 జనవరి 1995 సాయంత్రం 6:50కి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.
ONGC 19వ నెంబర్ బావి వద్ద జరిగిన బ్లో ఔట్‌తో మొదలైన అగ్ని జ్వాలలు ఏకంగా 65రోజులపాటు కొనసాగి మార్చి 15 నాటికి అదుపులోకి వచ్చాయి. అన్ని రోజులపాటు అగ్ని జ్వాలలు అలా ఎగసిపడుతుండడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా దేశం అంతా భయపడింది. ప్రభుత్వం వెంటనే అలెర్ట్ అయి చుట్టుపక్కల ఉన్న 7 గ్రామాల ప్రజలను ఖాళీ చేయించింది. ఏదో రెండు మూడు రోజుల్లో మళ్ళీ సొంత ఊరికి వచ్చేస్తామనుకున్న ప్రజలు ఏకంగా రెండు నెలల పాటు తమ ఊళ్లకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు ఆ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు కానీ ప్రమాదం సంభవించిన రిగ్ నెంబర్ 19 మొత్తం నాశనం అయిపోయింది. ఆ రోజుల్లోనే దాని విలువ 9.2 కోట్లు. అది కాకుండా చుట్టుప్రక్కల ఉన్న సామాగ్రి మొత్తం కాలిపోయింది. వాటి విలువ మరో 7కోట్లు.
ఫలించని అమెరికా ఇంజనీర్ల ప్రయత్నం
ఎంత ట్రై చేసినా మంటలు అదుపులోకి రాకపోవడంతో అమెరికాలోని హుస్టన్‌కు చెందిన నీల్ ఆడమ్స్ ఫైర్ ఫైటర్స్ సంస్థ ఇంజనీర్లను రప్పించారు. కానీ వారు చేసిన మొదటి ప్రయత్నాలు ఫలించలేదు. తరువాత మంటలను అదుపు చేయడానికి వారు మరో పథకం వేసినా అది మరింత ప్రమాదమంటూ దానికి ONGC అనుమతి ఇవ్వలేదు. చివరకు ఇంటర్‌నేషనల్ వెల్ కంట్రోల్ సంస్థ ఇంజనీర్లు రంగంలోకి దిగి 15 మార్చ్ 1995న మంటలను అదుపులోనికి తీసుకుని రాగలిగారు. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బ్లో ఔట్‌గా చరిత్రకెక్కింది. ఏకంగా 200మీటర్ల ఎత్తుకు మంటలు ఎగసిపడ్డాయి.
ఇప్పటికీ బ్లో ఔట్ పేరు చెప్పగానే ఉలిక్కిపడే కోనసీమ ప్రజలు
అప్పట్లో బ్లో ఔట్ కారణంగా ఎగడిపడుతున్న మంటలు చాలా కిలోమీటర్ల దూరానికి కనపడేవి. వాటిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు కోనసీమ వచ్చేవారు. ప్రస్తుతం అంతా ఒకే అన్నట్టు కనపడుతున్నా 30 ఏళ్ల తర్వాత కూడా బ్లో ఔట్ అన్న మాట వినగానే భయంతో ఉలిక్కిపడుతుంటారు పాశర్లపూడి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు. తాజాగా మలికిపురం బ్లో ఔట్ ప్రమాదంతో ఆనాటి భయంకర పరిస్థితుల గురించి మరోసారి గుర్తు చేసుకుంటున్నారు అప్పటి తరం వారు.





















