Rajahmundry News : బాణసంచా తయారుచేస్తున్న ఇంట్లో భారీ పేలుడు, యువకుడు మృతి
Rajahmundry News : రాజమండ్రిలో అవవాంబే గృహాల సమీపంలోని ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. బాణసంచా తయారచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Rajahmundry News : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ పరిధిలోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. ఇంట్లో బాణసంచా తయారు చేస్తుండగా ప్రమాదం జరిగి భారీ పేలుడు జరిగింది. దీంతో ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయింది. రాజమండ్రిలోని 16వ వార్డులో ఆవరోడ్డు రైతు నగర్ లోని ఓ ఇంట్లో ప్రమాదం జరిగింది. ఈ పేలుడులో కోటేశ్వరరరావు(35) అనే యువకుడు మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పోలీస్ క్వార్టర్స్ లో అగ్నిప్రమాదం
తూర్పుగోదావరి జిల్లా కడియం పోలీస్ ఇన్స్పెక్టర్ క్వార్టర్స్ లో సోమవారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వివిధ కేసుల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి, బెల్లం, ఖైనీ, సారా కాసే పాత్రలు సహా పలు వస్తువులు తగలబడిపోయాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియడం లేదు . కడియం పోలీస్ స్టేషన్ వెనుక వైపుగల ఈ భవనం ఖాళీగా ఉంటోంది. దీంతో ఇటీవలే ఈ వస్తువులను అందులోకి మార్చినట్లు తెలుస్తోంది. కాగా సోమవారం ఉదయం ఈ వస్తువులు ఉన్న గదిలో నుంచి మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారొచ్చి మంటలను అదుపు చేశారు. ఇదిలా ఉండగా ఆ బిల్డింగ్లో కరెంట్ కూడా లేదని చెబుతున్నారు. దీంతో ప్రమాద కారణాలపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. దీనిపై రాజమహేంద్రవరం అర్బన్ డీఎస్పీ శ్రీ లతను సంప్రదించగా ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు తెలియ జేస్తామని చెప్పారు.
టపాసుల స్టాల్స్ లో అగ్నిప్రమాదం
విజయవాడలో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గాంధీనగర్ లోని జింఖానా గ్రౌండ్స్ లో దీపావళికి ఏర్పాటు చేసిన టపాసుల స్టాల్స్ లో మంటలు చెలరేగాయి. టపాసుల స్టాల్స్ లో క్రాకర్స్ భారీ శబ్ధంతో పేలిపోయాయి. దీంతో కొన్ని స్టాల్స్ అగ్నికి కాలిపోయాయి. దుకాణదారులు, స్థానికులు ప్రాణ భయంతో గ్రౌండ్ బయటకు పరుగులు తీశారు. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారని సమాచారం. మరికొందరు స్థానికుల సహాయంతో దుకాణాదారులు మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు జింఖానా గ్రౌండ్ కు వెళ్లి పరిశీలించారు. అగ్ని ప్రమాదం జరిగిన స్టాల్స్ షాపుల వారికి లక్షల రూపాయల నష్టం సంభవించి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. దీపావళి పండుగ వేళ విజయవాడలో విషాదం చోటుచేసుకుంది. ఓ క్రాకర్ స్టాల్ లో పటాసు పేలడంతో అది భారీ అగ్ని ప్రమాదంగా మారింది. ఈ ప్రమాదంలో మూడుకు పైగా దీపావళి క్రాకర్స్ స్టాల్స్ కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వారిని పటాకుల దుకాణంలో పనిచేసే సిబ్బందిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది జింఖానా గ్రౌండ్ వద్దకు చేరుకున్నారు. నాలుగు ఫైరింజన్లతో సిబ్బంది ఎంతగానో శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై విజయవాడ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.