Fact Check : మళ్లీ వైఎస్ఆర్‌సీపీ గెలుస్తుందన్న రఘురామ వీడియో వైరల్ - రెబల్ ఎంపీ మారిపోయారా ? ట్విస్ట్ ఉందా ?
జగన్ గెలుస్తారన్న రఘురామ పాత వీడియో వైరల్ అయింది. దీనిపై ఆయనేమన్నారంటే ?
Fact Check : వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మళ్లీ సీఎం జగన్ గెలుస్తారంటూ మాట్లాడిన ఓ వీడియోను.. వైసీపీ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న రఘురామకృష్ణరాజు అక్కడే ఈ మాటలు మాట్లాడారని అంటున్నారు. ట
ఆ వీడియోలో ఏముందంటే ?
సీఎం జగన్ అన్ని హామీలను నెరవేర్చారని.. వచ్చే ఎన్నికల్లోనూ గెలుస్తారని రఘురామకృష్ణరాజు ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి పడే ఓట్ల శాతం పెరుగుతుందని, మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి అవుతారని ఆయన ఈ వీడియోలో చెప్పారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై ప్రసంసలు కురిపించారు.
అమెరికాలో మాట్లాడారంటూ వైరల్ !
ప్రస్తుతం అమెరికాలో పర్యటనలో ఉన్న రఘురామకృష్ణరాజు అక్కడి వారితో మాట్లాడారని..ఆయన మారిపోయారని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు ప్రచారం చేశారు. పలువురు వైఎస్ఆర్‌సీపీ నేతలు ఈ వీడియో ను వైరల్ చేశారు.
స్పందించిన రఘురామ !
అయితే ఈ వీడియో మూడున్నరేళ్ల కిందటిదని రఘురామ ప్రకటించారు. వైసీపీ నాయకులు ఏ స్థాయికి దిగజారిపోయారంటే నేను మూడున్నర సంవత్సరాల క్రితం జగన్ ప్రభుత్వం గురించి భీమవరంలో మాట్లాడిన ఒక పాత వీడియోని ఇప్పుడు అమెరికాలో మాట్లాడినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో స్పందించారు. ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉంది నా ప్రస్తుత పార్టీ. మళ్ళీ 25 పార్లమెంట్ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలూ మావే అని వెధవ పబ్లిసిటీ. సిగ్గులేని రాజకీయమన్నారు. ఇదే అంశంపై అమెరికా నుంచి రచ్చ బండ కార్యక్రమంలోనూ మాట్లాడారు.
వైసీపీ నాయకులు ఏ స్థాయికి దిగజారిపోయారంటే నేను మూడున్నర సంవత్సరాల క్రితం జగన్ ప్రభుత్వం గురించి భీమవరంలో మాట్లాడిన ఒక పాత వీడియోని ఇప్పుడు అమెరికాలో మాట్లాడినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉంది నా ప్రస్తుత పార్టీ. మళ్ళీ 25 పార్లమెంట్ స్థానాలు, 175…
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) July 3, 2023
గెలిచిన కొంత కాలం తర్వాత పార్టీతో విబేధించిన రఘురామ
గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్న రఘురామ .. వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్ ఆఫర్ చేయడంతో ఆ పార్టీలో చేరిపోయారు. నర్సాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆ తర్వాత సరైన గౌరవ మర్యాదలు దక్కడం లేదన్న కారణంగా అసంతృప్తికి గురయ్యారు. పార్టీ ఎంపీలు.. కేంద్ర మంత్రుల్ని ఎవర్నీ కలవడకూడదని ఆంక్షలు పెట్టినా రఘురామ పలువుర్ని కలిశారు. దీంతో ఆయనను వైఎస్ఆర్‌సీపీ దూరం పెట్టింది. ఆ తర్వాత ఆయన రెబల్ ఎంపీగా మారారు. ఆ తర్వాత ఓ సారి అరెస్ట్ చేసి సీఐడీ అధికారులు భౌతిక దాడి చేశారని రఘురామ ఆరోపించారు. ఇప్పుడు రఘురామకు.. వైసీపీకి మధ్య పూడ్చలేనంత ఆగాధం ఉంది. అందుకే ఆ వీడియో వైరల్ అయితే.. పాతదని ఎక్కువ మంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. అయినా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు షేర్ చేయడంతో వైరల్ అయింది.