Polavaram : వచ్చే ఏడాది ఏప్రిల్‌కు పోలవరం పూర్తి కాదు .. రాజ్యసభలో తేల్చి చెప్పిన కేంద్రం !
పోలవరం ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్‌కు పూర్తి కాదని కేంద్రం తెలిపింది. సాంకేతిక సమస్యలను కారణంగా రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపింది.
పోలవరం ప్రాజెక్ట్ నిర్ణీత గడువులోగా పూర్తి చేయడం అసాధ్యమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర తుడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి గతంలో 2022 ఏప్రిల్ గడువుగా పెట్టుకున్నామని కానీ సాంకేతిక కారణాల వల్ల పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు. అందుకే వచ్చే ఏడాది ఏప్రిల్‌కు పూర్తి కావడం అసాధ్యమని స్పష్టం చేశారు. పునరావాసం, పరిహారంతో పాటు కరోనా కారణంగా నిర్మాణ పనుల్లోనూ జాప్యం జరిగిందన్నారు.
ఇప్పటి వరకూ స్పిల్ వే 88 శాతం, అప్రోచ్ చానల్ ఎవర్త్ వర్క్ 73 శాతం, పైలట్ చానల్ అంచనాలు 34 శాతమే పూర్తయ్యాయని కేంద్రం తెలిపింది. పోలవరం సవరించిన అంచనాలు రూ.55,548. 87 కోట్లకు టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ ఆమోదించిన మాట కూడా నిజమేనని స్పష్టం చేసింది. 2020 మార్చిన సవరించిన అంచనాలపై రివైజ్డ్ కాస్ట్ కమిటీ నివేదిక ఇచ్చిందని.. ఆ కమిటీ కేవలం రూ. 35, 950.16 కోట్లకు మాత్రమే అంగీకారం తెలిపిందని కేంద్ర మంత్రి తన సమాధానంలో వివరించారు.
పోలవరం ప్రాజెక్ట్‌ను ఈ ఏడాది డిసెంబర్ 1కి పూర్తి చేయాలని ఏపీలోని వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ విషయాన్ని మంత్రి అనిల్ కుమార్ పలుమార్లు అటు అసెంబ్లీలోనూ బయట కూడా చెప్పారు. దీంతో ఇటీవల టీడీపీ నేతలు ఆయన పెట్టిన డెడ్‌లైన్‌ను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. చంద్రబాబు కారణంగానే పోలవరం నిర్మాణం ఆలస్యయిందని మంత్రి అనిల్ ఆరోపించారు.
Also Read: కొడికొండ - మేదరమెట్ల హైవేకి గ్రీన్ సిగ్నల్.. పాత ప్రాజెక్టు ప్లాన్ కనుమరుగే..
పోలవరం ప్రాజెక్టుకు గత రెండున్నరేళ్లుగా అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. కేంద్రం బిల్లులు పూర్తి స్థాయిలో రీఎంబర్స్ చేయడం లేదు. ప్రభుత్వం పంపుతున్న బిల్లులను చాలా వరకూ వెనక్కి పంపుతోంది. అదే సమయంలో సవరించిన అంచనాలను కూడా ఆమోదించలేదు. 2014 లెక్కల ప్రకారం మాత్రమే ఇస్తామని చెబుతోంది. ఈ విషయం ఎటూ తేలడం లేదు. ఈ కారణంగా పోలవరం పనులు ముందుకు సాగడం లేదు. ఇక నిర్వాసితులకు పరిహారం విషయం పీట ముడి పడిపోయింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి