నెల్లూరులో సీఎం పర్యటన- ఉపాధ్యాయులపై స్పెషల్ ఫోకస్
నెల్లూరులో సీఎం జగన్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజి వద్ద మొత్తం 1600 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
నెల్లూరులో సీఎం జగన్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజి వద్ద మొత్తం 1600 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుగా సీఎం జగన్ నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజ్‌కి వస్తారు. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్‌ని ప్రారంభించి అనంతరం అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభకోసం పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాని సైతం పరిమిత సంఖ్యలో అనుమతిస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి రైతుల్ని పెద్ద సంఖ్యలో సభకు తరలిస్తున్నారు. ఈ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
సంగం సభ అనంతరం నెల్లూరు బ్యారేజ్ వద్దకు వెళ్తారు జగన్. నెల్లూరు బ్యారేజ్ ప్రారంభం అనంతరం నేరుగా తిరుగు ప్రయాణమవుతారు. నెల్లూరు నగర పరిధిలో కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బ్యారేజ్ వద్దకు వెళ్తారు. ఈ మార్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాన్వాయి ట్రయల్స్ ని జిల్లా ఎస్పీ విజయరావు స్వయంగా పర్యవేక్షించారు. స్పెషల్ పార్టీ, కాన్వాయి పార్టీ, BD టీమ్, ట్రాఫిక్, రోప్ టీమ్ ల విధినిర్వహణపై వివరణ ఇచ్చారు. అందరూ అప్రమత్తంగా ఉండి పర్యటన విజయవంతం చేయాలని అధికారులకు సూచనలిచ్చారు.
పోలీస్ సిబ్బందికి ఎస్పీ సూచనలు..
- ప్రాపర్ యునిఫారం, ఖచ్చితంగా ID కార్డులు ధరించాలి.
- డ్యూటీ పాస్ పోర్ట్ లో ఎవరికి నిర్ణయించిన ప్రదేశాలల్లో వారు హాజరు కావాలి.
- డ్యూటీ విషయంలో పూర్తి స్పష్టత కలిగి ఉండి బందోబస్త్ విధులు నిర్వహించాలి.
- విధి నిర్వహణలో డ్యూటీ పాయింట్ వదిలి వెళ్ళకూడదు. అత్యవసర పరిస్థితుల్లో సమస్యని వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలి.
- ఎవరైనా అలసత్వం ప్రదర్శించినా, డ్యూటీకి గైర్హాజరైనా, శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎస్పీ.
ఉద్యోగులతో ఇబ్బంది ఉంటుందా..?
సీపీఎస్ రద్దుకోసం ఇప్పటికే ఉద్యోగులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఈనెల 11న చలో విజయవాడ కార్యక్రమం ఉంది. ఈ దశలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు సీఎం సభకు ఆటంకాలు ఏర్పరుస్తారేమోనని పోలీసులు కంగారు పడుతున్నారు. సీఎం జగన్ పాల్గొన్న టీచర్స్ డే సెలబ్రేషన్స్ లో కూడా అందర్నీ క్షుణ్ణంగా పరిశీలించి పంపించారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో బహిరంగ సభ జరుగుతుంది. దీనికి నిరసనకారులు వస్తారేమోననే అనుమానం కూడా ఉంది. అందుకే భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు.