Chandrababu In Nellore: కొత్తగా వచ్చేవారిని తీసుకున్నా, పార్టీ జెండా మోసిన వాళ్లను మరిచిపోను - చంద్రబాబు భరోసా
ఏపీలో సంపూర్ణ మధ్య నిషేధం అన్నారని, కానీ విచ్చలవిడిగా మద్యం ఏరులై పారిస్తున్నారని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యల్లో దేశం లోనే మూడో స్థానంలోం ఏపీ ఉందని గుర్తు చేశారు చంద్రబాబు.
టీడీపీలోకి కొత్తగా వచ్చేవారిని తీసుకున్నా పాతవారిని మరచిపోనని అన్నారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. నెల్లూరులో జోన్-4 సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు చంద్రబాబు. మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే రోజులు పోయాయని అన్నారు. దీనికి ఎమ్మెల్సీగా కంచర్ల శ్రీకాంత్ గెలుపే నిదర్శనం అని చెప్పారు. తాను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని, ఎక్కువకాలం సమైక్యాంధ్రలో ముఖ్యమంత్రిగా పని చేశానన్నారు. జగనే మా భవిష్యత్ కాదని, జగనే రాష్ట్రానికి దరిద్రం అని చెప్పారు. అసలు సీఎం అయ్యాక జగన్ రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలన్నారు. అన్నీ అసంపూర్తి పనులేనని చెప్పారు.
ఏపీలో గంజాయి, గన్ కల్చర్ ఉందని.. మద్యానికి బానిసలైపోకుండా ప్రజలను కాపాడాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ నిజంగానే పేదల మనిషి అయితే ఎందుకు టిడ్కో ఇళ్ళు ఇవ్వలేదో చెప్పాలని నిలదీశారు. ఇప్పుడు టిడ్కో ఇళ్లు, బూత్ బంగ్లాలుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అప్పులు పెరిగాయని, ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదన్నారు. తిరుమలలో గంజాయి.. పులివెందులలో గన్ క్షల్చర్.. .నాసిరకం మద్యం.. ఏపీ పరిస్థితి ఇలా ఉందన్నారు.
ఏపీలో సంపూర్ణ మధ్య నిషేధం అన్నారని, కానీ విచ్చలవిడిగా మద్యం ఏరులై పారిస్తున్నారని మండిపడ్డారు. రైతుల ఆత్మహత్యల్లో దేశం లోనే మూడో స్థానంలో ఏపీ ఉందని గుర్తు చేశారు చంద్రబాబు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారని, ఇదెక్కడి న్యాయం అని నిలదీశారు.
తమ్ముళ్లూ మీరేం చేశారో నాకు తెలిసిపోతుంది..
మీరు పని చేసే పని.. పని విధానం అంతా స్పష్టంగా నాకు తెలుస్తుంది అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలను అలర్ట్ చేశారు చంద్రబాబు. నేతల పనితీరు తన సెల్ ఫోన్ కి రిపోర్ట్ రూపంలో వస్తుందన్నారు. కష్టపడి పని చేసిన వారిని ఎవరినీ మరచిపోనని హామీ ఇచ్చారు. 25 సంత్సరాల కిందటే టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్ విప్లవం తీసుకొచ్చామన్నారు చంద్రబాబు. తెలిగ్రామ్ బాట్ యాప్ ద్వారా 22 లక్షల మంది సభ్యులుగా చేరారని చెప్పారు. రాష్ట్ర, జిల్లా, మండలాల నుండి క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త విధానాలను తీసుకొస్తున్నామన్నారు. ఓట్లు సంపాదించుకునేందుకు కమిట్ మెంట్ తో పని చేయాలన్నారు. కొత్తగా వచ్చిన వాళ్లను తీసుకున్నా.. మొట్టమొదటి నుండి పార్టీ జెండాను మోసిన వారిని మరచిపోనన్నారు చంద్రబాబు.
టీడీపీ కార్యకర్తలు ప్రత్యర్థుల దాడుల్లో మృతి చెందితే.. వారి పిల్లలను అనాథలు కానివ్వనని అన్నారు చంద్రబాబు. వారిని ఆదుకుంటామని చెప్పారు. పార్టీ కార్యకర్త అనారోగ్యంతో ఉంటే.. పార్టీ ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేస్తామన్నారు. ఎంత గొప్ప నాయకుడైనా ప్రజలతో సంబంధాలు లేకపోతే మనుగడ ఉండదన్నారు. ప్రజలతో మమేకం కాలేని కారణంతో మన్మోహన్ సింగ్ లాంటి నేత సైతం గెలవలేకపోయాడని గుర్తు చేశారు. మూడు పట్టభద్రుల స్థానాలు గెలిచిన ధీమాతోనే వైనాట్ పులివెందుల అని అనగలుగుతున్నామని చెప్పారు చంద్రబాబు.
జగన్ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నాడని ఆరోపించారు చంద్రబాబు. గతంలో జరిగిన పంచాయతీ, మున్సిపాల్టీ, స్థానిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచినా దొడ్డిదారిలో వైసీపీవాళ్లు వచ్చారన్నారు. వాలంటరీ వ్యవస్థ ప్రజా ధనంతో పెట్టిన వ్యవస్థ అని, కానీ వారు జగన్ జపం చేస్తున్నారని అన్నారు. ప్రజలకు సేవ చేస్తే వాలంటర్లకు సహకరిస్తామని చెప్పారు. ప్రజలు టీడీపీ పక్షాన ఉన్నారని, వైసీపీ వైపు రౌడీలు ఉన్నారని అన్నారు. రాజకీయాలకు అర్హతలేని వైసీపీ వారిని చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు.