కందుకూరు దుర్ఘటనకు కారణాలివే- మొదలైన పోలీసు విచారణ
కందుకూరు దుర్ఘటనపై ఏపీ పోలీసులు విచారణ చేపట్టారు. అనుమతి లేకుండా సభ జరిగే ప్రాంతం వద్ద బాణసంచా కాల్చడం, బైక్ ర్యాలీ, భారీ స్పీకర్లు ఏర్పాటు చేయడం కూడా పరోక్ష కారణాలని తేల్చారు.
కందుకూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 8మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై ఏపీ పోలీసులు విచారణ చేపట్టారు. గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ నెల్లూరు జిల్లాకు వచ్చారు. సంఘటన వివరాలు ఎస్పీ విజయరావుని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని డీఎస్పీ స్థాయి విచారణకు ఆదేశించామని చెప్పారు.
పిచ్చయ్య ఫిర్యాదుతో కేసు..
కందుకూరు దుర్ఘటనలో ఎవరో ఒకరి ఫిర్యాదుతో కేసు నమోదు చేయాల్సి ఉంది. ఈ దుర్ఘటనలో గాయపడిన పిచ్చయ్య అనే వ్యక్తి ద్వారా పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. సీఆర్‌పీసీ 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. క్షేత్ర స్థాయిలో విచారణ జరిపేందుకు డీఎస్పీని నియమించినట్టు తెలిపారు డీఐజీ త్రివిక్రమ వర్మ.
కారణాలివే..
కందుకూరు ఘటనలో పోలీసుల వైఫల్యం లేదని తేల్చాశారు డీఐజీ త్రివిక్రమ వర్మ. సభకు ముందుగానే టీడీపీ నేతలు అనుమతి తీసుకున్నారని, అయితే కందుకూరులో తాము అనుమతి ఇచ్చిన ప్రాంతంలో కాకుండా 46మీటర్లు ముందుకు పోయారని చెప్పారు. అలా ముందుకు వెళ్లడం వల్లే ఇరుకైన సందుల్లో జనం పోగయ్యారని, అదే ప్రమాదానికి ప్రధాన కారణం అని తేల్చారు. టెక్నికల్ సాక్ష్యాధారాలు, డిజిటల్ సాక్ష్యాధారాలను కూడా పరిగణనలోకి తీసుకుని చార్జిషీటు దాఖలు చేస్తామని వివరించారు.
అనుమతి లేకుండా సభ జరిగే ప్రాంతం వద్ద బాణసంచా కాల్చడం, బైక్ ర్యాలీ, భారీ స్పీకర్లు ఏర్పాటు చేయడం కూడా పరోక్ష కారణాలని వివరించారు నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు. కందుకూరులో సాయంత్రం 7.30 గంటలకు సభకు అనుమతిచ్చినా ఆలస్యం కావడంతో జనం ఎక్కువగా పోగయ్యారని చెప్పారు. మొత్తం 10 ఉల్లంఘనలు ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు కాన్వాయ్ కూడా వేగంగా వెళ్లిందన్నారు. చంద్రబాబును చూసేందుకు, ఫొటోలు తీసుకునేందుకు ప్రజలు దూసుకురావడంతో తొక్కిసలాట చోటుచేసుకొని 8 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.
పోలీసుల వైఫల్యంపై టీడీపీ ఆరోపణలు..
కందుకూరులో జరిగిన ఘటనలో పోలీసుల వైఫల్యం ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. కందుకూరు దుర్ఘటన తర్వాతే కావలి మీటింగ్ కి పోలీసులు భారీగా వచ్చారని, ఇదేదో అప్పుడే వచ్చి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదనేది టీడీపీ వాదన. అయితే పోలీసులు, వైసీపీ నేతలు ఈ వాదనను ఖండిస్తున్నారు. చంద్రబాబు మీటింగ్ కి పోలీసులు విధి నిర్వహణ కోసం వచ్చినా, టీడీపీ నేతలు వారిని తూలనాడతారని, కించపరుస్తారని అన్నారు మంత్రి కాకాణి. అలాంటిది ఇప్పుడు పోలీసులు లేరంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు వితండ వాదం చేస్తున్నారని మండిపడ్డారు.
తప్పంతా చంద్రబాబుదేనంటోంది వైసీపీ, అది అనుకోకుండా జరిగిన ప్రమాదం అని, పోలీసుల వైఫల్యం కూడా ఉందని టీడీపీ అంటోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా పోలీసు విచారణ చివరకు ఏం తేలుస్తుందో చూడాలి. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రాథమికంగా పోలీసులు చెబుతున్న సమాచారం మేరకు సభా వేదికను ముందుకు జరపడం, చుట్టూ బ్యానర్లు కట్టడం వల్ల ఇరుకైన మార్గంలో వాహనం వెళ్లడం వంటివి కారణాలని తేలుతోంది. పూర్తి విచారణ తర్వాత అసలు విషయం బయటపడాల్సి ఉంది.