YSRCP Leaders Dance: వైసీపీ నేతల ఏకాంత సేవ - అట్లుంటది మనతో! ఇవేం పనులంటూ భక్తుల ఆగ్రహం
సాంస్కృతిక కార్యక్రమాల్లో తమలాంటి కళాపోషకులు లేరని నిరూపించుకున్నారు వైసీపీ నాయకులు. ఆలయ చైర్మన్, వైసీపీ నాయకులు కలసి స్టేజ్ పై డ్యాన్సర్లతో చిందులు వేశారు.
వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ మూడేళ్ల కిందట మహిళలతో కలసి స్టెప్పులు ఇరగదీసిన వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైసీపీపై టీడీపీ నేతలు విమర్శలకు ఈ వీడియో కారణం అయింది. ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చుకోవడం, అది పాత వీడియో అని, తన తప్పేమీ లేదని చెప్పడంతో ఆ వివాదం సద్దుమణిగింది. తాజాగా నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీ నేతలు ఇలాంటి వీడియోతో మరోసారి బుక్కయ్యారు. ఈ వీడియో దేవుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పాట కచేరీలోది కావడంతో మరింత కలకలం రేగింది. అసలు దేవుడి కార్యక్రమాల్లో ఇలాంటి డ్యాన్స్ లు పెట్టడం, అందులోనూ వైసీపీ నేతలు స్టేజ్ ఎక్కి డ్యాన్సర్లతో కలసి ఐటమ్ సాంగ్స్ కి స్టెప్పులేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
నెల్లూరు జిల్లా సంగంలోని శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో ఇటీవలే బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సాంస్కృతిక కార్యక్రమాల్లో తమలాంటి కళాపోషకులు లేరని నిరూపించుకున్నారు వైసీపీ నాయకులు. ఆలయ చైర్మన్, వైసీపీ నాయకులు కలసి స్టేజ్ పై డ్యాన్సర్లతో చిందులు వేశారు. కమిటీ చైర్మన్ పెరుమాళ్ల రవీంద్రబాబు, వైసీపీ నాయకులు డ్యాన్స్ లతో ఎంజాయ్ చేశారు. ఏకాంత సేవ అంటే ఇదేనా అంటూ భక్తులు షాకయ్యారు. బ్రహ్మోత్సవాల్లో పాటకచేరీలు పెట్టడం కామన్. కానీ మరీ ఇలా నాయకులే స్టేజ్ ఎక్కి ఐటమ్ సాంగ్స్ కి చిందులేయడం విమర్శలకు తావిస్తోంది. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వైసీపీ నేతలు ఎక్కడ ఏ తప్పు చేస్తారా అని టీడీపీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలు దేవుడి కార్యక్రమాల్లో ఐటమ్ సాంగ్స్ కి చిందులేయడంతో టీడీపీ విమర్శలు మొదలు పెట్టింది. దేవుడి బ్రహ్మోత్సవాల్లో వైసీపీ నేతల వ్యవహారం ఎలా ఉందో చూడండి అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ లు పెట్టారు టీడీపీ నేతలు. టీడీపీ అనుకూల మీడియాలో కూడా ఈ వ్యవహారం బాగా హైలెట్ అవుతోంది. దేవుడి ఉత్సవాల్లో ఇలాంటి ఐటమ్ సాంగ్స్ ఎలా వేస్తారని, అసలు పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ నేతలు మాత్రం అసలీ కార్యక్రమంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పాటకచేరీ పెట్టామని చెబుతున్నారు. పాటకచేరీపై కావాలనే టీడీపీ రాద్ధాంతం చేస్తోందని మండిపడుతున్నారు. ఇక్కడ పార్టీల సమస్య ఏముందని, దేవుడి ఉత్సవాల్లో అందరూ భక్తులుగానే హాజరవుతామని, ఆ సమయంలో స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేయడం తప్పా అని ప్రశ్నిస్తున్నారు. కావాలనే ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని అంటున్నారు వైసీపీ నాయకులు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోకి సంగం మండలం వస్తుంది. గతేడాది ఇక్కడ సంగం బ్యారేజ్ ని సీఎం జగన్ ప్రారంభించారు. సంగం బ్యారేజీ సమీపంలోనే సంగమేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. పెన్నా నది పక్కనే సంగమేశ్వరుడి ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంది. ఏటా ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఊరేగింపులు, వివిధ కార్యక్రమాలు చేపడతారు. తాజాగా జరిగిన బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఏకాంత సేవ ఏర్పాటు చేయడం, అది పూర్తయిన తర్వాత ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు నేరుగా స్టేజ్ ఎక్కి మహిళా డ్యాన్సర్లతో స్టెప్పులు వేయడం ఇప్పుడు వివాదానికి కారణం అవుతోంది.