Nellore Politics: ఎమ్మెల్యే అనిల్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేసిన నెల్లూరు టీడీపీ నేతలు!
వైసీపీ ఎమ్మెల్యే అనిల్ పై మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అనిల్ సామాజిక వర్గానికే చెందిన రవిచంద్ర యాదవ్.. ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Nellore Politics: గతంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎన్ని విమర్శలు చేసినా, చంద్రబాబు, లోకేష్ ని ఎంత ఘాటుగా విమర్శించినా టీడీపీ నుంచి ఈ స్థాయిలో కౌంటర్లు పడలేదు. కానీ తొలిసారి నెల్లూరు టీడీపీ బాగా ఘాటుగా స్పందించింది. అరేయ్ అంటూ మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అనిల్ సామాజిక వర్గానికే చెందిన రవిచంద్ర యాదవ్.. ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అనిల్ మంత్రిగా ఉన్నప్పుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసలు సమీక్షలకు కూడా పిలవలేదని అన్నారు. ఆ తర్వాత మంత్రి పదవి తీసేశారని, అనిల్ ని అసలు ఏనాడూ మంత్రిగా గుర్తించలేదని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్యే అనిల్ ప్రతి మాటకి బీద రవిచంద్ర కౌంటర్ ఇచ్చారు. నారా లోకేష్ కి తెలుగు చదవడం రాదంటున్న అనిల్.. ముందు సీఎం భాష ఎలా ఉంటుందో చూడాలన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న జగన్ కి తెలుగు రాదని, బహిరంగ సభల్లో ఆయన మాటలే దానికి నిదర్శనం అని ఎద్దేవా చేశారు.
బ్యారేజ్ లు నువ్వు పూర్తి చేశావా..?
సంగం, పెన్నా బ్యారేజ్ లు టీడీపీ హయాంలో 85 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు పూర్తి చేయడానికి వైసీపీకి మూడేళ్లు టైమ్ పట్టిందని ఎద్దేవా చేశారు రవిచంద్ర. సంగం బ్యార్ వద్ద మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహాన్ని, పెన్నా బ్యారేజ్ వద్ద వైఎస్ఆర్ విగ్రహాన్ని పెట్టడం మినహా అసలు వైసీపీ హయాంలో ఏం చేశారని నిలదీశారు. ఆ బ్యారేజీ పనుల్ని తానే పూర్తి చేశాని చెప్పుకోవడం అనిల్ కి సిగ్గుచేటన్నారు. అనిల్ హయాంలో సర్వేపల్లి కాల్వపనులు ఎంత సొంపుగా జరుగుతున్నాయో చూడాలన్నారు. కమీషన్ల కక్కుర్తితో పనులు నత్తనడకన సాగుతున్నాయని చెప్పారు.
నీ సంగతి చూసుకో..
అనిల్ కి ఈసారి సిటీ సీటు గల్లంతేనంటూ ఆ పార్టీలోనే ప్రచారం జరుగుతోందన్నారు బీదా రవిచంద్ర. అనిల్ కి ఆయన పార్టీలోనే శత్రువులు ఉన్నారని, ఇది తాము అంటున్న మాట కాదని, అనిల్ స్వయంగా ఆయన మీట్ంగ్ లలో చెప్పారని గుర్తు చేశారు. సొంత పార్టీలోనే అనిల్ ని వేగలేకపోతున్నారని, ఆయన పక్క పార్టీల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ పాదయాత్రను అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎక్కడా అడ్డుకోలేదని, కానీ ఇప్పుడు లోకేష్ యువగళాన్ని అడ్డుకోడానికి వైసీపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోందన్నారు బీదా రవిచంద్ర. జీవో-1 దగ్గర్నుంచి అడుగడుగునా ఆటంకాలు పెడుతున్నారని మండిపడ్డారు. అనిల్ తో చర్చకు లోకేష్ అక్కర్లేదని, సాగునీటి సంఘం సభ్యులు చాలని కౌంటర్ ఇచ్చారు.
నెల్లూరు సిటీ టీడీపీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి కూడా అనిల్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నారా లోకేష్ ను విమర్శించే స్థాయి అనిల్ కు లేదన్నారు కోటంరెడ్డి. చర్చ జరగాల్సింది జిల్లాలో జరిగిన అభివృద్ధి పై కాదని, అనిల్ చేసిన అవినీతి పై అని అన్నారు. మంత్రి పదవి అడ్డం పెట్టుకొని అనిల్ మూడు వేల కోట్లు సంపాదించాడని విమర్శించారు. దోపిడీకి అనిల్ బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయన బతుకు అందరికీ తెలుసన్నారు. రూప్ కుమార్ యాదవ్, ముక్కాల ద్వారకా నాథ్ అవినీతిని బయట పెడతా అంటూ అనిల్ సవాళ్లు విసురుతున్నారని, ఆయనకు అంత దమ్ముందా అని ప్రశ్నించారు.