Nellore Sangam Barrages Opening: నెల్లూరు సంగం బ్యారేజీ పూర్తి- ఆ విగ్రహం వస్తే ప్రారంభోత్సవమే
వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 ఫేజ్–2 పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయని, అక్టోబరులో ప్రారంభోత్సవానికి సిద్ధంచేస్తామన్నారు అధికారులు సీఎంకు వివరించారు.
జలవనరుల శాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పోలవరం సహా ప్రాధాన్యత ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. పోలవరం, ముందస్తు వరదలు, పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలు, ముందస్తుగా వచ్చిన వరదల కారణంగా తలెత్తిన పరిణామాలపై సీఎం సమగ్రంగా సమీక్ష జరిపారు.
పోలవరం ప్రాజెక్టులో ఈసీఆర్‌ఎఫ్‌డ్యాం నిర్మాణ ప్రాంతంలో గతంలో ఏర్పడ్డ గ్యాప్–1, గ్యాప్–2లు పూడ్చే పనులపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. పోలవరం ఈసీఆర్‌ఎఫ్ డ్యాంకు సంబంధించి గ్యాప్ 1, గ్యాప్ 2లు రెండింటినీ పూడ్చే పనులను నిర్ధారించడానికి 9 రకాల టెస్టులు, నివేదికలు అవసరమన్న విషయాన్ని అధికారులు సీఎం కు వివరించారు. ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయని, మిగిలిన టెస్టులు పూర్తికావాల్సి ఉందని అధికారులు చెప్పారు. చేయాల్సిన టెస్టులు, నివేదికలు పూర్తికాక ముందే గోదావరి నదికి ముందస్తుగా వచ్చిన వరదల కారణంగా దిగువ కాఫర్ డ్యాం ప్రాంతంలోకి వరద నీరు చేరిందన్నారు అధికారులు. వరదలు తగ్గాక పరీక్షలన్నీ పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు.
షెడ్యూలు ప్రకారం జరుగుతున్న దిగువ కాఫర్‌డ్యాం పనులను కూడా ముందస్తు వరదల కారణంగా అంతరాయం ఏర్పడిందన్న విషయాన్ని అధికారులు సీఎం వద్ద ప్రస్తావించారు. గోదావరిలో వరద కనీసంగా 2 లక్షల క్యూసెక్కులకు తగ్గితేగాని దిగువ కాఫర్ డ్యాం ప్రాంతంలో పనులు చేయడానికి అవకాశం ఏర్పడదన్నారు అధికారులు. వరదలు పూర్తిగా తగ్గితే... ఆగస్టు మొదటివారంలో పనులు తిరిగి ప్రారంభించేందుకు అవకాశం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నామని వివరించారు. ఈ పరిస్థితి రాగానే ముమ్మరంగా పనులు చేయడానికి అన్నిరకాలుగా సిద్ధం కావాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి రీయింబర్స్ చేయాల్సిన మొత్తం రూ.2,900 కోట్లని, రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో ఈ ఖర్చు చేసిందన్నారు జగన్. పోలవరం ప్రాజెకులో జరుగుతున్న పనులను వేగవంతంగా చేయడానికి అడహాక్‌గా రూ.6వేల కోట్ల నిధులను కేంద్రం నుంచి రప్పించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులతో సీఎం అన్నారు.
ఆగస్టులో నెల్లూరు, సంగం బ్యారేజీలు ప్రారంభం.
ఆగస్టు మూడోవారంలో నెల్లూరు బ్యారేజీ, మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజీల ప్రారంభోత్సవానికి సిద్ధంచేశామన్న అధికారులు, బ్యారేజీపై పెట్టాల్సిన దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి విగ్రహం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. అది కూడా త్వరలో చేరుకుంటుందని తెలిపారు. దసరా నాటికి అవుకు టన్నెల్–2 సిద్ధం చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.
వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ – 2పనులపైనా సీఎం సమీక్ష
ఏప్రిల్‌లో 387.3 మీటర్లు, మేలో 278.5 మీటర్లు, జూన్‌లో 346.6 మీటర్లు, జులైలో ఇప్పటి వరకూ 137.5 మీటర్ల పనులు చేశామన్నారు అధికారులు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలన్న ఉద్దేశాన్దని సీఎం వ్యక్తం చేశారు. ఈ మేరకు పనులు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. నెల వారీగా కార్యాచరణ సిద్ధంచేయాలని సీఎం అన్నారు.
వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 ఫేజ్–2 పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయని, అక్టోబరులో ప్రారంభోత్సవానికి సిద్ధంచేస్తామన్నారు అధికారులు. అదే సమయంలో గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలానికి నీరందించే ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన కార్యక్రమం చేపడతామని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, మహేంద్రతనయ, తారకరామతీర్థసాగర్, గజపతినగరం బ్రాంచ్ కెనాల్, రాయలసీమలోని జొలదరాశి, రాజోలిబండ, కుందూ లిఫ్ట్, వేదవతి, ఆర్డీఎస్ ప్రాజెక్టులు, వీటితోపాటు చింతలపూడి, వైఎస్సార్ పల్నాడు, మడకశిర బైపాస్ కెనాల్, బైరవానితిప్ప, వరికెశెలపూడి కలుపుకుని మొత్తం 27 ప్రాజెక్టులను ప్రాధాన్యతాక్రమంలో పూర్తి చేయడానికి లక్ష్యాలను సీఎం నిర్దేశించారు.
కర్నూలు పశ్చిమ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి.
దశాబ్దాల తరబడి పశ్చిమ కర్నూలు ప్రాంతం బాగా వెనకబడి ఉందని, ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. నీటి వసతుల పరంగా, సౌకర్యాల పరంగా అత్యంత వెనకబడ్డ ప్రాంతం, దశాబ్దాలుగా ఇక్కడ నుంచి కొనసాగుతున్న వలసలను నివారించడానికి కార్యాచరణ సిద్ధంచేయాలని, భూమిలేని వారికి కనీసం ఒక ఎకరా భూమినైనా ఇవ్వాలని, ఈ ప్రాంతంలో ఇరిగేషన్, తాగునీటి పథకాలను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేయాలన్నారు.