Nellore Rottela Pandaga: నాలుగు రోజుల ముందుగానే నెల్లూరులో సందడే సందడి, రొట్టెల పండుగ విశేషాలివే
Rottela Pandaga In Nellore: నెల్లూరులో ఘనంగా నిర్వహించే రొట్టెల పండగకు నాలుగు రోజుల ముందుగానే నెల్లూరులో సందడి వాతావరణం నెలకొంది.
Nellore Rottela Pandaga: నెల్లూరు బారాషహీద్ రొట్టెల పండగ ఈనెల 9నుంచి 13వరకు జరగాల్సి ఉంది. రొట్టెల పండుగ నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే దూర ప్రాంతాల నుంచి భక్తులు అప్పుడే నెల్లూరు చేరుకుంటున్నారు. పండగకు నాలుగు రోజుల ముందుగానే నెల్లూరులో సందడి వాతావరణం నెలకొంది.
గంధ మహోత్సవం స్పెషల్..
రొట్టెల పండగలో ప్రధాన ఘట్టం గంధ మహోత్సవం. పవిత్ర గంధాన్ని ముజావర్లు దర్గాలోని సమాధులపై లేపనం చేస్తారు. అనంతరం ఆ గంధాన్ని స్వర్ణాల చెరువులో కలుపుతారు. ఆ తర్వాత చెరువులోని నీటికి మహత్యం వస్తుందని అందులో పవిత్ర స్నానమాచరిస్తారు భక్తులు. అదే సమయంలో స్వర్ణాల చెరువులో నిలబడి రొట్టెలు మార్చుకుంటారు. కోర్కెల రొట్టెలను స్వీకరిస్తారు.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ, తదితర ప్రాంతాల నుంచి భక్తులు ముందుగానే నెల్లూరుకి వస్తున్నారు. కార్లు, మినీ లారీల్లో కుటుంబ సమేతంగా దర్గాకు చేరుకుంటున్నారు. పండగ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుందని ముందుగానే భక్తులు తమ ప్రయాణాలు మొదలు పెడుతున్నారు. దర్గాకు చేరుకుని అమరవీరుల సమాధులను దర్శించుకొని ఫాతెహాలు చేస్తున్నారు భక్తులు. అనంతరం స్వర్ణాల చెరువులో రొట్టెలను మార్పిడి చేసుకున్నారు.
పగడ్బందీగా ఏర్పాట్లు..
మరోవైపు అధికారులు రొట్టెల పండగ కోసం పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. అడుగడుగునా తనిఖీలు చేసేందుకు స్పెషల్ పార్టీ పోలీసులుకు డ్యూటీలు వేశారు. నగరంలోకి వచ్చే మార్గాలన్నిటిలో బారికేడ్లు ఏర్పాటు చేసి, ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తున్నారు. పార్కింగ్ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయా ప్రాంతాల్లో మట్టి చదును చేసి వాహనాలు నిలిపేందుకు అనుకూలంగా చేస్తున్నారు.
అందంగా ముస్తాబైన దర్గా..
పండగకు ఇక నాలుగు రోజులే ఉండటంతో దర్గాను వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో విద్యుత్ దీపాలంకరణతో అందంగా ముస్తాబు చేస్తున్నారు. వాటర్ ప్రూఫ్ తో ఆకర్షణీయ గుడారాలు, బారికేడ్లు ఏర్పాటుచేశారు. పెయింటింగ్ పనులు పూర్తి చేశారు. మరోవైపు నగరపాలక సంస్థ, పలు శాఖల ఆధ్వర్యంలో దర్గా ప్రాంగణంలోకి ప్రవేశించే మూడు మార్గాల నుంచి భక్తుల రాకపోకలు సాగేలా సన్నాహాలు చేపట్టారు. వివిధ శాఖల తాత్కాలిక కార్యాలయాలు, దర్గా ప్రాంగణం మొత్తం వెలుతురు ఉండేలా ప్రత్యేక విద్యుదీపాల టవర్లు అందుబాటులోకి తెచ్చారు. భక్తుల విశ్రాంతికి శిబిరాలు వేస్తున్నారు. స్వర్ణాల ఘాట్‌లో నీటిని శుభ్రం చేస్తున్నారు.
గత రెండేళ్లుగా కరోనా వల్ల రొట్టెల పండగ సందడి లేదు. కేవలం ముజావర్లు మాత్రమే బారాషహీద్ దర్గాకు వచ్చి గంధ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ ఏడాది రొట్టెల పండగను భారీ హంగామాతో నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రద్దీ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో అటు భక్తులు కూడా ముందుగానే నెల్లూరుకు వచ్చి దర్గాను దర్శించుకుని వెళ్లిపోతున్నారు.