Nellore Police: నెల్లూరు పోలీసుల మర్యాదలే వేరబ్బా.. నిజమేనా అని డౌటా..! అయితే ఇది చదవండి
స్పందన కార్యక్రమాలకోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే బాధితులు వసతులు లేక ఇబ్బంది పడుతుంటారు. కానీ నెల్లూరు పోలీసులు మాత్రం వారి ఇబ్బందుల్ని గమనించారు. మధ్యాహ్న భోజనంతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించారు.
సహజంగా తెలుగు రాష్ట్రాల్లో గోదావరి జిల్లాల వారి మర్యాదలు బాగుంటాయని అంటారు. బంధుత్వం లేకపోయినా ఇంటికొచ్చిన అతిథులకు అన్ని మర్యాదలు చేస్తుంటారు. కానీ ఇక్కడ నెల్లూరు జిల్లా పోలీసులు కూడా అలాంటి మర్యాదలే చేస్తున్నారు. సహజంగా పోలీసుల మర్యాదలంటే నెగెటివ్ మీనింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ నిజంగా పోలీసులు నిజమైన మర్యాదలే చేస్తున్నారు. వారం వారం జరిగే స్పందన కార్యక్రమానికి తమ బాధలు చెప్పేందుకు వచ్చే బాధితులకు తామే స్వయంగా భోజనాలు పెడుతున్నారు. భోజనం అంటే ఆషామాషీ కాదు, స్వీటు, హాటు, అన్నీ ఉంటాయి. ఉన్నతాధికారులు తామే స్వయంగా భోజనం వడ్డిస్తూ ఫ్రెండ్లీ పోలీసింగ్ కి సరికొత్త నిర్వచనం చెబుతున్నారు.
స్పందన కార్యక్రమాలకోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే బాధితులు అక్కడ సరైన వసతులు లేక ఇబ్బంది పడుతుంటారు. కానీ నెల్లూరు పోలీసులు మాత్రం వారి ఇబ్బందుల్ని గమనించారు. వారికి మధ్యాహ్న భోజనంతోపాటు ఇతర అన్ని సౌకర్యాలు కల్పించారు. స్పందన కార్యక్రమానికి వచ్చే బాధితులకోసం టెంట్లు వేసి అక్కడే కూర్చునే సౌకర్యం కల్పించారు. నేరుగా పోలీసులే వారి వద్దకు వచ్చి అర్జీలు తీసుకుంటారు. అర్జీలు ఇవ్వలేని వారి నుంచి సమాచారం సేకరించి తామే వివరాలు నమోదు చేసుకుని వాటి పరిష్కార మార్గాలు సూచిస్తారు. వికలాంగులు, వృద్ధుల వద్దకు నేరుగా పోలీసులే వెళ్లి వివరాలు సేకరిస్తారు.
జిల్లా ఎస్పీ విజయరావు సారధ్యంలో స్పందన కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందని చెబుతున్నారు అధికారులు. స్పందన కార్యక్రమానికి వచ్చిన వారి సమస్యలకు వెంటనే పరిష్కారం లభించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు.
కొవిడ్19 ప్రొటోకాల్ పాటిస్తూ..
నెల్లూరు జిల్లాలో కొవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా జిల్లా కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమాన్ని రద్దు చేశారు. అయితే పోలీసులు మాత్రం స్పందన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. కొవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ భౌతిక దూరం పాటిస్తూ అర్జీలు స్వీకరిస్తున్నారు.
జిల్లా పోలీసులపై ప్రశంసలు..
స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్న తీరుపై నెల్లూరు జిల్లా పోలీసులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. స్పందన కార్యక్రమానికి వచ్చే బాధితులు తమ సమస్య పరిష్కారం అవుతుందనే భరోసాతో వెళ్తున్నారు. మరోవైపు దూర ప్రాంతాలనుంచి వచ్చేవారు అక్కడ పోలీసులు ఏర్పాటు చేస్తున్న సౌకర్యాల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో జిల్లా వాసుల్ని నెల్లూరు అధికారులు ఆకట్టుకుంటున్నారు.
ఇటీవల నెల్లూరు జిల్లాలో వరదల సమయంలో కూడా జిల్లా పోలీసుల పనితీరుని పలువురు అభినందించారు. దిశ యాప్ డౌన్ లోడింగ్ లో కూడా జిల్లా పోలీసు విభాగం రాష్ట్రంలోనే ముందంజలో ఉంది. నేర పరిశోధనలోనే కాదు, ప్రజలకు స్నేహ భావంతో దగ్గరయ్యే విషయంలో కూడా నెల్లూరు జిల్లా పోలీసులు ముందంజలో ఉన్నారు.
Also Read: Also Read: మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్‌పై సైబర్ అటాక్.. ప్లాన్ ప్రకారం ఖాతాలు తెరిచి రూ.12 కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్లు