Rottela Pandaga: నెల్లూరులో ఘనంగా మొదలైన రొట్టెల పండగ - 4 రాష్ట్రాల నుంచి తరలివస్తున్న భక్తులు
Rottela Pandaga: స్వర్ణాల చెరువు పక్కనే బారాషహీద్ దర్గా ఉంటుంది. ఆ దర్గాలో 12మంది సమాధులుంటాయి. ఆ సమాధులకు గంధాన్ని లేపనం చేయడమే గంధ మహోత్సవం. దీనికోసం కడప దర్గా పీఠాధిపతి నెల్లూరుకు వస్తారు.
రెండేళ్లుగా కరోనా వల్ల సందడి తగ్గిన నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండగ.. ఈ ఏడాది ఘనంగా మొదలైంది. ఇప్పటికే అధికారులు, నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది పండగను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోనే కాకుండా ఇతర ప్రాంతాలనుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా ఈ పండగ నిలుస్తుంది.
రొట్టెలు మార్చుకునేందుకు తరలివస్తున్న భక్తులు
అధికారికంగా గంధ మహోత్సవం అనంతరం పవిత్ర గంధాన్ని స్వర్ణాల చెరువులో కలుపుతారు. ఆ తర్వాత ఆ చెరువు నీటికి పవిత్రత, రోగాలను హరించే శక్తి వస్తుందని నమ్మకం. ఆ తర్వాత స్వర్ణాల చెరువులో స్నానమాచరించి, ఆ నీటిని తలపై చల్లుకుని, రొట్టెలు మార్చుకుంటారు. అయితే గంధ మహోత్సవం కంటే వారం ముందుగానే రొట్టెలు మార్చుకునే కార్యక్రమం ఇక్కడ మొదలవుతుంది. పండగ పూర్తయిన వారం రోజులు కూడా భక్తుల రాక తగ్గదు.
కార్యక్రమాల వివరాలివీ..
9వ తేదీ మంగళవారం సొందల్ మాలి
10వ తేదీ బుధవారం గంధ మహోత్సవం
11వ తేదీ గురువారం రొట్టెల పండగ (అధికారికంగా మొదలు)
12వ తేదీ శుక్రవారం తహలీల్ ఫాతెహా
13వ తేదీ ముగింపు ఉత్సవం..
గంధమహోత్సవం అంటే..
స్వర్ణాల చెరువు పక్కనే బారాషహీద్ దర్గా ఉంటుంది. ఆ దర్గాలో 12మంది సమాధులుంటాయి. ఆ సమాధులకు గంధాన్ని లేపనం చేయడమే గంధ మహోత్సవం. దీనికోసం కడప దర్గా పీఠాధిపతి ఆరిఫ్ ఉల్లా హుసేనీ నెల్లూరుకు వస్తారు. ఆయన చేతుల మీదుగా గంధ లేపనం చేస్తారు. ఆ గంధాన్ని భక్తులకు పంచిపెడతారు. దేశ విదేశాలకు కూడా ఆ గంధాన్ని ఇక్కడివారు బంధువులకు పంపిస్తుంటారు. నెల్లూరు నగరంలోని కోటమిట్ట అమీనియా మసీదు నుంచి 12 బిందెల్లో గంధాన్ని కలుపుకొని ఊరేగింపుగా తీసుకొస్తారు. అర్థరాత్రి జరిగే ఈ గంధమహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా దర్గాకు తరలి వస్తారు.
మత సామరస్యం..
దర్గాకు వచ్చే భక్తుల్లో హిందువులు, ముస్లింలు ఇతర మతాలవారు ఉంటారు. దర్గా ప్రాంగణంలో సమాధులను దర్శించుకుని అనంతరం, స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటారు. ఇతర రోజుల్లో కూడా దర్గా ప్రాంగణం భక్తులతో సందడిగా ఉంటుంది. గంధ మహోత్సవం సందర్భంగా జరిగే ఐదురోజుల రొట్టెల పండగ సమయంలో మాత్రం కిక్కిరిసి పోతుంది.
రొట్టెలు ఇలా మార్చుకుంటారు..
గతంలో తమ కోర్కెలు నెరవేరినవారు ఆ పేరుతో రొట్టెలు తయారు చేసి ఇక్కడకు తెస్తారు. ఆ అవకాశం లేనివారు అక్కడే రొట్టెలు కొనుగోలు చేసి వాటిని ఫలానా రొట్టె అని పంచిపెడతారు. ఆరోగ్య రొట్టె, ఐశ్వర్య రొట్టె, ఉద్యోగ రొట్టె, చదువు రొట్టె, వివాహ రొట్టె, సంతాన రొట్టె.. ఇలా అన్ని రకాల రొట్టెలను ఇక్కడ భక్తులు వేరొకరికి ఆశీర్వదించి ఇస్తుంటారు. ఆరోగ్య రొట్టెకు బాగా డిమాండ్ ఉంటుంది. గతేడాది దర్గాకు వచ్చి మొక్కుకుని, తమకు ఆరోగ్యం బాగైన తర్వాత తిరిగి ఈ ఏడాది వచ్చి ఆరోగ్య రొట్టెను పంచిపెడుతుంటారు. ఈ ఏడాది 15లక్షలమంది భక్తులు ఈ ఐదురోజుల్లో నెల్లూరుకు వస్తారని అంచనా.
Also Read: Nellore Rottela Pandaga: నాలుగు రోజుల ముందుగానే నెల్లూరులో సందడే సందడి, రొట్టెల పండుగ విశేషాలివే