తొలిసారిగా బ్లడ్ డొనేషన్ కోసం మొబైల్ వ్యాన్లు- నెల్లూరులో ప్రారంభం
నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ కార్యాలయంలో మొబైల్ బ్లడ్ డోనేషన్ ,మొబైల్ వాక్సినేషన్ వాహనాలను ప్రారంభించారు. ఈ వాహనాల్లో ఎక్కడికైనా వెళ్లి రక్తాన్ని సేకరించవచ్చు.
రక్తదాతలు ఉత్సాహంగా ఉన్నా కొన్ని సందర్భాల్లో బ్లడ్ క్యాంప్ లు నిర్వహించడం సాధ్యం కాదు. మారుమూల ప్రాంతాలకు వెళ్లి రక్తాన్ని సేకరించడం కూడా అసాధ్యం అనే చెప్పాలి. అయితే ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ నెల్లూరులోని రెడ్ క్రాస్ సంస్థ మొబైల్ బ్లడ్ కలెక్టింగ్ వెహికల్స్ ని ప్రారంభించింది. ఈ వాహనాల్లో ఎక్కడికైనా వెళ్లి రక్తాన్ని సేకరించవచ్చు. డోనార్లు ఆసక్తి గా ఉంటే ఏ మారు మూల ప్రాంతాల్లో అయినా బ్లడ్ డొనేషన్ క్యాంప్ లు ఏర్పాటు చేయొచ్చు.
మొబైల్ బ్లడ్ డొనేషన్ వెహికల్ తో పాటు, మొబైల్ వ్యాక్సినేషన్ వెహికల్ ని కూడా నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల రూరల్ ఏరియాల్లో వ్యాక్సినేషన్ ఎంత కష్టంగా మారిందో అందరికీ తెలుసు. కరోనా సమయంలో వ్యాక్సిన్ సరఫరా, నిల్వ, వ్యాక్సిన్లు ఇవ్వడం కష్టతరంగా మారింది. వీటికి చెక్ పెడుతూ వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ వెహికల్ ని ఏర్పాటు చేశారు. ఏ ప్రాంతానికయినా వ్యాక్సిన్లను ఈ వాహనం సరఫరా చేస్తుంది. నిల్వ చేసుకునే వెసులుబాటు కూడా ఇందులో ఉంది.
నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ కార్యాలయంలో మొబైల్ బ్లడ్ డోనేషన్ ,మొబైల్ వాక్సినేషన్ వాహనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, కలెక్టర్ చక్రధర్ బాబు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిదులుగా హాజరయ్యారు. ముందుగా మంత్రి కాకాణి ఎన్.సి.సి. విద్యార్దుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం మొబైల్ వాహనాలను ప్రారంభించారు.
మొబైల్ బ్లడ్ డొనేషన్ వెహికల్ ధర రూ.63 లక్షలు
మొబైల్ వ్యాక్సినేషన్ వెహికల్ ధర రూ. 41 లక్షలు
కలెక్టర్ చక్రధర్ బాబుతో కలసి మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఈ వాహనాలను ప్రారంభించారు. ఈ రెండు వాహనాల ద్వారా అందించే సేవలను నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి వారికి వివరించారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలతో పాటు మొబైల్ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలను చేపట్టేందుకు, వ్యాక్సినేషన్ కోసం రెడ్ క్రాస్ సంస్థ రెండు అదునాతనమైన వాహనాలను అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరంగా ఉందన్నారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. మొబైల్ బ్లడ్ డొనేషన్ వాహనం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో యువతను రక్తదానం చేసేందుకు ప్రోత్సహించి రక్త నిల్వలు పెంపొందించేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారాయన. రెడ్ ర్రాస్ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు చోరవతో రెడ్ క్రాస్ సమర్దవంతంగా సేవలందిస్తుందని అభినందించారు. రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలకు గాను జాతీయ స్దాయిలో గుర్తింపు లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మంత్రి. రాబోయే రోజుల్లో రెడ్ క్రాస్ మరిన్ని ప్రాజెక్ట్ లను చేపట్టేందుకు ప్రోత్సాహం అందిస్తామని మంత్రి తెలిపారు. ఈ వాహనాలు తక్షణం అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతానికి బ్లడ్ డొనేషన్ వెహికల్ లో ఒకేసారి ముగ్గురు మాత్రమే రక్తదానం చేయడానికి అవకాశముంది. త్వరలో 6 సీట్లు ఉన్న మరో వాహనాన్ని అందుబాటులోకి తీసుకొస్తారు.