తూర్పు రాయలసీమలో ఒక ఓటు అటు, ఒక ఓటు ఇటు
టీచర్ల నియోజకవర్గంలో వైసీపీకి ఓటు వేస్తే, పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా అటువైపే మొగ్గుచూపే అవకాశముంది. కానీ తూర్పురాయలసీమలో సీన్ రివర్స్ అయింది. టీచర్లు ఒకటి అటు ఒకటి ఇటు వేశారని తెలుస్తోంది.
ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించింది. ఉత్తర రాయలసీమలో టీచర్ల నియోజకవర్గంలో వైసీపీ క్లియర్ విక్టరీ సాధించింది. పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా పెద్దగా తేడా లేదు. ఇక తూర్పు రాయలసీమ విషయానికొచ్చేసరికి టీచర్ల నియోజకవర్గంలో వైసీపీ గెలిచింది, పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ విక్టరీ సాధించింది. అసలేం జరిగింది..?
టీచర్ల ఓటు, పట్టభద్రుల ఓటు ఒక పార్టీకే, లేదా ఒక పార్టీ బలపరచిన అభ్యర్థికే పడాలని రూలేమీ లేదు. కానీ టీచర్లంతా పట్టభద్రులే. వారు కచ్చితంగా రెండు ఓట్లు వినియోగించుకుంటారు. టీచర్ల నియోజకవర్గంలో వైసీపీకి ఓటు వేస్తే, పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా అటువైపే మొగ్గుచూపే అవకాశముంది. కానీ తూర్పురాయలసీమలో సీన్ రివర్స్ అయింది. టీచర్లు ఒకటి అటు ఒకటి ఇటు వేశారని తెలుస్తోంది.
టీచర్ల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విజయం సాధించారు. అదే సమయంలో ఆపార్టీ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఓడిపోయారు. ఓటమిలో కూడా పోటీ ఏమీ లేదు. నాలుగు రౌండ్లకే ఫలితం తేటతెల్లమైంది, అభ్యర్థి పేర్నాటి కౌంటింగ్ సెంటర్ విడిచి వెళ్లిపోయారు. టీడీపీ నిలబెట్టిన అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ క్లియర్ విక్టరీ సాధించారు.
పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా వైసీపీ మొదటి నుంచీ వ్యూహాత్మకంగానే ఉంది. రాజకీయ నేపథ్యం ఉన్న పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి అభ్యర్థిత్వంపై ఎమ్మెల్యేలంతా పాజిటివ్ గానే ఉన్నారు. అన్ని చోట్లా, సభలు, సమావేశాలు పెట్టి ఓట్లు అభ్యర్థించారు. ఎమ్మెల్యేలు కూడా స్వయంగా ప్రచారం చేశారు. కానీ రిజల్ట్ తేడా కొట్టింది.
నెల్లూరు జిల్లాలో అప్పటి వరకూ ఇద్దరు అభ్యర్థుల తరపున ప్రచారం చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు సడన్ గా రెబల్స్ గా మారడం కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపించింది. టీచర్ ఎమ్మెల్సీ విజేత చంద్రశేఖర్ రెడ్డికి న్యూట్రల్ ఇమేజ్ ఉండటంతో రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం కూడా ఆయనకు మద్దతు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో పేర్నాటికి వ్యతిరేకంగా వారిద్దరూ పనిచేశారని, అందుకే ఓట్లు చీలిపోయాయని చెబుతున్నారు.
కందుకూరులో చంద్రబాబు సభలో ఊహించని ప్రమాదం జరిగినా.. అప్పటికే జనాల్లో టీడీపీపై కాస్తో కూస్తో సింపతీ పెరుగుతూ కనపడింది. అది ఈ ఎన్నికల్లో క్లియర్ గా తేలిపోయింది. ఇక చిత్తూరు జిల్లాలో నారా లోకేష్ యాత్ర కూడా ఎన్నికల్లో పరోక్షంగా టీడీపీకి మేలు చేసిందనే అభిప్రాయం కూడా ఉంది. టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ కి కూడా విద్యాసంస్థలు ఉండటం ఆయన కూడా విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల ముందునుంచీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. చివరకు విజయం సాధించారు.
వైసీపీ అభ్యర్థి పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డికి లిక్కర్ స్కామ్ లో ప్రమేయం ఉందని టీడీపీ చేసిన ప్రచారం కూడా ఫలించింది. దీంతో తూర్పు రాయలసీమలో పట్టభద్రులు టీడీపీకి పట్టం కట్టారు. టీచర్లు ఒక ఓటు అటు, ఒకఓటు ఇటు వేశారు. దీంతో ఫలితం ఇలా మిశ్రమంగా వచ్చింది.