Gudur Car Accidents : తప్పతాగి కారు డ్రైవింగ్- గూడూరులో వరుస ప్రమాదాలు
ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో బుధవారం మద్యం మత్తులో కారు నడిపిన కొందరు యువకులు బీభత్సం సృష్టించారు. ఈ దుర్ఘటన మరువక ముందే సరిగ్గా అలాంటి ప్రమాదమే గూడూరులో మళ్లీ జరిగింది.
వరుస కారు ప్రమాదాలు. అది కూడా ఒకే ఊరిలో, కారణాలు కూడా ఒకటే. ఇదేదో వింతగా ఉంది అనుకోవద్దు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో ఈ ప్రమాదాలు జరిగాయి. ఒక ప్రమాదం జరిగి 48 గంటలు గడవక ముందే అదే ఊరిలో అలాంటి ప్రమాదమే జరిగింది. దీంతో ఈ వరుస ఘటనలో స్థానికంగా కలకలం రేపాయి.
తప్పతాగి..
ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో బుధవారం మద్యం మత్తులో కారు నడిపిన కొందరు యువకులు బీభత్సం సృష్టించారు. ఈ ప్రమాదంలో అనేకమందికి గాయాలయ్యాయి. పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాపాయంతో ఉన్నట్టు సమాచారం. ఈ దుర్ఘటన మరువక ముందే సరిగ్గా అలాంటి ప్రమాదమే గూడూరులో మళ్లీ జరిగింది. తప్పతాగి వాహనం నడిపి ఓ వ్యక్తి ఇద్దరిని ఢీకొట్టాడు. వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఇక్కడ కారు నడిపింది ఓ ప్రభుత్వ ఉద్యోగి కావడం విశేషం.
పట్ట పగలే మద్యం సేవించి విద్యుత్ ఉద్యోగి కారుతో బీభత్సం సృష్టించాడు. శుక్రవారం సాయంత్రం 3 గంటల ప్రాంతంలో గూడూరు పట్టణ సమీపంలోని లెమన్ మార్కెట్ ప్రాంతంలో విద్యుత్ శాఖలో పనిచేసే మల్లి కోటేశ్వరరావు అనే ఉద్యోగి తప్ప తాగి నిర్లక్ష్యంగా కార్ డ్రైవ్ చేయడంతో బైక్ పై వెళుతున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సైదాపురానికి చెందిన మూర్తి, వినోద్ అనే ఇద్దరు యువకులను కారు బలంగా ఢీకొంది. మూర్తి అనే యువకుడి కాలు పూర్తిగా విరిగిపోవడంతో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక వైద్యం అందించి మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించారు. వినోద్ అనే యువకుడికి కూడా గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన తర్వాత కూడా మల్లి కోటేశ్వర రావు కారు ఆపకుండా పట్టణంలోకి దౌడు తీయించాడు. అతని డ్రైవింగ్ తో పలువురు వాహనదారులు, ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అదృష్టం బాగుండి ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. వెంటనే పోలీసులు కారుని ఆపారు, విద్యుత్ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బుధవారం జరిగిన ఘటనలో నిందితులు తిరుపతికి చెందిన వారిగా గుర్తించారు. తిరుపతికి చెందిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ సంస్థ వద్ద కారుని అద్దెకు తీసుకున్నారు. కారు నడిపిన యువకుడితో సహా అందులో ఉన్న యువకులంతా మద్యం తాగి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. శుక్రవారం జరిగిన ఘటనలో కూడా కారు నడిపిన ప్రభుత్వ ఉద్యోగి మద్యం మత్తులో ఉన్నాడు. పట్టపగలే వీరు మద్యం తాగి కారు నడపడం ఈ ప్రమాదాలకు కారణం అయింది.
తప్పతాగి కారు నడుపుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వినపడుతున్నాయి. మద్యం మత్తులో కారు నడిపుతూ పట్టపగలే వీధుల్లోకి వస్తున్నారు, వీరంగం సృష్టిస్తున్నారు. దీంతో రద్దీగా ఉండే రోడ్లలో కార్లు మృత్యు శకటాల్లా మారిపోతున్నాయి. గూడూరు రోడ్లపై వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు పోలీసులు నిర్లక్ష్యాన్ని వేలెత్తి చూపిస్తున్నాయి. పట్టణంలోని కూడళ్లలో పోలీసులు విధులు నిర్వహిస్తున్నా, ఇలాంటి వారిని గమనించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు స్థానికులు. బుధవారం ప్రమాదం జరిగిన తర్వాత, కనీసం వాహనాల తనిఖీలు ముమ్మరం చేసినా శుక్రవారం మరో ఘటన జరిగేది కాదు. వరుస ప్రమాదాల వల్ల ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. వారి కుటుంబాలకు భరోసా ఎవరిస్తారని ప్రశ్నిస్తున్నారు.