Nellore TDP : నెల్లూరులో రూ.70 కోట్ల భూ కుంభకోణం, కలెక్టర్ పై టీడీపీ సంచలన ఆరోపణలు!
Nellore TDP : ఇప్పటి వరకూ వైసీపీ నేతల్ని తీవ్రంగా విమర్శించిన టీడీపీ నేతలు నెల్లూరు కలెక్టర్ పై మండిపడ్డారు. కలెక్టర్ కూడా అవినీతిలో భాగస్వామి అయ్యారంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
Nellore TDP : దోచుకున్నారని, దాచుకుంటున్నారని, అక్రమాలు చేస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని ఇప్పటి వరకూ వైసీపీ నేతల్ని తీవ్రంగా విమర్శించారు టీడీపీ నేతలు. కానీ తొలిసారిగా నెల్లూరు జిల్లాలో కలెక్టర్ కూడా ఈ అవినీతిలో భాగస్వామి అయ్యారంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాఫియాలా తయారయ్యారని, లే అవుట్లతో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని ఆరోపిస్తున్న టీడీపీ నేతలు, అందులో నెల్లూరు జిల్లా కలెక్టర్ తోపాటు, ఇద్దరు సీనియర్ ఐఏఎస్ లకు కూడా వాటా ఉందని అంటున్నారు. అది నిజం కాదని నిరూపించుకోవాలంటే శ్రీధర్ రెడ్డి వేసిన లే అవుట్ పై చర్యలు తీసుకుని కలెక్టర్ తన నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.
సీబీఐకి లేఖ
అవినీతికి పాల్పడ్డ అధికారులపై విజిలెన్స్ విచారణ కోరబోతున్నట్టు తెలిపారు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ ఇన్ చార్జ్ అబ్దుల్ అజీజ్. ఈమేరకు సీబీఐకి లేఖ రాయబోతున్నట్టు చెప్పారాయన. భూ కుంభకోణాల కోసమే ఇటీవల నెల్లూరు రూరల్ పరిధిలో చుక్కల భూములకు ఉన్న అడ్డంకులు తొలగించారని చెప్పారు. దొంగ రాజకీయ నాయకులతో దొంగ అధికారులు కలిసి ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు టీడీపీ నేతలు.
23 ఎకరాల్లో లే అవుట్
నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని అల్లీపురం వద్ద శ్రీ లక్ష్మీ భగవాన్ వెంకయ్య స్వామి స్మార్ట్ సిటీ పేరుతో వేస్తున్న లేఅవుట్ ను టీడీపీ నాయకులు పరిశీలించారు. అది అక్రమ లేఅవుట్ అంటూ ఆరోపణలు గుప్పించారు. ఆ ఒక్క లేఅవుట్ లోనే 70కోట్ల రూపాయలు చేతులు మారాయన్నారు. దాదాపు 23 ఎకరాల స్థలంలో లేఅవుట్ వేశారని అయితే ఈ స్థలంలో జాఫర్ సాహెబ్ కాలువ, లేబూరు కాలువ, గుడిపల్లిపాడు కాలువ.. సహా మొత్తం 4 కాల్వలు పోతున్నాయని చెప్పారు. ఆ నాలుగు కాల్వలకు, ఒక డ్రెయిన్ కు సంబంధించిన 4.5 ఎకరాల ఇరిగేషన్ శాఖ భూమిని ఆక్రమించి లేఅవుట్ లో కలిపి రోడ్లు వేసేస్తున్నారని తెలిపారు.
ఇరిగేషన్ కాలువపై బ్రిడ్జి
లే అవుట్ లోకి రావడం కోసం ఇరిగేషన్ కాలువపై ఒక అనుమతిలేని బ్రిడ్జిని నిర్మించారని, పక్కనే వంద మీటర్ల దూరంలో మరో బ్రిడ్జి ఉందని, పక్కపక్కనే రెండు బ్రిడ్జి లకు అనుమతి ఇవ్వరని తెలిపారు టీడీపీ నేతలు. ఈ కాలువల కింద 40 నుంచి 50 వేల ఎకరాల ఆయకట్టు ఉందని, కాలువలలో డీసెల్టింగ్ చేయడానికి కూడా వీలు లేకుండా స్థలం లేకుండా చేసి స్మార్ట్ సిటీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు ఉన్న భూమి ఎంత, వేస్తున్న లే అవుట్ పరిధి ఎంత అని ప్రశ్నించారు. నుడా పరిమితులను ఉల్లంఘించి, పర్మిషన్లు లేకుండా లే అవుట్ వేస్తున్నారని, సామాన్య ప్రజలను మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. పరిమితులు పాటించకుండా ఇరిగేషన్ శాఖ స్థలాన్ని ఆక్రమించి 86 కోట్ల రూపాయలకు అమ్మవలసిన స్థలాన్ని 150 కోట్లకు అమ్ముతున్నారని కేవలం ఒక లేఅవుట్లోనే 70 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. దీనికోసమే హడావిడిగా చుక్కల భూముల లిస్ట్ లోనుంచి దీన్ని తొలగించారని అన్నారు.
నెల్లూరు రూరల్ పరిధిలో చుక్కల భూములు ఉన్న ప్రతి చోటా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి భూములు ఉన్నాయని, అందుకే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి చుక్కల భూములను తీయించేశారని విమర్శించారు. 70 కోట్ల రూపాయల కుంభకోణం గురించి తెలియజేయడానికి రెండు రోజుల నుంచి కలెక్టర్ తో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటే, అందుబాటులోకి రాలేదని ఆరోపించారు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ వారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అందరూ కుమ్మక్కైపోయారని విమర్శించారు.
విశాఖలో సెటిల్మెంట్..?
విశాఖపట్నంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు ఐదు కోట్ల రూపాయలు లంచం ఇచ్చినట్టు విమర్శలు వస్తున్నాయని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ కుంభకోణంలో కేవలం రాజకీయ నాయకులకే కాదు అధికారుల హస్తం కూడా ఉందని అన్నారు. నుడా అధికారులు కూడా ఈ విషయంలో ఏమీ పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. ఇంటి ముందు మట్టి వేస్తేనే వారిని రాత్రి పగలు నిద్రపోనివ్వకుండా ఫైన్లు వసూలు చేస్తారని అలాంటిది 22 ఎకరాల్లో నాలుగున్నర ఎకరా ఇరిగేషన్ శాఖ భూమిని ఆక్రమిస్తుంటే అధికారులకు తెలియడం లేదా అని మండిపడ్డారు. రూ.70 కోట్ల కుంభకోణంలో కలెక్టర్, ఎస్సీ, నుడా వైస్ చైర్మన్, సెక్రటేరియట్ లో ఇద్దరు సీనియర్ ఐఏఎస్ ల హస్తం ఉందని, విమర్శలు వస్తున్నాయని, వీటన్నిటి పై విజిలెన్స్ విచారణ చేపట్టారని కోరుతున్నామని, సిబిఐ కి కూడా లేఖ రాయబోతున్నామని తెలిపారు టీడీపీ నేతలు.