Chandrababu : వచ్చే ఎన్నికల్లో టీడీపీ అన్ స్టాపబుల్, ఇక జగన్ ఇంటికే - చంద్రబాబు
Chandrababu : టీడీపీ సభలకు వచ్చి చూస్తే అసలు విషయం తెలుస్తుందని సీఎం జగన్ కు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు.

Chandrababu :సీఎం జగన్ టీడీపీ మీటింగులపై అవాకులు చవాకులు పేలుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కోవూరు రోడ్ షోలో చంద్రబాబు మాట్లాడారు. జగన్ ఇక్కడికి వచ్చి మా మీటింగ్ చూస్తే తెలుస్తుందన్నారు. మేము ఏదో షో చేస్తున్నాం అంటున్నారు కదా వచ్చి చూస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు. అందరూ మీటింగ్ పెట్టే ప్రాంతంలోనే తాము మీటింగ్ పెడుతున్నామన్నారు. కందుకూరులో ప్రమాద ఘటనలో టీడీపీ కార్యకర్తలు చనిపోయారని గుర్తుచేశారు. ఈ రోజు ఉన్న పోలీసులు...ఆ రోజు ఉండి ఉంటే ప్రమాదం జరిగేది కాదన్నారు. కందుకూరు ఘటనపై ప్రధాని స్పందించినా జగన్ స్పందించలేదన్నారు. ప్రధాని మంత్రి తల్లి చనిపోయారని, ఆమెకు శాంతి చేకూరాలని దేవుడిని కోరుకుందామన్నారు. ఒక గొప్ప నాయకుడిని అందించిన ఆ మాతృ మూర్తికి నివాళుర్పిద్దామన్నారు.
రాష్ట్రంలో ఒక్కరూ సంతోషంగా లేరు
"కావలి అనేక సార్లు వచ్చాను. ఇంత స్పందన ఎప్పుడూ చూడలేదు. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక ఉంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ కోసం మళ్లీ టీడీపీ రావాలి అని కోరుకుంటున్నారు. పొట్టి శ్రీరాములు పుట్టిన జిల్లా ఇది. బెజవాడ గోపాల్ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య పుట్టారు, ఎస్పీ.బాలసుబ్రమణ్యం పుట్టిన జిల్లా. ఇంత ఘనమైన జిల్లాలో నేడు పనికి మాలిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అవినీతి పరులు ఉన్నారు. రాష్ట్రంలో ఒక్కరూ సంతోషంగా లేరు. రాష్ట్రంలో అశాంతి ఉంది. రాష్ట్రంలో బాదుడే బాదుడు. అన్ని ధరలూ పెరిగాయి. పెట్రోల్, కరెంట్ ఛార్జీలు, వంట గ్యాస్, నిత్యవసర సరుకులన్నీ పెరిగాయి. ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. చెత్తమీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి. రాష్ట్రంలో భస్మాసురుడు ఒక ఛాన్స్ అన్నాడు...ఇచ్చి మీరు మోసపోయారు." - చంద్రబాబు
కృష్ణపట్నం ప్రైవేట్ పరం
నెల్లూరు జిల్లా పచ్చని పంటలతో ఉండే జిల్లా అని ఎక్కడికి వెళ్లినా నెల్లూరు భోజనం అంటారని చంద్రబాబు తెలిపారు. కానీ నేడు రైతులు తీవ్ర అన్యాయానికి గురయ్యారన్నారు. నెల్లూరు జిల్లాలో జగన్ బట్టలు విప్పడానికి రైతులు సిద్దంగా ఉన్నారని విమర్శించారు. ధాన్యం రైతులను వైసీపీ దళారులు దోచుకుంటున్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో ఆక్వా సాగు నాశనం అయిందన్నారు. నాడు ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్రం నుంచి ఆక్వా ఎగుమతులు ఉండేవని, రూ.1.50 రూపాయలకు ఆక్వాకు యూనిట్ విద్యుత్ అన్న జగన్..ఇప్పుడు జోన్ పరిధి అని లెక్కలు వేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆక్వా రైతులు కష్టాల్లో ఉన్నారని, అయినా సీఎం మాత్రం వీటిపై స్పందించరని విమర్శించారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తారు కానీ రైతుల సమస్యలు పరిష్కరించని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో బీసీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆక్షేపించారు. మైనారిటీలకు రంజాన్ తోఫా లేదన్నారు. కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేస్తున్నారని ఆరోపించారు. కృష్ణపట్నం పోర్ట్ లో అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టి పోర్టు వేరే వారికి కట్టబెట్టారని విమర్శించారు.
సంక్షేమం మొదలుపెట్టింది ఎన్టీఆర్
"జగన్ పాలనలో ఆయన వర్గం కూడా హ్యాపీగా లేరు. మందు బాబులు వద్ద కూడా దోపిడీ చేస్తున్నారు. మద్యం రేట్లు ఎందుకు పెరిగాయి. షాప్స్ లో ఆన్లైన్ పేమెంట్ ఎందుకు లేదు?. పెన్నా నదిలో ఇసుక ఉంది. కానీ కోవూరుకు ఇసుక దొరకడం లేదు. పక్కనే ఇసుక ఉంటుంది కానీ ఎవరికీ ఇసుక దొరకదు. ఇది సైకో పాలన ప్రభావం. ఇసుక దొరక్క నిర్మాణ రంగ కార్మికులు ఎంతగానో నష్టపోతున్నారు. టీడీపీ హయాంలో అన్న క్యాంటీన్ పేదల ఆకలి తీర్చేది. అసమర్థ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. పోలీసులకూ ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం మాట వినకపోతే ఇబ్బందులు పెడుతోంది. నాడు పోలీసులకు ఉండే గౌరవమే వేరు. జనం సభలకు రాకుండా జగన్ వాలంటీర్లు ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమం మొదలుపెట్టింది ఎన్టీఆర్. అన్న క్యాంటీన్ తీసేసిన వ్యక్తి జగన్. "- చంద్రబాబు





















