Nellore News : నెల్లూరులో మెగా ఆర్టిఫిషియల్ లింబ్స్ క్యాంప్, భారీ సంఖ్యలో హాజరైన దివ్యాంగులు
Nellore News : నెల్లూరులో కృత్రిమ అవయవాల పంపిణీ క్యాంప్ ప్రారంభమైంది. ఈ క్యాంప్ కు భారీగా దివ్యాంగులు హాజరయ్యారు.
Nellore News : తెలుగు రాష్ట్రాల్లోని వికలాంగులు జీవితంపై కొత్త ఆశతో అక్కడికి వచ్చారు. ఏళ్ల తరబడి కృత్రిమ అవయవాలకోసం ఎదురు చూసినవారు, ఇక తాము సాధారణ జీవితం గడపలేమని అనుకుంటున్నవారంతా నెల్లూరులో ఉచిత ఆర్టిఫిషియల్ లింబ్ క్యాంప్ కి హాజరయ్యారు. రెండురోజులపాటు జరిగే ఈ క్యాంప్ నెల్లూరులో మొదలైంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రాజ్మల్ కేంరాజ్ భండారి ఫౌండేషన్, భగవాన్ మహావీర్ వికలాంగుల సహాయతా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఈ క్యాంప్ ని ప్రారంభించారు.
ఇతర రాష్ట్రాల నుంచి
దాదాపు 20 రోజుల నుంచి రెడ్ క్రాస్ ద్వారా ఈ క్యాంప్ పై ప్రచారం నిర్వహించారు. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల నుంచే కాకుండా, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక నుంచి కూడా చాలా మంది రిజిస్టేషన్లు చేసుకున్నారు. వారందరికీ ముందస్తుగా అవగాహన కల్పించి, వారి వద్ద వివరాలు నమోదు చేసుకుని, రెండు బ్యాచ్ లుగా విభజించి శని, ఆదివారాల్లో కొలతల కోసం నెల్లూరుకి పిలిపించారు. నెల్లూరులోని మద్రాస్ బస్టాండ్ వద్ద ఉన్న రెడ్ క్రాస్ ఆఫీస్ వద్ద ఈ క్యాంప్ ఏర్పాటుచేశారు. వికలాంగులంతా కృత్రిమ అవయవాల కోసం ఇక్కడకు వచ్చారు.
600 మంది వికలాంగులు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంత పెద్ద మెగా క్యాంప్ జరగలేదని అంటున్నారు నిర్వాహకులు. వీరందరికీ ముందుగా కృత్రిమ అవయవాల నిపుణులు కొలతలు తీసుకున్నారు. వికలాంగులతోపాటు వారి సహాయకులకు కూడా అక్కడే భోజన సౌకర్యాలు కల్పించారు. వారంతా తమకు కొత్త అవయవాలు వస్తాయన్న సంతోషంతో క్యాంప్ నుంచి తిరిగి వెళ్లారు.
600 మందికి ఆర్టిఫిషియల్ లింబ్స్
సహజంగా కృత్రిమ అవయవాలను ఉచితంగా ఇచ్చే సంస్థలు చాలా తక్కువ సంఖ్యలో వాటిని సమకూరుస్తుంటాయి. ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఇలాంటి క్యాంప్ లు కూడా అరుదుగానే నిర్వహిస్తుంటారు. తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రి సహా, పలు ఇతర ఆస్పత్రుల్లో కూడా కృత్రిమ అవయవాలు ఇస్తుంటారు. కానీ నెల్లూరులో మెగా క్యాంప్ లో ఒకేసారి 600 మంది కోసం కొలతలు తీసుకుంటున్నారు. వీరందరికీ త్వరలోనే కృత్రిమ అవయవాలు తయారు చేసి తిరిగి నెల్లూరు పిలిపించి అమరుస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మెగా క్యాంప్ నిర్వహించేందుకు నిర్వాహకులు నెల్లూరుని ఎంపిక చేసుకున్నందుకు కలెక్టర్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ వాలంటీర్ల సేవలను కొనియాడారు కలెక్టర్. సామాజిక సేవా కార్యక్రమాల్లో రెడ్ క్రాస్ వాలంటీర్లు చురుకైన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు.