Mohan Babu D Patta Lands : మంచు కుటుంబం పేరున అసైన్డ్ భూములు ! అసలు నిజమేమిటంటే ?
చంద్రగిరిలో ప్రభుత్వ భూములకు డి- పట్టాలు పొందిన మోహన్ బాబు, విష్ణు వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ అంశంపై వారింకా స్పందించలేదు.
మంచు మోహన్ బాబు కుటుంబానికి అసైన్డ్ భూములు ఉన్నాయంటూ విస్తృత ప్రచారం జరుగుతోంంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డి పల్లిలో మోహన్ బాబు పేరిట 2.79 ఎకరాలు, మంచు విష్ణు పేరిట 1.40 సున్నా ఎకరాలు ఉన్నట్లుగా ఆన్ లైన్ రికార్డుల్లో నమోదైంది. అయితే ఇది వారు సొంతంగా కొనుగోలు చేసి ఉంటే సమస్య వచ్చేది కాదు. అది ప్రభుత్వ భూమి. వారికి డి పట్టా రూపంలో ఇచ్చినట్లుగా రికార్డుల్లో ఉంది. అక్కడే అసలు వివాదం ప్రారంభమయింది.
2015లో ప్రభుత్వ భూములకు డి-పట్టాలు పొందిన మోహన్ బాబు కుటుంబం !
మంచు మోహన్ బాబు కుటుంబానికి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గమే. అక్కడే ఆయన విద్యానికేతన్ పేరుతో విద్యా సంస్థలు నడుపుతున్నారు. త్వరలోనే యూనివర్శిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఆయన ప్రభుత్వం నుంచి భూములు పొందారని కానీ.. లేకపోతే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని కానీ ఎవరికీ తెలియదు. కానీ హఠాత్తుగా ఆయన పేరు మీద ప్రభుత్వ భూముల బదలాయింపు జరిగిందని మీ సేవ నుంచి రికార్డులు బయటకు వచ్చాయి. అవన్నీ డి-పట్టా భూములని తేలడంతో మరింత వివాదం ప్రారంభమయింది. 2015లో ఈ డీ పట్టాలు మోహన్ బాబు, విష్ణుకు మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటి వరకూ గోప్యంగా ఉన్న భూముల కేటాయింపు వివరాలు !
మోహన్ బాబు కుటుంబం ఎప్పుడు దరఖాస్తు చేసుకుంది..? ఎందుకు దరఖాస్తు చేసుకుంది? ఈ భూముల్ని మోహన్ బాబు ఫ్యామిలీకి ఎలా ఇచ్చారు ? ఏ ప్రాతిపదికన ఇచ్చారు ? అన్నదానిపై స్పష్టత లేదు. ప్రభుత్వం ఏమైనా ఉత్తర్వులు ఇచ్చిందా లేకపోతే సొంతంగా అధికారులతో లాబీయింగ్ చేసుకుని ఆ భూమిని మోహన్ బాబు ఫ్యామీలీ సొంతం చేసుకుందా అన్నది తేలాల్సి ఉంది. 2015లో కేటాయించి ఉంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు ప్రభుత్వం సిఫార్సు చేసిందా.. అధికారులు ఇచ్చారా అన్నది కూడా వెలుగులోకి రావాల్సి ఉంది.
డి-పట్టా అంటే నిరుపేదలకు ఇచ్చే స్థలం !
డీ పట్టాలంటే ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించుకోమని.. లేదా పొలం సాగు చేసుకోమని ఇచ్చే పట్టారు. సాధారణంగా బడుగు, బలహీనవర్గాలకు ఆదాయ వనరులు లేని వారికి ఇస్తారు. వీటిని అసైన్డ్ ల్యాండ్స్ కింద కేటాయిస్తారు. వీరికి అనుభవించడమే తప్ప..అమ్ముకునే స్వేచ్చ ఉండదు. వీటిని కేటాయించడానికి... భూములు తీసుకోడానికి డీ పట్టాల కింద కింద ఉంచుకోవడానికి మోహన్ బాబు కుటుంబానికిఎలాంటి అర్హతా లేదు. అందుకే వివాదాస్పదమయింది.
ఆన్‌లైన్ రికార్డుల్లో మోహన్ బాబు , విష్ణు పేరిట భూములు ఉన్నది నిజమే.
రామిరెడ్డిపల్లిలో భూములుఉన్న వారిలో మోహన్ బాబు, విష్ణు ఉన్నారని వారికి డి - పట్టాల ద్వారా కేటాయించిన విషయం నిజమేనని అధికారులు పరోక్షంగా ధృవీకరిస్తున్నారు. ఈ భూములు ఎలావారి పేరు మీదకు వెళ్లాయో ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. పైకి స్పందించడానికి అధికారులు నిరాకరిస్తున్నారు. అయితే ఈ భూములు, డి -పట్టాలపై నివేదిక మాత్రం అధికారులకు ఇచ్చే అవకాశం ఉంది.
ఇంకా స్పందించని మోహన్ బాబు ఫ్యామిలీ !
డి-పట్టా భూముల విషయంలో తీవ్ర వివాదం రేగుతున్నా మంచు ఫ్యామిలీ ఇంత వరకూ స్పందించలేదు. ఆ భూమి తమపై పేరు ఉందని కానీ..లేదని కానీ లేకపోతే.. మరో విధంగా కానీ ఆ భూమిని సంపాదించామని కానీచెప్పలేదు. ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇచ్చి ఉంటే ఎలాంటి సమస్యా ఉండదు. ఇబ్బంది ప్రభుత్వానికే వస్తుంది. ప్రభుత్వానికి తెలియకుండా అధికారులతో కుమ్మక్కయి ఆ భూమికి పత్రాలు సృష్టించుకుని ఉంటే మాత్రం మోహన్ బాబు ఫ్యామిలీ తీవ్ర ఇక్కట్లలో పడతారని విశ్లేషిస్తున్నారు. అయితే ఎవరూ చేయకుండా ఈ భూముల పేర్లు మోహన్ బాబు ఆయన కుటుంబసభ్యుల పేర్లపైకి మారే అవకాశమే లేదు. అందుకే ఈ అంశం సంచలనం రేపుతోంది.