Chintamaneni Prabhakar: చాన్స్ వస్తే చింతమనేని ప్రభాకర్ వదలరుగా - ఈ సారి చేసింది మాత్రం కేసయ్యే పని కాదు !
Chintamaneni traffic constableఛ జోరు వానలో సైతం ట్రాఫిక్ కానిస్టేబుల్ బాధ్యత నిర్వహించారు ఎమ్మెల్యే చింతమనేని. ఆయన పనికి అందరూ ఫిదా అయ్యారు.

MLA Chintamaneni Prabhakar performs traffic constable duties: చట్ట సభల్లో అతనో సీనియర్ సభ్యుడు. నియోజకవర్గానికి నాయకుడు. ప్రజలెన్నుకున్న పాలకుడు. ప్రభుత్వ వ్యవస్థల పనితీరుకు పర్యవేక్షకుడు. కానీ ప్రజా సమస్యల్లో మాత్రం అతనే తొలి సేవకుడు. ఆయనే దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.
ప్రజలకు సమస్య ఉంటే వాటి పరిష్కారం కోసం తానే తొలి సేవకుడిగా మారతాననే విషయాన్ని మరోసారి నిరూపించుకున్నారు. శనివారం ఉదయం జోరు వాన కురుస్తున్న సమయంలో దెందులూరు మండలం సోమవరపాడు వద్ద అటుగా ప్రయాణిస్తున్న చింతమనేని ప్రభాకర్ రోడ్ల మీద ఉన్న గుంతల్లో నీరు నిలిచిపోయి ఉండటాన్ని గమనించారు. ఆ గుంతల కారణంమగా మోటారు బైక్ లు కార్లు లారీలు అస్తవ్యస్తంగా నిలిచిపోయి అక్కడ ట్రాఫిక్ ఆగిపోయి ప్రజలు ఇబ్బంది పడడం గమనించారు. వెంటనే తన కాన్వాయ్ నుంచి దిగిన చింతమనేని ప్రభాకర్ ఎవరూ రావాలని ఎదురు చూడకుండా తానే ఒక ట్రాఫిక్ పోలీస్ గా మారి రోడ్డుకు మధ్యలో నిలబడి ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్యూటీ ప్రారంభించారు.
ముందుగా భారీ వాహనాలను పక్కకు తప్పించి, ద్విచక్ర వాహనాలను ఒక వైపుగా పోనివ్వడం అదేవిధంగా ఎదురుగా వచ్చే వాహనాలను క్రమబద్ధీకరిస్తూ దాదాపు 20 నిమిషాల పాటు అక్కడ సమయాన్ని కేటాయించి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా బాధ్యతలు నిర్వహించారు. పూర్తిగా ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అదేవిధంగా ఇంతలా ప్రజలు ఇబ్బంది పడడానికి కారణమైన గుంతలను సైతం తన కార్యాలయ సిబ్బంది ద్వారా ఫోటోలు తీయించి వాటిని ప్రాజెక్టు డైరెక్టర్, నేషనల్ హైవే అథారిటీస్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రజా సమస్యలు ఏవైనా ఉంటే వాటిపై ప్రజలు ఫిర్యాదు చేసే వరకు ఎదురు చూస్తూ కూర్చోకూడదని స్థానిక కూటమి నాయకులు గానీ నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారులు సిబ్బంది గానీ వాటిని గుర్తిస్తే సత్వరమే వాటిని పరిష్కరించే విధంగా నాయకులు అధికారులు సిబ్బంది కూడా ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. అంతేతప్ప ప్రజలు ఫిర్యాదు చేసినప్పుడు చూద్దామనేటువంటి నిర్లక్ష్య ధోరణిని కూడా ఎవరు పాటించకూడదని, ప్రజలకు అవస్థలు పాలు చేస్తున్న గుంతల సమస్యను పరిష్కరించేలా నేషనల్ హైవే అధికారులు కూడా వెంటనే తగిన చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేశామని చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
సాధారణంగా చింతమనేని ప్రభాకర్ ఎక్కువగా వివాదాస్పద అంశాల్లోనే వార్తల్లో ఉంటారు. ఈ సారి మాత్రం ప్రజా సేవ కోసం ట్రాఫిక్ కానిస్టేబుల్ గా మారి.. హైలెట్ అయ్యారు. గతంలోనూ చింతమనేని ప్రభాకర్ .. ఎమ్మెల్యేగా కాకుండా సామాన్యుడిగా వ్యవహరిస్తూ ప్రజా సేవలో పాల్గొన్నారని కానీ ఆయన వివాదాలపైనే ఎక్కువగా ప్రచారం జరుగుతుందని అనుచరులు అంటున్నారు. తమ నేత కాస్త దూకుడు తగ్గించుకుంటే.. ఆయన మంచి పనులే ఎక్కువగా ప్రచారంలోకి వస్తాయని నిట్టూరుస్తున్నారు.





















