Minister Roja: షూటింగ్ గ్యాప్‌లో వచ్చి రాజకీయాలు చేస్తే ఎవరూ నమ్మరు: మంత్రి రోజా
Minister Roja: షూటింగ్ గ్యాప్ లో వచ్చి రాజకీయాలు చేస్తే.. పవన్ కల్యాణ్ ను ప్రజలు ఎవరూ నమ్మరని మంత్రి రోజా అన్నారు. సీఎం జగన్ ఎడమ కాలి చిటికెన వేలి వెంట్రుక కూడా పీకలేరంటూ ఘాటు విమర్శలు చేశారు.
Minister Roja: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. వారాంతాల్లో వచ్చి సమావేశాలు పెడుతూ.. తమ పార్టీపై విమర్శలు చేశారని అన్నారు. షూటింగ్ గ్యాప్‌లో వచ్చి రాజకీయాలు చేస్తే.. పవన్ కల్యాణ్‌ను ప్రజలు ఎవరూ నమ్మరంటూ విమర్శించారు. ఆయన ఏం చేసినా సీఎం జగన్ ఎడమ కాలి చిటికెన వేలి వెంట్రుక కూడా పీకలేరంటూ ఘాటు విమర్శలు చేశారు. సినిమా స్క్రిప్టు రాసిచ్చినట్లుగా మీటింగ్‌లలో కూడా అలాంటి డైలాగ్ లే కొడుతూ.. ఆవేశంగా మాట్లాడినంత మాత్రానా ఏమీ ఒరగదన్నారు. నిజంగా పవన్ కల్యాణ్ కు అంత దమ్ము, ధైర్యం ఉంటే వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో జనసేన పార్టీ తరఫున అభ్యర్థులను దింపాలని మంత్రి రోజా సవాల్ విసిరారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీయే భారీ మెజార్టీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు.
రాజకీయాలు అంటే ప్రతిరోజూ క్షేత్ర స్థాయిలో ఉండి సమస్యలతో యుద్ధాలు చేయాలని అన్నారు. వారాంతాల్లో వచ్చి రాజకీయాలు చేస్తామంటే అస్సలే కుదరదన్నారు. సినిమాల్లో హీరో అయినంత మాత్రానా.. రాజకీయాల్లో వచ్చి నాలుగు రోజులు తిరిగితే ఇక్కడ హీరో కాలేరని, జీరో మాత్రమే అవుతారని తెలిపారు. ఇప్పటంలో జరిగిన ఘటనకు కారణం చంద్రబాబు అని మంత్రి రోజా ఆరోపించారు. ఇప్పటంలో సమస్య వస్తే అక్కడ పోటీ చేసి ఓడిపోయిన లోకేష్ రావాలి కానీ పవన్ కల్యాణ్ రావడం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ, జనసేన కలిసే రాజకీయాలు చేస్తున్నారని.. అందుకే కుమారుడికి బదులుగా పవన్ కల్యాణ్ ను పంపించారని అన్నారు.
రాజీనామా చేయమని అడిగితే ఊరుకునేది లేదు..
గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెస్ అవమానిస్తే దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బయటకు వచ్చారని గుర్తుచేశారు మంత్రి రోజా ఆ సమయంలో ప్రజలకు వైఎస్ఆర్ సీపీ అండగా నిలిచిందని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలంతా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే ఆ ఎంపీలకు ప్రజలకు మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. టీడీపీ వాళ్లు నేతలు అమరావతినే మూడు ప్రాంతాల ప్రజలు కోరితే... మేం ఎందుకు రాజీనామా చేయాలని మంత్రి రోజా ప్రశ్నించారు. ప్రతీసారి సీఎం జగన్ ను రాజీనామా చెయ్ అని మాట్లాడితే.. ఊరుకునేది లేదన్నారు. సీఎం జగన్ తన సొంత జెండా, అజెండాతో ప్రజల్లో తిరిగి భరోసా కల్పించుకొని తిరుగులేని నాయకుడు అయ్యారన్నారు. తాను ఇచ్చిన ప్రతీ వాగ్దానాన్ని నెరవేర్చారన్నారు. ప్రతీ ఇంటి బిడ్డగా సీఎం జగన్ ముందుకెళ్తున్నారని తెలిపారు.
చంద్రబాబు వల్లే మేం టీడీపీని వీడాం..
మహానేత ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని, రాష్ట్రాన్ని నాశనం చేయడం వల్లే ఆ పార్టీలో ఉండలేక కొడాలి నాని, తాను బయటకు వచ్చేశామని మంత్రి రోజా తెలిపారు. కొడాలి నాని మాట్లాడిన మాటల్లో తప్పేముందని అడిగారు. ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే.. ఆడవాళ్లను ఇళ్ల మీదకు పంపించారని ఆరోపించారు. తామంతా వైసీపీకీ, సీఎం జగన్ కు అండగా నిలబడతామని తెలిపారు. గతంలో మంత్రి విశ్వరూప్ ఇంటిని ఎలా తగులబెట్టారో, అంబటి రాంబాబు ఇంటి మీదకు ఎలా పోయారో చూశామన్నారు. టీడీపీ వాళ్లు ఏం చేసినా, ఎన్ని చేసినా పోలీసులు వారిని ఏమీ అనకూడదని కేసులు పెట్టకూడదని ప్రతిపక్ష నేతలు మాట్లాడటం సిగ్గు చేటన్నారు.