Nara Lokesh: ఒక్క మెసేజ్‌తో ఆ ఊరికి బస్సొచ్చింది - మంత్రి లోకేశ్‌కు విద్యార్థులు, గ్రామస్థుల కృతజ్ఞతలు
Andhrapradesh News: మంత్రి నారా లోకేశ్‌కు చేసిన ఒక్క మెయిల్‌తో కర్నూలు జిల్లా హొలగుంద మండలం మార్లమడి గ్రామానికి బస్సు సౌకర్యం వచ్చింది. తమ సమస్య పరిష్కరించిన మంత్రికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
Nara Lokesh Solved Bus Issue In Kurnool Village: 'మీ సమస్యలేవైనా నాకు ఒక్క మెయిల్ చేయండి. వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటాను.' ఇదీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) చెప్పిన మాట. అలా చెప్పినట్లుగానే తన దృష్టికి వచ్చిన ప్రతీ సమస్యను ఆయన పరిష్కరిస్తున్నారు. తాజాగా, తమ ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలన్న విద్యార్థుల అభ్యర్థనపై చొరవ తీసుకున్న ఆయన వెంటనే సమస్యను పరిష్కరించారు. కర్నూలు జిల్లా హొలగుంద మండలం మార్లమడి గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీస్ లేదు. దీంతో తమ గ్రామానికి బస్సు సర్వీస్ నడపాలని మంత్రి లోకేశ్‌కు విద్యార్థి సంఘాలు మెయిల్ చేశాయి.
స్పందించిన మంత్రి
దీనిపై స్పందించిన మంత్రి లోకేశ్.. ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే మార్లమడికి కొత్త బస్సు సర్వీసును ఆదోని ఆర్టీసీ డిపో అధికారులు ప్రారంభించారు. దీంతో మంత్రి లోకేశ్‌కు గ్రామస్థులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, మంత్రి లోకేశ్ ఇటీవలే తన వాట్సాప్‌కు వచ్చిన ఒక్క మెసేజ్‌తో 25 మంది దివ్యాంగ విద్యార్థుల సర్టిఫికెట్ల సమస్యలు పరిష్కరించి వారికి ఎన్ఐటీ, ఐఐటీ వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలు కల్పించారు.
'మెయిల్ చేయండి చాలు'
అయితే, రాష్ట్రం నలుమూలల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రి లోకేశ్ వాట్సాప్‌కు మెసేజ్‌లు పోటెత్తడంతో ఆయన వాట్సాప్ బ్లాక్ అయ్యింది. దీంతో ఆయన తనకు సమస్యలు మెయిల్ చేయాలని ప్రజలకు సూచించారు. దూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలతో వచ్చి తనను కలవాల్సిన అవసరం లేదని.. సమస్యలను పూర్తి వివరాలతో hello.lokesh@ap.gov.in మెయిల్ ఐడీకి పంపించాలని సూచించారు. సమస్యలు పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, సమస్య - సహాయానికి సంబంధించిన పూర్తి వివరాలు వినతిలో పొందుపరచాలని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారమే ఆయన ప్రజల సమస్యలును సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తూ వాటిని పరిష్కరిస్తున్నారు.
సోషల్ మీడియాలో సైతం
కేవలం మెయిల్స్‌కు మాత్రమే పరిమితం కాకుండా సోషల్ మీడియాలోనూ లోకేశ్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ సమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇటీవలే అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన శివ (Siva) ఏజెంట్ సాయంతో కువైట్ వెళ్లాడు. అక్కడ ఎడారిలో జన సంచారం లేని ప్రాంతంలో కోళ్లు, గొర్రెలు, పావురాలు, బాతులు మేపే పనిలో ఆయన్ను పెట్టగా.. తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. చావే శరణ్యమంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. దీనిపై స్పందించిన మంత్రి కువైట్‌లో భారత ఎంబసీ సాయంతో బాధితున్ని స్వగ్రామానికి తరలించేలా చర్యలు చేపట్టారు. అలాగే, అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామానికి చెందిన సరెల్ల వీరేంద్రకుమార్ ఏజెంట్ చేతిలో మోసపోయి సౌదీలోని ఎడారిలో చిక్కుకున్నాడు. తనను కాపాడాలని వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన లోకేశ్.. బాధితున్ని స్వగ్రామానికి చేర్చేలా చర్యలు చేపడతామన్నారు.