Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ చొరవ - 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు
Andhrapradesh News: మంత్రి నారా లోకేశ్ చొరవతో 25 మంది దివ్యాంగ విద్యార్థులకు జాతీయ సంస్థల్లో సీట్లు దక్కించుకున్నారు. ఒక్క వాట్సాప్ ఫిర్యాదుతో స్పందించిన మంత్రి జీవో సైతం విడుదల చేశారు.
Minister Nara Lokesh Helped Disability Students: రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) 25 మంది దివ్యాంగ విద్యార్థులు భవితవ్యాన్ని కాపాడారు. మంత్రి చొరవతో వారు ఐఐటీ, ఎన్ఐటీ వంటి జాతీయ సంస్థల్లో ప్రవేశం పొందగలిగారు. తమ భవితకు సాయం చేసిన లోకేశ్‌కు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. అసలు వివరాల్లోకి వెళ్తే.. జేఈఈ మెయిన్స్, అడ్వాన్సుడ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి జాతీయ స్థాయిలో విద్యా సంస్థల్లో సీట్లు దక్కినా.. ఐఐటీ మద్రాస్ తెచ్చిన కొత్త నింబధనలతో వీళ్లు ప్రవేశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం దివ్యాంగులకు మార్కుల మెమో జారీ చేస్తుండగా.. వీరి ప్రవేశాలకు అది అడ్డంకిగా మారింది. దీనిపై వాట్సాప్ ద్వారా మంత్రి లోకేశ్‌కు విద్యార్థులు ఫిర్యాదు చేయగా.. వెంటనే స్పందించిన మంత్రి మార్కుల మెమోలు సవరించి ఇవ్వడమే కాకుండా.. అందుకు అనుగుణంగా జీవో జారీ చేశారు. దీంతో ఆ 25 మంది విద్యార్థులు జాతీయ సంస్థల్లో ప్రవేశాలు పొందే ఛాన్స్ దక్కింది. వీరిని సోమవారం లోకేశ్ అభినందించనున్నారు.
ఆ నిబంధన ఏంటంటే.?
ఏపీ ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం.. దివ్యాంగ విద్యార్థులకు లాంగ్వేజ్ సబ్జెక్టులు రెండింటిలో ఒకదానికి మినహాయింపు ఉంది. ఈ క్రమంలో ఆ సబ్జెక్టుకు సంబంధించి 'E (ఎగ్జంప్షన్)' అని పేర్కొంటూ అధికారులు మెమో జారీ చేస్తున్నారు. అయితే, ఈసారి జోసా కౌన్సెలింగ్ పర్యవేక్షిస్తున్న ఐఐటీ మద్రాస్ నిబంధనలు మార్చింది. ఇంటర్‌లో కనీస అర్హతగా 5 సబ్జెక్టులకు సంబంధించిన మార్కులతో మెమో ఇవ్వాలని స్పష్టం చేసింది. అయితే, రాష్ట్ర ఇంటర్ బోర్డు అలా మార్కుల జాబితా ఇవ్వకపోవడంతో పలువురు దివ్యాంగ విద్యార్థులకు జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆవేదన చెందారు.
విద్యార్థి ఫిర్యాదుతో...
విజయవాడకు చెందిన దివ్యాంగ విద్యార్థి మారుతీ పృధ్వీ సత్యదేవ్ ఈ ఏడాది నిర్వహించిన జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్షలో దివ్యాంగుల కోటాలో 170వ ర్యాంకు సాధించారు. ఈ ర్యాంకు ప్రకారం సత్యదేవ్‌కు చెన్నై ఐఐటిలో సీటు రావాల్సి ఉంది. అయితే, జోసా కౌన్సెలింగ్ పత్రాల పరిశీలన క్రమంలో ఇంటర్ మెమోలో 4 సబ్జెక్టులకే మార్కులు ఉండడంతో ఐఐటీ మద్రాస్ అధికారులు సీటిచ్చేందుకు నిరాకరించారు. దీంతో సత్యదేవ్ జూన్ 22న సమస్యను మంత్రి లోకేశ్‌కు వాట్సాప్ ద్వారా తెలియజేశాడు.
వెంటనే ప్రభుత్వ జీవో
వెంటనే స్పందించిన మంత్రి లోకేశ్.. విద్యార్థి సత్యదేవ్, ఆయన తండ్రితో మాట్లాడారు. విద్యార్థి మెమోలు 'E (EXEMPTION)' బదులుగా మార్కులతో కూడిన జాబితా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో 4 సబ్జెక్టుల సరాసరి మార్కులను 'E'గా పేర్కొన్న ఐదో సబ్జెక్టుగా వేసి కొత్త మెమో జారీ చేశారు. అయితే, దీనిపై ప్రభుత్వ జీవో కావాలని ఐఐటీ మద్రాస్ అధికారులు స్పష్టం చేయడంతో.. వెంటనే జీవో జారీ చేయాలని.. ఐఐటీ మద్రాస్ అధికారులతో మాట్లాడాలని అధికారులకు నిర్దేశించారు. ఆఘమేఘాలపై జీవో జారీ చేయడంతో సత్యదేవ్‌కు రౌండ్ - 1లోనే సీటు దక్కింది. ఈ జీవోతో రాష్ట్రంలో 25 మందికి జాతీయ సంస్థల్లో సీట్లు దక్కాయి. తన భవిష్యత్తును కాపాడిన మంత్రి లోకేష్ కు పృధ్వీ సత్యదేవ్‌తో పాటు దివ్యాంగ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.