Botsa On MLC Results : ఎమ్మెల్సీ ఓడితే వచ్చే నష్టం ఏంటి ? - కేబినెట్ మార్పులు సీఎం జగన్ ఇష్టమన్న బొత్స !
ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి బాధ్యత తనదేనని మంత్రి బొత్స ప్రకటించారు.
Botsa On MLC Results : ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓడిపోవడానికి తానే బాధ్యత తీసుకుంటానని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఒక ఎమ్మెల్సీ ఓడిపోయినంత మాత్రాన వచ్చిన నష్టం ఏంటని మీడియాను ప్రశ్నించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఓటమి తన ఫెయిల్యూర్ గా భావిస్తున్నానంటూ బొత్స తెలిపారు. మంత్రిగా ఉండి నేనే ఎమ్మెల్సీ గెలుపు బాధ్యత తీసుకున్నానన్నారు. ఎందుకు ఓడిపోయామనేది సమీక్షించుకుంటున్నామన్నారు. ఓటమికి తప్పు నాది కాదని పారిపోయే వాడిని కాదని బొత్స పేర్కొన్నారు. లోపాలను సరిద్దికుని మళ్లీ రిపీట్ కాకుండా చూసుకుంటామన్నారు.
మంత్రి పదవులపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారన్న బొత్స
అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరిగ్గా పని చేయనందున కొంత మంది మంత్రులపై సీఎం జగన్ వేటు వేయాలనుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపైనా బొత్స సత్యనారాయణ స్పందించారు. మంత్రివర్గంలో మార్పులు సీఎం ఇష్టమని కేబినెట్ ప్రక్షాళనపై వస్తున్న ఊహాగానాలపై వ్యాఖ్యానించారు. ఎమ్మ ల్సీ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పెద్దగా నష్టమేం లేదని బొత్స ప్రకటిస్తూనే.. బాధ్యత తీసుకుంటానని చెప్పడం వ్యూహాత్మకమేనని భావిస్తున్నారు. ఆ ఓటమి కారణంగాతన మంత్రి పదవిని తీసేయరని ఆయన గట్టగా నమ్ముతున్నారు.
బీజేపీ నేతలపై దాడులు చేయాల్సిన అవసరం ఏమిటి : బొత్స
మరోవైపు అమరావతికి మద్దతు ప్రకటించి వచ్చిన బీజే్పీ నేతలపై దాడులు చేయడంపైనా స్పందించారు. బీజేపీ నాయకులపై దాడి చేయాల్సిన అవసరం తమకేంటని మంత్రి బొత్స ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ఎక్కడికైనా వెళ్లినా పరిస్థితులు బట్టి మాట్లాడాలన్నారు. తమపై బురద చల్లేందుకు రాజకీయ ప్రయోజనాలకోసం ఆరోపణలు చేస్తున్నారంటూ బీజేపీ నేతలను ఉద్దేశించి బొత్స వ్యాఖ్యానించారు. అమరావతి ఉద్యమం ఎక్కడిది, షామియాన వేసుకుని నలుగురు కూర్చుంటే ఉద్యమం అవుతుందా అని ఎద్దేవా చేశారు.
విశాఖనే రాజధాని : బొత్స
చంద్రబాబు అండ్ కో దోపిడీ కోసం జరుగుతున్న ఉద్యమం అంటూ విమర్శించారు.ముందస్తు ఎన్నికలు వస్తే చంద్రబాబు ఇంకా దిగజారిపోతాడంటూ మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. అసలు ప్రభుత్వం రద్దు చేయాల్సిన అవసరం మాకేంటని ప్రశ్నించారు. కొన్ని దుష్ట శక్తులు న్యాయవ్యవస్థ లో ఉన్న లొసుగులతో అడ్డుకుంటున్నారని రాజధానుల న్యాయవివాదాలపై వ్యాఖ్యానించారు. వికేంద్రీకరణ అజెండాగా వచ్చే ఎన్నికలకు వెళ్తామన్నారు.
బొత్స సత్యనారాయణ ఇటీవలి కాలంలో పెద్దగా యాక్టి వ్ గా ఉండటం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఆయన చురుగ్గా ప్రచారం చేయలేదు. అయితే అభ్యర్థిని నిర్ణియంచింది బొత్సేనని చెబుతున్నారు. చివరి క్షణంలో బొత్స సరిగ్గా పని చేయకపోవడం వల్లనే పరాజయం పాలయ్యామని.. బొత్సే బాధ్యత తీసుకోవాలన్న ప్రచారం జరుగుతూండటంతో మంత్రి వ్యూహాత్మకంగా స్పందించినట్లుగా భావిస్తున్నారు.