Andhra Pradesh Agriculture Budget: రూ.53 వేల కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్ - యువతను సాగు వైపు ఆకర్షించేలా ప్రయత్నాలు
Minister Atchannaidu : రూ.53 వేల కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్ ను అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. యువతను సాగు వైపు ఆకర్షించేలా ప్రయత్నాలు చేస్తామన్నారు.

Atchannaidu presents Agriculture Budget : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ను శనివారం ప్రవేశపెట్టారు. ఈ దఫా వ్యవసాయ , దాని అనుబంధ రంగాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ. 53,752 కోట్ల భారీ కేటాయింపులు చేసింది. గత ఏడాదితో పోలిస్తే ఈ బడ్జెట్ అంచనాలు గణనీయంగా పెరగడం గమనార్హం. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈ నిధులను వెచ్చించనున్నట్లు మంత్రి తన ప్రసంగంలో స్పష్టం చేశారు. గతంలో పెండింగ్‌లో ఉన్న రూ. 1,674 కోట్ల ధాన్యం సేకరణ బకాయిలను చెల్లించి రైతులకు భరోసా కల్పించారు. పెట్టుబడి రాయితీ కోసం రూ. 310 కోట్లు , 50 శాతం రాయితీతో వ్యవసాయ యాంత్రీకరణ కోసం రూ. 136 కోట్లు కేటాయించారు. భూసార పరీక్షల ద్వారా 6 లక్షల మందికి పత్రాలు అందజేయడం , పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా 18 లక్షల మంది రైతులకు విస్తరణ సేవలు అందించడం వంటి వినూత్న చర్యలు చేపట్టారు. సాగునీటి రంగానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు పనులు 60 శాతం పూర్తయ్యాయని , డయాఫ్రం వాల్ నిర్మాణం 91 శాతం ముగిసిందని వెల్లడిస్తూ , వంశధార , హంద్రీనీవా, వెలిగొండ వంటి కీలక ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసింది. అనంతపురం ,చిత్తూరు , కర్నూలు వంటి జిల్లాల్లో ఉద్యానవన క్లస్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా 2030 నాటికి పంటల విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనుబంధ రంగాల ద్వారా దాదాపు 9 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి వివరించారు.
అన్నదాత సుఖీభవ పథకం ఈ బడ్జెట్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. వ్యవసాయ పనుల కోసం , విత్తనాలు ,ఎరువుల కొనుగోలు కోసం రైతులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయి. సాగు వ్యయం తగ్గించి ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించినట్లు అచ్చెన్నాయుడు వివరించారు.
సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ ,పెండింగ్ లో ఉన్న పనుల పూర్తి కోసం బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించారు. అలాగే ఉచిత విద్యుత్ సరఫరా కోసం , నాణ్యమైన కరెంటును రైతులకు అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు , డ్రోన్ల వినియోగాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరిగింది.
వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, తద్వారా రాష్ట్రం ఆర్థికంగా సుభిక్షంగా ఉంటుంది.
— Kinjarapu Atchannaidu (@katchannaidu) February 14, 2026
వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టం చేసి రైతును రాజుగా నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ 2026-27 వార్షిక వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగింది.
యువత వ్యవసాయం… pic.twitter.com/THIHIyN7dc
పాడి పరిశ్రమ, మత్స్య రంగం, ఉద్యానవన శాఖల అభివృద్ధికి కూడా ఈ బడ్జెట్ లో ప్రాధాన్యత లభించింది. పశుగ్రాసం కొరత తీర్చడం, మత్స్యకారులకు అవసరమైన పరికరాల పంపిణీ , రాయితీ విత్తనాల సరఫరా వంటి అంశాలకు నిధుల కేటాయింపులు జరిగాయి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు అండగా ఉండేందుకు పంటల బీమా పథకాన్ని మరింత పటిష్టం చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
రాష్ట్రంలోని కౌలు రైతుల ప్రయోజనాలను రక్షించేందుకు , వారికి కూడా ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల బలోపేతం, గిట్టుబాటు ధర కల్పన , నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి ఈ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుందని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.























