Suicidal Tendency : దా'రుణ' యాప్ ఆత్మహత్యలపై సైకియాట్రిస్ట్ లు ఏమంటున్నారంటే?
ఇటీవల కాలంలో రుణ యాప్ ల వల్ల ఆత్మహత్యలు కూడా పెరిగిపోతున్నాయనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు వైద్యులు. సహచంగా ఆర్థిక క్రమశిక్షణ లేనివారు ఇలాంటి ఆన్ లోన్ యాప్ వైపు వెళ్తుంటారని అంటున్నారు.
ప్రపంచంలో అత్యథిక మరణాలు బ్రెయిన్ స్ట్రోక్ వల్ల జరుగుతున్నాయని, రెండో స్థానంలో గుండెపోటు ఉందని.. కానీ మరో పదేళ్ల కాలంలో ఆత్మహత్యలు అనేవి మొదటి స్థానంలో ఉంటాయని చెబుతున్నారు మానసిక వైద్యులు. అలాంటి వారిని ముందుగానే గుర్తించడం వల్ల ఆత్మహత్యలను నివారించవచ్చని అంటున్నారు. ఆత్మహత్యల విషయంలో కౌన్సెలింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుందని, ఆత్మహత్యల నివారణకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు డాక్టర్ శ్రీనివాస తేజ. నెల్లూరులో ప్రముఖ న్యూరో సైకియాట్రిస్ట్ గా ఆయన సేవలందిస్తున్నారు. ఆత్మహత్యాయత్నాలకు గల కారణాలను విశ్లేషించి వ్యక్తిగత సూచనల ద్వారా వారిని ప్రమాదంబారినుంచి కాపాడవచ్చని చెబుతున్నారు.
మానసిక వ్యాధుల పట్ల మన సమాజంలో ఒకరకమైన వ్యతిరేక భావం ఉందని అంటున్నారు వైద్యులు. ఎవరికైనా తమ సమస్య చెప్పుకుందామనుకుంటే, వీడు మెంటలోడు అంటారేమోనన్న భయంతో ఎవరికీ చెప్పుకోలేరని, ఆ జబ్బుకి ఉన్న సమస్యే ఆత్మహత్య చేసుకోవడం అని అంటున్నారు. హీరోయిన్ దీపికా పదుకోన్ ఈ విషయంలో అందరికీ ఆదర్శంగా నిలిచారని చెప్పారు డాక్టర్ శ్రీనివాస తేజ. తన సమస్యను అధిగమించడంతోపాటు, ఆమె బీట్ ద డిప్రెషన్ అనే పేరుతో కార్యక్రమాలు కూడా చేపట్టిందని అన్నారు.
ఇటీవల కాలంలో రుణ యాప్ ల వల్ల ఆత్మహత్యలు కూడా పెరిగిపోతున్నాయనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు వైద్యులు. సహచంగా ఆర్థిక క్రమశిక్షణ లేనివారు ఇలాంటి ఆన్ లోన్ యాప్ వైపు వెళ్తుంటారని, లేదా ఆన్ లైన్ గేమింగ్ వైపు ఆకర్షితులవుతారని అంటున్నారు. ప్రజల్లో ఆర్థిక విషయాలపై అవగాహన పెరగాలని, ఆర్థిక క్రమశిక్షణ కూడా ఉండాలంటున్నారు వైద్యులు. అదే సమయంలో వీటిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెబుతున్నారు.
రుణ యాప్ లకు గత మూడు నెలల కాలంలో ఏపీలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆన్ లైన్ లో లోన్ తీసుకోవడం, వాయిదాలు చెల్లించలేక, ఒకవేళ చెల్లించినా, అదనపు సొమ్ముకోసం అవతలి వ్యక్తులు వేధించడంతో వీరంతా ఆత్మహత్యలబారినపడ్డారు. కొన్ని సందర్భాల్లో లోన్ తీసుకున్నవారి ఫొటోలను మార్ఫింగ్ చేసి వాటిని కుటుంబ సభ్యులకు పంపిస్తామనే బెదిరింపులు కూడా ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి. ఇటీవల నెల్లూరు జిల్లాలో ప్రజా ప్రతినిధులకు సైతం లోన్ యాప్ వేధింపులు మొదలయ్యాయి. మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి కూడా లోన్ యాప్ రికవరీ ఏజెంట్లు ఫోన్ చేసి బెదిరించిన సంఘటనలున్నాయి. సామాన్యులు మాత్రం రికవరీ ఏజెంట్లకు బెదిరిపోయి ఉన్నదంతా ఊడ్చి ఇస్తున్నారు. అలా ఇవ్వలేనివారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
అక్రమ సంబంధాల వల్ల కూడా ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతుంటాయని. అలాంటి కేసుల తమ వద్దకు వచ్చినప్పుడు కౌన్సెలింగ్ ఇస్తుంటామని చెబుతున్నారు సైకియాట్రిస్ట్ లు. రైతుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుందని, అయితే తమ వద్దకు ఎక్కువగా వివాహ సంబంధ విషయాల్లో మాత్రమే బాధుతులు వస్తుంటారని చెబుతున్నారు డాక్టర్ శ్రీనివాస తేజ.
చివరిగా ఆత్మహత్యల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటదని జీవితాన్ని ఆనందంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు తీసుకూడదని, అసలా ఆలోచన రాకుండా చూసుకోవాలంటున్నారు. ఆన్ లైన్ లోన్ యాప్ ల వల్ల జరుగుతున్న ఆత్మహత్యలు.. ఆ యాప్ లను నిషేధిస్తేనే ఆగిపోతాయని అన్నారు.