Crime News: చెల్లెలితో భర్తకు రెండో పెళ్లి చేసింది- ఎలుకల మందు ఇచ్చింది చంపేసింది, స్టోరీలో ట్విస్టులే ట్విస్టులు
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో దారుణం జరిగింది. ఎలుకల మందు పెట్టి సొంత చెల్లినే అక్క హత్య చేసింది.
నంద్యాల జిల్లా(Nandyala) కొత్తపల్లి(Kottapalli) మండలం ఎదురుపాడు(Edurupadu) గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన సంచలనం కలిగిస్తోంది. ఎదురుపాడు గ్రామానికి చెందిన జానకమ్మ తన తోడబుట్టిన చెల్లి తిరుమలేశ్వరిని ఎలుకల మందు పెట్టి చంపేసింది.
జానకమ్మకు జనార్దన్‌తో కొంతకాలం క్రితం పెళ్లి అయింది. పెళ్ళైన కొన్ని రోజులకు జానకమ్మ అనారోగ్యం భారిన పడింది. ఆమె కోలుకునే పరిస్థితి లేదని తెలిసిన కుటుంబ సభ్యులు జనార్దన్‌కు రెండో వివాహం చేయాలని నిర్ణయించారు. వేరే ఆమె వస్తే ఎలా ప్రవర్తిస్తుందో అని సొంత చెల్లెలు తిరుమలేశ్వరిని ఇచ్చి వివాహం జరిపించారు.
కొన్ని రోజులు సంసారం బాగా సాగింది. అక్క ఆరోగ్యం బాగాలేదని గ్రహించిన చెల్లి తిరుమలేశ్వరి భర్తకు దగ్గరైంది. ముగ్గురి మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. చెల్లెలు, భర్త సాన్నిహిత్యాన్ని చూసి ఓర్వలేకపోయింది అక్క జానకమ్మ.
ఉన్న ఆస్తిని తన పేరు మీద రాయాలని జనార్దన్‌పై ఒత్తిడి తీసుకొచ్చింది జానకమ్మ. తిరుమలేశ్వరితో సాన్నిహిత్యాన్ని తగ్గించుకోవాలని చెప్పింది. అయినా జనార్దన్, తిరుమలేశ్వరి ప్రవర్తనలో మార్పు రాలేదు. దీన్ని తట్టుకోలేకపోయింది జానకమ్మ.
తాను కట్టుకున్న భర్త తన నుంచి దూరమౌతున్నాడని అసూయతో తిరుమలేశ్వరి మర్డర్‌కు స్కెచ్ గీసింది. తినే అన్నంలో ఎలుకల మందు కలిసి వడ్డించింది. అది తిన్న తిరుమలేశ్వరి స్పృహ కోల్పోయింది. అనంతరం ఆమె గొంతు, నోరు నలిపి హత్య చేసింది
చెల్లెల మృతదేహాన్ని భర్త జనార్దన్‌తో కలిసి నల్లమల అడవి ప్రాంతంలోని రోళ్ల పెంట సమీపంలో పడేసింది. మళ్ళీ ఏమి తెలియనట్టు నిందితురాలు జానకమ్మ మరుసటి రోజు కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తన చెల్లి కనిపించడం లేదంటూ పోలీసులకు మిస్సింగి కేసు పెట్టింది.
గత నెల 28వ తేదీన ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే రోజులు గడుస్తున్నా కూడా తిరుమలేశ్వరి ఆచూకీ లభించలేదు. ఆమె తరపు బంధువులు పోలీసులపై ఒత్తిడి పెంచడంతో ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేపట్టిన పోలీసులకు భర్త జనార్ధన్‌పై అనుమానం వచ్చింది. అతన్ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు విషయం చెప్పాడు. తన మొదటి భార్యతో కలిసి మార్చి 25న అన్నంలో ఎలకల మందు పెట్టి హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి బైక్ పై నల్లమల అడవి ప్రాంతం లోని రోళ్ల పెంట సమీపంలో పడేసినట్లు అంగీకరించారు
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు జానకమ్మ, జనార్దన్‌ను అదుపులోకి తీసుకొన్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. నిందితులకు 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు.