Nandyal Assembly TDP Candidate: నంద్యాల టీడీపీ అభ్యర్థి ఫరూక్ కారుకు ప్రమాదం- సీటు బెల్టు పెట్టుకోవడంతో తప్పిన ముప్పు
Nandyal News: నంద్యాలలో ప్రచారం ముంగించుకొని వస్తున్న టీడీపీ అభ్యర్థి కారు ప్రమాదానికి గురైంది. సీటు బెల్టు పెట్టుకోవడంతో స్వల్పగాయాలతో ఆయన క్షేమంగా బయపడ్డారు.
AP Elections 2024: నంద్యాలలో ప్రచారం ముగించుకొని హైదరాబాద్ బయల్దేరిన టీడీపీ అభ్యర్థి కారు తమ్మరాజుపల్లె వద్ద ప్రమాదానికి గురైంది. జాతీయ రహదారిపై గేదెలను తప్పించబోయిన ఆయన కారు పల్టీ కొట్టింది. సీటు బెల్టుపెట్టుకున్న ఆయన కారు బెలూన్లు తెరుచుకోవడంతో స్వల్ప గాయాలతో బయట పడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే ప్రత్యేక వాహనంలో ఆయనను నంద్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే టీడీపీ, వైసీపి నేతలు ఆయనను పరామర్శించారు. ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.
మాజీ మంత్రి ఫరూక్ మంగళవారం మధ్యాహ్నం నంద్యాల నుంచి హైదరాబాద్ బయలుదేరారు. రంజాన్ పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు కారులో వెళ్ళారు. తమ్మరాజుపల్లె సమీపంలో జాతీయ రహదారిపై అకస్మాత్తుగా గేదెలు అడ్డుగా వచ్చాయి. అప్రమత్తమైన డ్రైవర్ ప్రమాదాన్ని ఊహించేలోపే గేదెలను కారు ఢీ కొట్టింది. ఫరూక్ సీటు బెల్ట్ వేసుకోవడంతో బెలూన్స్ తెరుచుకున్నాయి.
కారు వేగంగా ప్రయాణిస్తున్నందున ఫరూక్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. ముక్కు నుంచి రక్తస్రావం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుంది. ఎన్నికల ప్రచారంలో ఉన్న పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరితారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ప్రత్యేక వాహనంలో నంద్యాల ఇంటెన్సీవ్ ట్రామా కేర్ సెంటరు తీసుకొని వచ్చారు.
నంద్యాల ఆసుపత్రిలో వైద్యులు అత్యవసర విభాగంలో వైద్యం అందిస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న పలువురు టీడీపీ, వైసీపీ నేతలు ఆయనను పరామర్శించారు. పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్రెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఆసుపత్రి వద్దకు వచ్చారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.