Hindupur Constituency: హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ హ్యాట్రిక్ ఖాయమా? ఢీకొట్టేందుకు వైసీపీ సిద్ధమా?
TDP MLA Balakrishna: టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈసారైనా హిందూపురంలో పాగా వేయాలని వైసీపీ భావిస్తోంది.
హిందూపురం: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓటమి అనేదే ఎరుగదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే విజయం మాత్రం ఆ పార్టీ వారిదే అనేలా ఆ నియోజకవర్గ ప్రజలు వారికి పట్టం కడుతూ వస్తున్నారు. ఇంతకు ఆ నియోజకవర్గం ఏది అనుకుంటున్నారా.. ప్రస్తుతం బాలకృష్ణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురం నియోజకవర్గం.
హిందూపురం ఈ పేరు వినగానే టక్కున గుర్తుకు వచ్చేది దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు హిందూపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఇక్కడ ఓటమి అంటే తెలియదు. అందువల్ల రాను రానూ హిందూపురం కాస్త నందమూరి పురం అన్నట్లుగా మారిపోయింది. పార్టీ ఆవిర్భంలో పి రంగనాయకులు అనే చేనేత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు.
1984లో ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయపరంగా తలెత్తిన రాజకీయ సంక్షోభం కారణంగా ఎన్టీ రామారావును అప్పటి గవర్నర్ రామ్లాల్ పదవి చిత్యున్ని చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధంగా జరిగిందనే విషయాన్ని అప్పటి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసించాయి. రాష్ట్ర ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్పందించి ఎక్కడికక్కడ ప్రజా ఆందోళనలు నిర్వహించారు. అప్పటి కాంగ్రెస్ పార్టీ అధినేత ఇందిరాగాంధీ తన నిర్ణయాన్ని మార్చుకొని తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్దింపజేశారు. రాజకీయ సంక్షోభంలో హిందూపురం నియోజకవర్గంలో జరిగిన హింస అంతా ఇంతా కాదు. ప్రభుత్వ ఆసుల ధ్వంసం అదేవిధంగా అనేక ఆందోళనలు జరిగాయి. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇంత ప్రేమ అభిమానాలు చూపించిన హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఎన్టీ రామారావు అప్పట్లో స్పష్టం చేశారని పార్టీ సీనియర్ నేతలు చెప్పుకొచ్చారు. అప్పటినుంచి ఎన్టీ రామారావు హిందూపురం నుంచి పోటీ చేస్తూ విజయం సాధిస్తూ వచ్చారు.
సీనియర్ ఎన్టీఆర్ అనంతరం ఆయన కుమారులు నందమూరి హరికృష్ణ, నందమూరి బాలకృష్ణ సైతం హిందూపురం నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్నారు. మధ్యలో రెండు దఫాలుగా సిసి వెంకట రాముడు, అబ్దుల్ గని కూడా హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యులుగా గెలుపొందారు. ప్రస్తుతం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 2014 నుంచి హిందూపురం నుంచి పోటీ చేస్తూ నెగ్గుతున్నారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 2014, 2019 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించి 2024 లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు.
బాలయ్యకు పోటీగా దీపికా రెడ్డి
హిందూపురం నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ పార్టీ తరఫున కురుబ సామాజిక వర్గానికి చెందిన కురువ దీపికా రెడ్డి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి ఎన్నికల బరిలో నిలిచారు. ఓటమి ఎరుగని నందమూరి వంశానికి, తెలుగుదేశం పార్టీకి హిందూపురం నియోజకవర్గ ప్రజలు మరోసారి పట్టం కడతారా.. లేకపోతే రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై హిందూపురం నియోజకవర్గంలో వైసిపి జెండాను ఎగరవేస్తారా అని ఉత్కంఠ నెలకొంది. మే 13న ఏపీ అసెంబ్లీకి, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.