Anantapur Politics: టీడీపీలో డబ్బున్నోడికే టికెట్, కొందరు అభ్యర్థులు నాన్ లోకల్స్!: శంకర నారాయణ
Andhra Pradesh Elections 2024: టీడీపీ టికెట్ ఇచ్చిన దగ్గుపాటి ప్రసాద్ ఏనాడైనా ప్రజల్లో ఉన్నాడా అని వైసీపీ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, శంకర నారాయణ ప్రశ్నించారు.
Shankar Narayana and Anantha Venkatarami Reddy Election Campaign in AP- అనంతపురం: ‘ఐదేళ్లలో దగ్గుపాటి ప్రసాద్ ఏనాడైనా ప్రజల్లో ఉన్నాడా ? హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకునే వ్యక్తిని రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా వైసీపీ వైపే ప్రజలు ఉన్నారని’ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మరోసారి వైఎస్‌ఆర్‌సీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర నారాయణ అన్నారు. తెలుగుదేశం పార్టీలో డబ్బున్నోడికే టికెట్లు ఇస్తున్న పరిస్థితి ఉందని వైసీపీ అనంతపురం పార్లమెంట్ అభ్యర్థి శంకర నారాయణ అన్నారు.
దగ్గుపాటి ప్రసాద్ ఏనాడైనా ప్రజల్లో ఉన్నాడా?
అనంతపురం టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఈ ఐదేళ్లలో ఏనాడైనా ప్రజల్లో ఉన్నాడా? అని శంకర నారాయణ ప్రశ్నించారు. నగరంలోని 32వ డివిజన్‌లో ‘ఇంటింటికీ వైసీపీ’ నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అనంతపురం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి శంకర నారాయణ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి వివరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క పథకం లేదు
శంకర నారాయణ మాట్లాడుతూ ‘‘14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క పథకం లేదు. అనంతపురం నియోజకవర్గంలో ఏనాడూ ప్రజల బాగోగుల గురించి పట్టించుకోని వ్యక్తిని తీసుకొచ్చి పెట్టడం సిగ్గుచేటు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు, తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరక్క హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకునే వ్యక్తిని తెచ్చిపెట్టారు. కేవలం డబ్బులు ఉన్న కాంట్రాక్టర్లు, వ్యాపారులకే టీడీపీలో టికెట్లు ఇస్తున్నారు. ఇదంతా ఓట్లు కొనాలన్న ఆలోచనతోనే. ఎన్ని ట్రిక్కులు చేసినా, ప్రలోభాలకు గురి చేసినా ఓటర్లు ఇప్పటికే వైసీపీకి ఓటు వేయాలని ఫిక్స్ అయ్యారు. జగన్ సీఎంగా ఉంటేనే తమ జీవితాలు బాగుపడతాయని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి వైసీపీ విజయకేతనం ఎగురవేస్తాం. రానున్న ఎన్నికల్లో టీడీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అని శంకర నారాయణ, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు.