Buggana Rajendranath: మంత్రి బుగ్గన ముఖంపైనే దురుసుగా మాట్లాడిన మహిళ! సొంతూర్లోనే, వీడియో వైరల్
Buggana Rajendranath: సొంత నియోజకవర్గం డోన్‌లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓ మహిళ నుంచి నిరసన ఎదుర్కోవాల్సి వచ్చింది.
Minister Buggana Rajendranath Reddy: గడపగడపకు వైఎస్ఆర్ సీపీ కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల వారికి ఆదరణ వస్తుంటే, మరికొన్ని చోట్ల ఎదురు తిరుగుతున్నారు. ఏకంగా ముఖంపైనే దూషిస్తున్న తాలుకు వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. సామాన్యులు ప్రజా ప్రతినిధులను నిలదీస్తుంటే సర్ది చెప్పలేని వారు ముందుకు వెళ్లిపోయారు. తాజాగా ఇలాంటి నిరసన సెగ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కు ఎదురైంది.
సొంత నియోజకవర్గం డోన్‌లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓ మహిళ నుంచి నిరసన ఎదుర్కోవాల్సి వచ్చింది. డోన్ లోని 30, 31 వార్డుల్లో ‘గడప గడపలో’ కార్యక్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ పాల్గొన్నారు. దీంతో ఓ మహిళ ఆయన ముఖం మీదే దురుసుగా మాట్లాడింది. ‘‘ఎద్దు ఈనింది అంటే దొడ్లో కట్టేసి పో అన్నట్లుగా ఉంది రెడ్డి ప్రభుత్వం’’ అంటూ.. బుగ్గన మొఖం మీదే ఆ మహిళ అన్నారు. తమకు అర్హత ఉన్నా ఏ పథకమూ రావడం లేదని మహిళ నిలదీసింది. ఉన్నోళ్లకే పథకాలు ఇస్తున్నారని మండిపడింది.
దీనిపై బుగ్గన స్పందిస్తూ మీ కుటుంబ సభ్యులకు ఒక లక్ష రూపాయలు లబ్ది చేకూరిందని, అయినా జగన్ మీద ఆబండాలు వేస్తున్నారని బుగ్గన సమాధానం చెప్పారు. అయితే, జగన్ అన్ని ధరలూ పెంచేసి, మా డబ్బులే తిరిగి మాకు ఇస్తున్నాడంటూ మహిళ కౌంటర్ ఇచ్చింది. రూ.98 ఉన్న ఆయిల్ ప్యాకెట్ ను జగన్ రూ.200 చేశారని మహిళ నిలదీయడంతో బుగ్గన కంగుతిన్నారు. మహిళ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బుగ్గన ముందుకు వెళ్లిపోయారు.
పలువురు ప్రజాప్రతినిధులకు నిరసన
మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే శంకర నారాయణకు కూడా గత నెలలో ఇలాగే చేదు అనుభవం ఎదురైంది. వితంతు పింఛన్‌ను రద్దు చేసినందుకు ఓ గిరిజన మహిళ నిలదీసింది. తన ఇంటి వద్దకు ఇంకోసారి వస్తే బాగోదని హెచ్చరించింది. లలితాబాయి అనే మహిళ ఇంటి వద్దకు చేరుకోగానే ఆమె బంధువులు పింఛన్ రద్దు విషయాన్ని ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఇంతలో లలితాబాయి బయటకు వచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడింది. స్థానిక వైసీపీ నాయకులు తనకు పింఛన్ రాకుండా చేశారని, 11 నెలల నుంచి పింఛన్ అందడంలేదని ఎమ్మెల్యేకి వివరించింది.
కరణం ధర్మశ్రీ కూడా..
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో గత మే నెలలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా చేదు అనుభవం ఎదుర్కొన్నారు. బుచ్చియ్యపేట మండలం సీతయ్యపేటలో స్థానిక మహిళలు తాగునీటి కష్టాలపై నిలదీశారు. తమ ప్రాంతంలో బోర్లు లేకపోవడంతో నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగ్గా లేకపోవడంతో దుర్వాసనతో అనారోగ్యానికి గురవుతున్నామని వాపోయారు.