crime news: తాళి కడుతుండగా బయటపడ్డ వరుడి బాగోతం-ఆఖరి నిమిషంలో ఆగిన పెళ్లి
Crime News: ఒక మహిళతో సహజీవనం చేస్తూ... మరో యువతితో పెళ్లిపీటలు ఎక్కాడో వరుడు. చివరి నిమిషంలో విషయం బయటపడటంతో పెళ్లి ఆగిపోయింది.
Kurnool News: చక్కని సంబంధం అనుకున్నారు తల్లిదండ్రులు. కన్నకూతుర్ని అతని చేతుల్లో పెడదామనుకున్నారు. లక్షల రూపాయలు కట్నకానులు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. పెళ్లి కుదుర్చుకున్నారు. మండపం బుక్‌చేశారు. పెళ్లికి ముందు వేడుకన్నీ సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. పెళ్లి రోజున.. వధూవరులతో పెళ్లిమండపానికి చేరుకున్నారు. ముహూర్తం సమీపించడంతో... వధూవరులను పెళ్లి పీటలపై కూర్చోబెట్టారు. ఆఖరి నిమిషంలో.. వధువు తల్లిదండ్రులకు ఒక కాల్ వచ్చింది. అంతే.. అంతా షాకయ్యారు. మండపం మొత్తం గందరగోళం. చివరికి పెళ్లి కూడా రద్దు చేసుకున్నారు. ఇంతకీ ఏం జరిగింది...? వధువు తల్లిదండ్రులకు ఎవరు ఫోన్ చేశారు..? ఆఖరి నిమిషంలో ఎందుకు పెళ్లి రద్దు చేసుకున్నారు.
అసలు ఏం జరిగిందంటే..!
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని రామళ్లకోటకు చెందిన యువకుడికి... కర్నూలుకు చెందిన యువతితో పెళ్లి కుదిరింది. రామళ్లకోట నుంచి వెల్దుర్తి రోడ్డులోని బ్రహ్మగుండం క్షేత్రంలో నిన్న (ఈనెల 20న) ఉదయం 9గంటల సమయంలో పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. వధువరుల ఇళ్లలో పెళ్లి ముందు కార్యక్రమాలు పూర్తి చేసుకుని.. కుటుంబ సభ్యులు, బంధువులు మంగళవారం (మార్చి 19న) రాత్రి బ్రహ్మగుండం చేరుకున్నారు. బుధవారం (మార్చి 20న) ఉదయం పెళ్లి తతంగం ప్రారంభమైంది. వధూవరుల బంధువులతో మండపం నిండిపోయింది. వధూవరులు పెళ్లిపీటలపై కూర్చుకున్నారు. కాసేపట్లో వధువు మెడలో వరుడు మూడుమూళ్లు కట్టాలి. ఇంతలో... వధువు తల్లిదండ్రులకు ఒక ఫోన్ వచ్చింది. పెళ్లిచేసుకోబోతున్న యువకుడు... తనతో సహజీవనం చేస్తున్నాడంటూ విశాఖపట్నానికి చెందిన మహిళ ఫోన్ చేసింది. వరుడు... కొన్నేళ్లుగా తనతో సహజీనం చేస్తున్నాడని, తనను పెళ్లి కూడా చేసుకున్నాడని... తమకు పిల్లాడు కూడా ఉన్నాడంటూ ఫొటోలు కూడా షేర్ చేసింది ఆ మహిళ. పెళ్లికొడుకు అసలు బాగోతం బయటపడటంతో... వధువు తల్లిదండ్రులు గుండెలు జారిపోయాయి. వెంటనే పెళ్లి ఆపేశారు. పెళ్లిపీటల వరకు వచ్చిన కూతురు పెళ్లి పెటాకులైంది. దీంతో వధూవరుల కుటుంబాల మధ్య గొడవ జరిగింది. పెళ్లి మండపం రణరంగంగా మారింది.
ఆఖరి నిమిషంలో పెళ్లి ఆగిపోతే... అమ్మాయి పరిస్థితి, ఆమె కుటుంబసభ్యుల పరిస్థితి ఏంటి..? ఇదే ప్రశ్న తలెత్తింది. వరుడు చేసిన పనికి కోపంతో రగిలిపోయారు వధువు బంధువులు. వరుడి కుటుంబసభ్యులతో గొడవ పడ్డారు. దీంతో గ్రామంలోని పెద్దలు కలగజేసుకున్నారు. పంచాయతీ నిర్వహించి... అమ్మాయి కుటుంబసభ్యులకు క్షమాపణలు చెప్పించారు. లక్ష రూపాయాలు నష్టపరిహారం కట్టేలా ఒప్పించి రాజీ కుదుర్చారు. దీంతో.. అక్కడితో గొడవ సద్దుమణిగింది. మండపం మొత్తం ఖాళీ అయ్యింది. ఆఖరి నిమిషంలో వరుడి అసలు బాగోతం తెలిసింది కనుక సరిపోయింది.. లేదంటే అతన్ని నమ్మి పెళ్లిచేసుకోబోయిన అమ్మాయి పరిస్థితి ఏంటి..? ఆమె జీవితం ఏమయ్యేది...?
విశాఖలోని నేవీ పోర్టు ప్రాంతంలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న వరుడు... సోషల్ మీడియా ద్వారా పరిచయమై వివాహితతో పరిచయం పెంచుకున్నాడు. కుమార్తె ఉన్న మహిళతో సహజీవనం చేస్తున్నాడు. మరోవైపు... కర్నూలులో మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. తనతో సహజీవనం చేస్తున్న యువకుడు.. మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని... పెళ్లికి ఒక రోజు ముందే తెలుసుకున్న విశాఖ మహిళ... పెళ్లి ఆపేందుకు ప్రయత్నించింది. 100 నెంబర్ ద్వారా పోలీసులను కూడా ఫిర్యాదు చేసింది. అయితే... పోలీసులు సాక్ష్యాధారాలతో రమ్మని చెప్పడంతో... ఫొటోలు సేకరించిందా యువతి. అమ్మాయి తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ తెలుసుకుని... వారికే కాల్ చేసింది. ఆ యువకుడితో దిగిన ఫొటోలు.. వారు కులిసి ఉన్నట్టు తన దగ్గర ఉన్న సాక్ష్యాలను వధువుల తల్లిదండ్రులకే పంపింది. దీంతో మూడుముళ్లు పడాల్సిన సమయంలో.. పెళ్లి ఆగిపోయింది.
ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో... వారు కూడా ఆరా తీస్తున్నారు. వరుడు.. తన స్వగ్రామం అయిన రామళ్లకోటలో కూడా పలువురికి మోసం చేసినట్టు తెలుస్తోంది. పోర్టు ప్రాంతం నుంచి చవకగా బంగారం ఇప్పిస్తానంటూ గ్రామంలోని కొందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినట్టు కూడా ఊళ్లో చర్చించుకుంటున్నారు.