Devineni Uma: అవినీతిపరుడు రాజ్యమేలితే, చంద్రబాబు లాంటి నిజాయితీపరులు జైలులో ఉంటారు : దేవినేని ఉమా
జగనాసురుడిని ఓటు అనే ఆయుధంతో బంగాళాఖాతంలో కలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు మాజీ మంత్రి దేవినేని ఉమా.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. కర్నూలులో సీనియర్ న్యాయవాదులు, బార్ అసొసియేషన్ సభ్యులు చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ దీక్ష చేపట్టారు. మాజీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, దేవినేని ఉమ, టీడీపీ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు దీక్షలో పాల్గొన్నారు. దీక్షను ఉద్దేశించి దేవినేని ఉమా మాట్లాడారు. అవినీతిపరుడు రాజ్యమేలితే, నిజాయితీపరులు జైలులో ఉంటారు అనే మంచి నినాదం ఇచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. చంద్రబాబు లాంటి విజనరీ లీడర్‌ను అరెస్టు చేసి తప్పుడు కేసులు పెట్టి 23 రోజులుగా నిర్బంధించడం దారుణమన్నారు. అనేక సీబీఐ, ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉండి, 43 వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన వ్యక్తి బయట తిరుగుతున్నారని మండిపడ్డారు.
38 క్రిమినల్ కేసుల్లో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని, 16 నెలలు జైలులో ఉండి 10 సంవత్సరాలుగా బెయిల్ మీద తిరుగుతున్నాడని దేవినేని ఉమా విమర్శించారు. రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తూ, వ్యవస్థలో లొసుగులను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డాడు. 75 సంవత్సరాల భారతదేశంలో, అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికే జగన్ పరీక్ష పెట్టాడని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న వ్యక్తన్న దేవినేని ఉమా, 151 మంది ఎమ్మెల్యేలు, 22 ఎంపీలను అడ్డుకొని రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంజన్ రెడ్డి అనే లాయర్‌కు రాజ్యసభ ఇచ్చి ఏ విధంగా వ్యవస్థలతో ఆడుకుంటున్నాడని మండిపడ్డారు. రాక్షసులు కూడా రాజ్యాలు ఏలారని, రావణాసురుడు, హిరణ్యకశిపుడు, గజాసురుడు, ఇవాళ జగనాసురుడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 75 సంవత్సరాల భారతదేశంలో జగనాసురుడిని ఇప్పుడే చూస్తున్నామని దేవినేని ఉమా అన్నారు.
జగనాసురుడిని ఓటు అనే ఆయుధంతో బంగాళాఖాతంలో కలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు మాజీ మంత్రి దేవినేని ఉమా. రాష్ట్ర ముఖ్యమంత్రి 53 నెలలుగా ఒక్కసారి కోర్టు మెట్లు ఎక్కలేదని, 38 కేసుల్లో ఉన్న వ్యక్తి 2,500 సార్లు వాయిదాలు వేయించాడని తెలిపారు. తనపై ఇప్పటి వరకు ప్రభుత్వం 52 కేసులు పెట్టిందని, ప్రతి వారం కోర్టుకు వెళ్తానన్నారు దేవినేని ఉమా. కోడి కత్తి కేసులో బొత్స మేనల్లుడు చిన్న శీను సూత్రధారి అని, దళిత యువకుడు కాఫీ అభిమానంతో ఇచ్చి ఫోటో దిగితే అతని చేతిలో కత్తి పెట్టారని దేవినేని ఉమా అన్నారు. అతన్ని ఐదేళ్లుగా రాజమండ్రి జైలులో పెట్టారని, అతడికి బెయిల్ కూడా రావడం లేదన్నారు.