Anantapur Politics: అనంత అర్బన్‌లో పొలిటికల్ వార్ - మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అనంత యాత్రకు రె‘ఢీ’
Prabhakar Chowdary Padayatra: అనంతపురంలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదంటూ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పాదయాత్ర చేపడుతున్నారు.
Anantapur Urban Leaders politics: అనంతపురంలో ఇరుపార్టీల నేతల మధ్య మాటలయుద్దం మొదలైంది. తాము చేసిన అభివృద్ది తప్పితే.. అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ నేతలు చేసింది ఏమీ లేదంటూ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి రేపటి నుంచి పాదయాత్ర చేపడుతున్నారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీ నేతల మధ్య ఈ అంశం కొత్త వివాదానికి తెరతీసింది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు తప్పితే ప్రస్తుత ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఏమీ చేయలేదని ప్రభాకర్ చౌదరి ఆరోపించారు. మూడురోజుల పాటు అనంతపురం పట్టణంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. గతంలో తాము ఆమోదం తెలిపిన కార్యక్రమాలు నేడు కొనసాగిస్తూ షో చేస్తున్నారని విమర్శించారు. అందుకే తాను పాదయాత్రతో వైఎస్సార్‌సీపీ నేతల డొల్లతనాన్ని ప్రజలకు తెలియజేస్తామంటున్నారు.
ఇద్దరు అనంత అగ్రనేతల మధ్య మొదలైన పొలిటికల్ వార్ రాను రానూ తీవ్రరూపం దాల్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి గతంలో మూడుసార్లు ఎంపీగా పనిచేయగా.. ఎమ్మెల్యేగా, మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ప్రభాకర్ చౌదరి సొంతం. రాజకీయంగా కూడా ఎత్తుకు పైఎత్తులు వేయడంలో ఇద్దరూ దిట్ట. పైకి శాంతి మంత్రం జపిస్తున్నట్లు కన్పించినప్పటికీ వారు చేసే రాజకీయం చూసి ప్రత్యర్థులు ఆందోళనకు గురవుతుంటారు.
వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు.. ఎమ్మెల్యే అసమర్థతను ప్రజలకు తెలియజేసేందుకు
— Vykuntam Prabhakar Chowdary (@PrabhakarVPC) March 2, 2022
పాదయాత్ర తో మీ ముందుకు వస్తున్నా..@JaiTDP #AnantaYatra #PrabhakarChowdary #TDPTwitter pic.twitter.com/HtGkVF6ToH
ఇన్నాళ్లు సైలెంట్ రాజకీయం చేసిన ఇద్దరు నేతలు ప్రస్తుతం మాత్రం తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం పావులు కదుపుతున్నారు. అనంతపురానికి కీలకమైన రెండు నేషనల్ హైవే పనుల విషయంలో మొదలైన రాజకీయ ఆరోపణలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వీటికి తోడు కొత్తగా ఎలాంటి అభివృద్ది కార్యక్రమాలు చేపట్టలేదని, తాము గతంలో రెండు నేషనల్ హైవే పనులకోసం ఢిల్లీ చుట్టూ తిరిగి ఆమోదం చేయిస్తే ప్రస్తుత ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఈ పనులను తన ఖాతాలోకి వేసుకొని ప్రచారం చేసుకుంటారని ప్రభాకర్ చౌదరి విమర్శించారు.
గతంలో ప్రకటనలు తప్పితే ఎలాంటి పనులకు అనుమతులు లభించలేదని, కేవలం ప్రచార ఆర్భాటాలతో కాలం వెల్లదీశారని ప్రభాకర్ చౌదరిపై అనంత వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. తామే దగ్గరుండి పనులకు అనుమతులు తెచ్చుకుని పనులు వేగంగా చేపట్టడాన్ని చూడలేక ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు అనంత వెంకట్రామిరెడ్డి. ఇప్పటికే రెండు నేషనల్ హైవే పనుల వల్ల అనంతపురం నగరం రూపురేఖలు మారిపోతున్న సమయంలో వాటిని చూసి తట్టుకోలేక తమపై ప్రభాకర్ చౌదరి ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. ప్రభాకర్ చౌదరి చెప్పే కల్లిబొల్లి కబుర్లును నమ్మే పరిస్థితుల్లో అనంత ప్రజలు ఎవరూ లేరని, ఇలాంటి మభ్య పెట్టే మాటలు కట్టిపెట్టాలంటున్నారు అనంత వెంకట్రామిరెడ్డి వర్గీయలు. మూడు రోజుల పాదయాత్రతో కేవలం తమ పార్టీని బతికించుకొనేందుకు ప్రభాకర్ చౌదిరి ప్రయత్నాలు చేస్తున్నారని, తమ అభివృద్దిని మాత్రం అడ్డుకోలేరని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.