Srisailam Temple : శ్రీశైలంలో పెరుగుతోన్న భక్తుల రద్దీ, రెండ్రోజుల పాటు ఉచిత స్పర్శ దర్శనం రద్దు
Srisailam Temple : వరుస సెలవుల కారణంగా శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరుగుతోంది. దీంతో నేడు, రేపు ఉచిత స్పర్శన దర్శనాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆలయ ఈవో ప్రకటించారు.
Srisailam Temple : నంద్యాల జిల్లా శ్రీశైలంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఉచిత స్పర్శదర్శనాలను నిలిపివేశారు. వరుస సెలవుల నేపథ్యంలో మల్లన్న భక్తులకు ఉచిత స్పర్శదర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఈవో లవన్న తెలిపారు. సెలవుల కారణంగా భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం తాత్కాలిక నిలుపుదల చేశామన్నారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం, సాయంకాల వేళలో భక్తులకు ఉచితంగా స్పర్శదర్శనం కల్పిస్తున్నారు. ప్రస్తుతం భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని నేడు, రేపు ఉచిత స్పర్శదర్శనం నిలుపుదల చేశామని ఈవో లవన్న తెలిపారు.
నేడు, రేపు స్పర్శ దర్శనం రద్దు
ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరుగుతోంది. వరుస సెలవులు రావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో మల్లన్న దర్శనానికి వస్తుండడంతో రద్దీ పెరుగుతోంది. భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని మల్లన్న భక్తులకు ఉచిత స్పర్శదర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో లవన్న ప్రకటించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ప్రస్తుతం భక్తుల రద్దీ అధికం కావడంతో గతంలో ప్రకటించిన మల్లన్న ఉచిత స్పర్శ దర్శనాన్ని అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో భక్తులు నిరాశతో వెనుదిరిగారు.
గతంలో ఈ నిర్ణయం
శ్రీశైలం భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల అభ్యర్థన మేరకు ఆలయ అధికారులు ఉచిత స్పర్శ దర్శనాలు కల్పించారు. రోజుకు రెండు సార్లు ఉచిత స్పర్శ దర్శనాలు కల్పిస్తున్నట్లు గతంలో ఈవో లవన్న ప్రకటించారు. మధ్యాహ్న సమయంలో మాత్రమే గర్భాలయ ఉచిత స్పర్శదర్శనం కల్పించేవారు. అయితే వివిధ ప్రాంతాల భక్తుల కోరిక మేరకు సాయంకాలం కూడా ఉచిత స్పర్శదర్శనం కల్పించేందుకు ఆలయ ఈవో నిర్ణయం తీసుకున్నారు. అయితే వారంలో నాలుగు రోజులు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు భక్తులను అనుమతించేవారు. గురువారం ఆలయ శుద్ధి చేసుకునేందుకు 01.30 గంటల నుంచి 02.30 వరకు గర్భాలయ ప్రవేశం కల్పిస్తున్నారు. సాయంకాలం 06.30 నుంచి 07.30 వరకు సామాన్య భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు ఈవో తెలిపారు. ఈ సమయంలో కేవలం ఆలయ ముఖమండపం నుంచి ప్రవేశం చేసిన వారికి మాత్రమే స్పర్శదర్శనం కల్పిస్తారు. అయితే గర్భాలయంలోకి ప్రవేశించే భక్తులు తప్పకుండా సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే రావాలని భక్తులకు ఈవో లవన్న సూచిస్తు్న్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా రెండ్రోజల పాటు ఉచిత స్పర్శదర్శనాలు రద్దు చేశారు.