(Source: ECI/ABP News/ABP Majha)
Konaseema News : రావులపాలెం వివాదంలో ఎస్ఐ, సీఐ సస్పెండ్, నిరసన దీక్ష విరమించిన ఎమ్మెల్యే
Konaseema News : కోనసీమ జిల్లా గోపాలపురంలో పేపర్ ప్లేట్లపై అంబేడ్కర్ ఫొటోలు ఉండడం వివాదానికి దారితీసింది. ఈ ఘటనలో 18 మంది యువకులపై అక్రమ కేసులు పెట్టారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Konaseema News : కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో జరిగిన ఘటనలో 18 మంది యువకులపై అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీసుశాఖ నివారణ చర్యలు చేపట్టింది. ఈ కేసుకు బాధ్యత వహిస్తూ సీఐ, ఎస్సైలను తాత్కాలికంగా విధులు నుంచి తప్పిస్తున్నట్లు ఏలూరు రేంజ్ డీఐజీ జీ.పాలరాజు తెలిపారు. గోపాలపురంలోని అన్నపూర్ణ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ చిత్రంతో ఉన్న పేపర్ ప్లేట్లను వినియోగించారని హోటల్ నిర్వాహకుడ్ని కొందరు యువకులు ప్రశ్నించించారు. అప్పుడు జరిగిన గొడవలో 18 మందిపై కేసులు నమోదు చేసి యువకులను జైలుకు పంపిన విషయం తెలిసిందే.
ప్లేట్లపై అంబేడ్కర్ ఫొటోల వివాదం
ఈ ఘటనలో అన్యాయంగా అరెస్టు చేశారని అంబేడ్కర్ ని అవమానించిన హోటల్ యజమానిపై చర్యలు తీసుకోలేదని దళిత సంఘాలు పెద్దఎత్తున నిరసన తెలిపాయి. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించి విచారణ చేశారు. అంబేడ్కర్ ను అవమాన పరిచిన హోటల్ యజమాని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అవడంతో స్థానిక ఎమ్మెల్యే చర్ల జగ్గిరెడ్డి కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యే అండతోనే దళిత యువకులపై అన్యాయంగా కేసులు పెట్టారని దళిత సంఘ నాయకులు ఆరోపించారు. ఇదిలా ఉంటే కొత్తపేట ఎమ్మెల్యే చర్ల జగ్గిరెడ్డి దళిత యువకులపై కేసులు నమోదు చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలంటూ నిరసన దీక్ష చేపట్టారు. వారికి మద్దతుగా అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధతో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకుని 18 మంది యువకులపై కేసులు ఎత్తేయలంటూ డిమాండ్ చేశారు.
నిరసన విరమించిన ఎమ్మెల్యే
ఈ విషయం తెలుసుకున్న ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు రావులపాలెం పోలీస్ స్టేషన్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ రావులపాలెంలోనే కాకుండా ఇంకా పలుచోట్ల అంబేద్కర్ ఫొటోతో ముద్రించిన ప్లేట్లను వినియోగిస్తున్నరని తమ దృష్టికొచ్చినట్లు తెలిపారు. దీనిపై వెంటనే చర్యలు చేపడతామన్నారు. స్థానికంగా సీఐ వెంకటనారాయణ, ఎస్ఐ భాను ప్రసాద్ లను తాత్కాలికంగా విధుల నుంచి తప్పించినట్లు తెలిపారు. స్థానిక శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి నిరసన కార్యక్రమాన్ని విరమించుకున్నారు.
Also Read : Godavari Floods : గోదావరి ఉగ్రరూపం, ముంపు ముప్పులో లంక గ్రామాలు!