(Source: ECI/ABP News/ABP Majha)
Godavari Floods : గోదావరి ఉగ్రరూపం, ముంపు ముప్పులో లంక గ్రామాలు!
Godavari Floods : గోదావరి వరద ధాటికి లంక గ్రామాలు అల్లాడిపోతున్నాయి. ఇప్పటికే 40 గ్రామాలు పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.
Godavari Floods : గోదావరికి వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8.45 లక్షల క్యూసెక్కులు అని ప్రకటించింది. సోమవారం రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక జారిచేసే అవకాశం ఉందని తెలిపింది. వరద ముంపు ప్రభావిత మండలాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచించింది. వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్లు తెలిపింది. సహాయక చర్యల కోసం రెండు ఎన్డీఆర్ఎఫ్, నాలుగు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించినట్లు వెల్లడించింది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రకాశం బ్యారేజ్ వద్ద దిగువకు వరదనీరు విడుదల చేశారని, లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్లడం లాంటివి చేయరాదని సూచించింది.
ధవళేశ్వరం బ్యారేజి నీటి మట్టం 6.2 అడుగులు
ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద గోదావరికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. బ్యారేజి నీటి మట్టం 6.2 అడుగులకు చేరింది. 3.62 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. కోనసీమలో క్రమక్రమంగా వరద తీవ్రత పెరుగుతోంది. పి.గన్నవరం మండలం గంటి పెదపూడి లంక, బూరుగులంక, అరిగెలవారి పేట, పెదలంక గ్రామాల ప్రజలు నిత్యావసరాల కోసం పడవలపై ప్రయాణం పరిస్థితి వచ్చింది. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం-కోటిపల్లి రేవు తాత్కాలిక రహదారి తెగిపోవడంతో ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. వరద క్రమంగా పెరగటంతో లంక వాసులు ఆందోళన చెందుతున్నారు. లంకల్లో పండించిన పంటలు నీటిపాలవుతాయని రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. పడవలపై ప్రయాణాలు సాగిస్తున్న కారణంగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రెవెన్యూ, పోలీసు అధికారుల పర్యవేక్షిస్తు్న్నారు.
40 గ్రామాలు జలదిగ్బంధం
అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలోని గండి పోశమ్మ ఆలయం వరద ముంపులో చిక్కుకుంది. ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు పోలవరం కాపర్ డ్యామ్ వద్దకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. బ్యాక్ వాటర్ కారణంగా దేవీపట్నం మండలం గొందూరులో వెలసిన మాతృశ్రీ గండి పోశమ్మ ఆలయ గర్భగుడిలో అమ్మవారి కంఠం వరకు వరద నీరు చేరింది. గంట గంటకు గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయం వద్దకు వరద నీరు చేరింది. దండంగి గ్రామం నుంచి పోశమ్మ గుడి వైపుగా వెళ్లే రహదారులు పూర్తిగా జల దిగ్బంధం అయ్యాయి. సుమారు 40 గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.