Jagan House at Lotus Pond: ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి నిర్మాణాల కూల్చివేతలో ట్విస్ట్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌పై వేటు
Khairatabad Zonal Commissioner Suspension: హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఉన్న వైఎస్ జగన్ నివాసంలోని కొన్ని నిర్మాణాలను GHMC అధికారులు శనివారం కూల్చివేశారు. జీహెచ్ఎంసీ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
GHMC Suspends Khairatabad Zonal Commissioner Hemant in Jagan Lotus Pond House Issue| హైదరాబాద్: లోటస్ పాండ్‌లోని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాలు అని కూల్చివేసిన ఘటనలో ట్విస్ట్ చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా కీలక నిర్ణయాలు తీసుకోవడంతో చర్యలు చేపట్టారు. కూల్చివేతలకు ఆదేశాలు జారీ చేసిన ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్‌పై వేటు పడింది. జోనల్ కమిషనర్ హేమంత్ ను సాధారణ పరిపాలన విభాగం (GAD)కి అటాట్ చేస్తూ జీహెచ్ఎంసీ ఇంఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా హైదరాబాద్ లోటస్ పాండ్ లోని వైఎస్ జగన్ ఇంటి ముందు నిర్మాణాలు (Jagan House at Lotus Pond), షెడ్లను కూల్చివేసినందుకు ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు గట్టి షాక్ ఇచ్చారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్‌లో ఉన్న జగన్ ఇంటి ముందు ఉన్న నిర్మాణాలను, సెక్యూరిటీ గదులను జీహెచ్ఎంసీ సిబ్బంది శనివారం కూల్చివేసింది. అక్రమంగా నిర్మించారని, అందుకు పర్మిషన్ లేదని అధికారులు చెబుతున్నారు. జూబ్లిహిల్స్ లోని లోటస్ పాండ్‌లో ఉన్న జగన్ ఇల్లు ఇంటి ముందు విశాలమైన ఫుట్ పాత్ ఉంటుంది. అయితే స్థలాన్ని ఆక్రమించి జగన్ తన ఇంటి ముందు సెక్యూరిటీ రూములు నిర్మించారని ఆరోపణలు వచ్చాయి. ఏపీలో సీఎంగా విజయం సాధించాక గత ఐదేళ్లుగా జగన్ ఏపీలోని తాడేపల్లిలో ఉంటున్నారు. లోటస్ పాండ్ లోని ఇంటికి ఏపీ పోలీసులు భద్రత కల్పించారు.
అయితే లోటస్ పాండ్ నివాసం బయట ఫుట్ పాత్ ఆక్రమించి సెక్యూరిటీ రూములు నిర్మించారని ఈ నిర్మాణాలపై స్థానికులు పలుమార్లు గ్రేటర్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఏపీ నూతన సీఎంగా చంద్రబాబు సైతం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో లోటస్ పాండ్ లోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని శుక్రవారం సాయంత్రం జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఆక్రమణల తొలగింపు బృందం వచ్చి శనివారం జగన్ ఇంటి ముందు ఉన్న నిర్మాణాలను తొలగించింది. వాస్తవానికి కొన్ని కంపెనీల పేరు మీద అధిక వాటాలు జగన్ కుటుంబం చేతుల్లో ఉండటంతో లోటస్ పాండ్‌లో జగన్ సొంత ఆస్తిగా మారింది. కానీ ఆ ఇల్లు కూడా జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఉండటంతో క్విడ్ ప్రో కో ద్వారా లభించిందని సీబీఐ ఆరోపిస్తోంది.