Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Andhra News: ఏపీలో ఘోర విషాదం చోటు చేసుకుంది. సముద్ర స్నానానికి వెళ్లి బైక్‌పై వస్తున్న ముగ్గురు టిప్పర్ లారీ ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. బాపట్ల జిల్లాలో ఈ ఘటన జరిగింది.
Three People Died In Bapatla Road Accident: ఏపీలో ఒకే రోజు వరుస ప్రమాద ఘటనలు ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. బాపట్ల జిల్లాలో (Bapatla District) టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా పర్చూరు - చిలకలూరిపేట రహదారి రక్తమోడింది. పర్చూరు (Parchuru) మండలం అన్నంబోట్లవారిపాలెం సమీపంలో బైక్‌ను మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఆదివారం సాయంత్రం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అత్త, అల్లుడు, కుమార్తె ప్రాణాలు కోల్పోయారు.
చీరాల మండలం వాడరేవుకు సముద్ర స్నానానికి వచ్చిన దంపతులు షేక్ మస్తాన్ వలి (30), షేక్ అమీరున్ (20) ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మార్టూరు మండలం కోనంకికి చెందిన అత్త షేక్ చినబుడెమ్మ (40) ఈ ఘటనలో తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు మేదరమెట్ల వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై పర్చూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పల్నాడు జిల్లాలో..
అటు, పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చెట్టును కారు ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, మరో నలుగురు గాయపడ్డారు. పల్నాడు జిల్లాలోని అద్దంకి - నార్కట్‌పల్లి హైవేపై బ్రాహ్మణపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పిడుగురాళ్లలోని ఆస్పత్రికి తరలించారు. మృతులు నెల్లూరు జిల్లా కావలి మండలం సిరిపురానికి చెందిన తుళ్లూరు సురేశ్, వనిత, యోగులు, వెంకటేశ్వర్లుగా గుర్తించారు.
తమ కొత్త కారుకు పూజలు చేసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణలోని కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్లగా.. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. అతి వేగం, డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కారు చెట్టును ఢీకొట్టడంతో విషాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.