Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Andhra News: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 15 వరకూ ఏపీలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
AP Latest Weather Report: ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకుని ఉన్న తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రంపై అల్పపీడనం కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ (Ronanki Kurmanath) తెలిపారు. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ - వాయువ్య దిశగా కదులుతూ మరింతగా బలపడే అవకాశం ఉందన్నారు. ఈ నెల 11 నాటికి శ్రీలంక - తమిళనాడు తీరాలకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలోకి చేరే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఈ నెల 15 వరకూ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని.. వ్యవసాయ సంబంధిత సందేహాల నివృత్తి కోసం మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలన్నారు.
రైతులకు కీలక సూచనలు
- కోతకి సిద్దంగా ఉన్న వరి పంటని వర్షాలకు ముందు కోయరాదని రైతులకు వ్యవసాయాధికారులు సూచించారు. కోసినా పూర్తిగా ఆరని పనలను వర్షాల క్రమంలో కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్ప వేసుకోవడం వల్ల నష్ట శాతాన్ని నివారించుకోవచ్చన్నారు.
- కోత కోసి పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిచినట్లైతే గింజ మొలకెత్తకుండా ఉండడానికి 5% ఉప్పు ద్రావణాన్ని పనలపై పడేవిధంగా పిచికారీ చేయాలి.
- రైతులు పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు/చెట్లు పడిపోకుండా నిలబడేందుకు కర్రలు/బాదులతో సపోర్ట్ అందించాలని కోరారు.
కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు
వర్ష సూచన నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఇప్పటికే పంట కోసి ధాన్యాన్ని రాసులుగా పోసి ఉంటే ఆ ధాన్యం వర్షాలకు తడవకుండా కాపాడేందుకు వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యపు రాశులను వర్షాలకు తడవకుండా సమీప రైసు మిల్లులకు తరలించేలా చూడాలన్నారు. అలాగే, ఎక్కడైనా రైతులు కోతలు కోసి ధాన్యాన్ని రాసులుగా వేసి ఉంటే ఆ ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు అవసరమైన టార్ఫాలిన్లను రైతులకు సమకూర్చాలని నిర్ధేశించారు. వర్షాలు పడే సమయంలో రైతులెవరూ పంట కోత చేయకుండా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు.