(Source: Poll of Polls)
Kakinada News : ప్లేసు మార్చిన పెద్దపులి, రోజుకో కొత్త ప్రాంతంలో తిష్ట
Kakinada News : కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో పులి భయాంందోళలు ఇంకా కొనసాగుతున్నాయి. రోజుకో ప్రాంతంలో పులి అడుగు జాడలు కనిపిస్తుండడంతో స్థానికులు హడలిపోతున్నారు.
Kakinada News : చుట్టూ ఎత్తైన కొండలు, దానికి ఆనుకుని దట్టమైన అటవీ ప్రాంతం. కొండ ఇవతలి ప్రాంతం అంతా జనావాసాలు, పొలాలు. కొంచెం ముందుకు వెళితే దట్టంగా పెరిగిపోయిన సరుగుడు తోటలు, అడవి పొదలు. ఆకలి వేస్తే అందుబాటులో మేత మేస్తున్న పశువులు. కష్టపడి వేటాడకుండానే అందుబాటులో కావాల్సినంత ఆహారం. ఇలా ఇన్ని అనుకూలతలున్న స్థలం దొరికితే పులి ఎక్కడికి వెళుతుంది. ఎక్కడికిపోను ఇక్కడే ఉంటా అంటూ సింగం సెటిలైపోయింది. గత వారం రోజులుగా జాడ లేకుండా పోయిన రాయల్ బెంగాల్ టైగర్ తన పాదముద్రలతో మరోసారి ఇక్కడే ఉన్నా వదల బొమ్మాళీ అంటూ సందిగ్ధతకు తెరలేపింది. తాజాగా ప్రత్తిపాడు మండల పరిధిలోని పెద్దిపాలెం శివారు కొత్తమూరి పేట, పొట్టిమెట్ట వద్ద పులి పాదముద్రలు అటవీశాఖ అధికారులు గుర్తించారు. వారి పరిశీలనలో గత 29 రోజులుగా అలజడి సృష్టిస్తోన్న పెద్దపులి, తాజాగా మరో కొత్తప్రాంతంలో లభ్యమైన పాదముద్రలు ఒకటేనని తేల్చారు. ఇన్ని రోజులుగా మూడు మండలాల పరిధిలో దాదాపు 15 గ్రామాల్లో తిరిగి టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్న బెంగాల్ టైగర్ ఇక్కడే సెటిలైపోయినట్లు కనిపిస్తుంది.
రూటు మార్చిన టైగర్
కాకినాడ జిల్లాలో మూడు మండలాల ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న టైగర్ తరచూ రూట్ మారుస్తూ కొత్త ప్రాంతాల్లోకి వెళ్లడం వెనుక పలు కారణాలను ఉన్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. పాదముద్రలు కనిపించాయని స్థానిక రైతుల ద్వారా సమాచారం అందుకుంటున్న అటవీశాఖ అధికారులు పగటిపూట అంతా ఆ ప్రాంతంలో మంది మార్బలం, వాహనాలతో కలియతిరుగుతున్నారు. దీనికి తోడు ఆ ప్రాంత రైతులు పులి భయంతో పొలాల్లో మంటలు వేయడం, పెద్ద పెద్ద శబ్దాలు చేయడంతో పులి తన స్థావరాన్ని మార్చుకుంటూ వస్తుంది. దానికి సురక్షితంగా కనిపించే మరో ప్రాంతానికి వెళ్తూ రోజుకో చోట సెటిల్ అవుతోంది. ఆ ప్రాంతంలో పులి రాదని రైతులు నిర్లక్ష్యంగా ఉండొద్దని, రోజుకో చోట తన స్థావరాన్ని మార్చుకుంటున్న క్రమంలో ఉదయం పూట పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఆందోళన ఆలోచనలో ప్రజలు!
రెండు రోజుల్లో మహారాష్ట్ర నుంచి తడోబా టీమ్స్ వస్తాయని చెప్తున్నా ఇప్పటి వరకూ వారి జాడ లేదు. అటు తడోబా బృందాలు రాకపోవడంతో స్థానికులు నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ పులిభయంతో అటు పొలాలకు వెళ్లలేక, పనులు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళనబాట పడతామని ప్రత్తిపాడు మండలంలోని శరభవరం, పొదురుపాక, పెద్దిపాలెం, పాండవులపాలెం తదితర ప్రాంతాలకు చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.