YSRCP News : వైసీపీకి జంగా కృష్ణమూర్తి రాజీనామా - ఈ వారంలో టీడీపీలో చేరే అవకాశం
Andhra News : వైసీపీలో ఉన్న బలమైన బీసీ నేత జంగా కృష్ణమూర్తి ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో చేరనున్నారు.
Janga Krishnamurthy Resigned To YCP : పల్నాడు జిల్లాలో వైఎస్సార్‌సీపీకి మరో నేత షాకిచ్చారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ, బీసీ నేత జంగా కృష్ణమూర్తి యాదవ్ వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన ఐదు లేదా ఆరో తేదీన టీడీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు అనుచరులు కూడాపెద్ద ఎత్తున టీడీపీలోచేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. జంగా రాకతో పల్నాడు జిల్లాలో టీడీపీకి మరితం బలం చేకూరనుంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పని చేశాను.. కానీ, నా విధేయతను పార్టీ గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019లో కాసు మహేష్ రెడ్డి కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేశాను.. కానీ, ఈరోజు గురజాలలో మళ్లీ మహేష్‌రెడ్డికి సీట్ ఇచ్చారని మండిపడ్డారు. వైసీపీ అధిష్టానం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయలేకపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు జంగా కృష్ణమూర్తి.. అందుకే అలాంటి పార్టీలో ఉండకూడదని నిర్ణయించుకున్నాను అన్నారు. నన్ను నమ్ముకున్న వాళ్ల కోసం టీడీపీలోకి వెళ్తున్నానని ప్రకటించారు. పార్టీని వీడడం ఎంతో బాధాకరంగా కూడా ఉందని అన్నారు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి, బీసీ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నన్ను నమ్ముకున్న వాళ్ల కోసం, భవిష్యత్ కోసం.. తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నట్టు ఈ సందర్భంగా జంగా కృష్ణమూర్తి వెల్లడించారు.
కొద్ది రోజుల కిందటే జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరుతారని అనుకున్నారు. ఆయన పేరును గురజాలతో పాటు నర్సరావుపేట అసెంబ్లీ స్థానాలకు పరిగణనలోకి తీసుకున్నారు. అయితే సర్వేల్లో సానుకూల ఫలితాలు రాకపోవడం.. ఆయా స్థానాల్లో టీడీపీకి బలమైన అభ్యర్థులు ఉండటంతో.. టిక్కెట్లు కేటాయించలేకపోయారు. ఈ కారణంగా చేరిక ఆలస్యం అయింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన లావు కృష్ణదేవరాయులుకు జంగాకృష్ణమూర్తి అత్యంత సన్నిహితుడు. ఈ కారణంగా టీడీపీ అధినేతతో చర్చించి.. జంగా కృష్ణమూర్తికి ఆయన కుమారుడికి రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబు హామీ ఇప్పించారు.
ఇప్పటికే వైసీపీలో సామాజిక అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు కొంతకాలంగా అధికార పార్టీకి దూరమవుతూ వస్తున్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.. టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. గురజాల నియోజకవర్గంలోని తన సొంత గ్రామం గామాలపాడులో కార్యకర్తల సమక్షంలో వైసీపీకి రాజీనామా ప్రకటన చేశారు.
జంగా కృష్ణమూర్తి వైసీపీ సీనియర్ నేతల్లో ఒకరు. ఆయన బీసీ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన మహేష్ రెడ్డి కోసం టిక్కెట్ త్యాగం చేశారు. అయితే ఆయనకు గుర్తింపు లభించలేదు. టీటీడీ చైర్మన్ పోస్టు ఇస్తారని ప్రచారం జరిగింది. ఆయన కూడా ఆశలు పెట్టుకున్నారు. చివరికి అది కూడా భూమన కరుణాకర్ రెడ్డికి ఇచ్చారు. పైగా సొంత నియోజకవర్గంలో ఆయన కార్యకలాపాలపై ఆంక్షలు విధించారు. ఇక పార్టీలో తనకు న్యాయం జరగదన్న ఉద్దేశంతో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పారు.