(Source: ECI/ABP News/ABP Majha)
Solar Eclipse: సూర్య, చంద్ర గ్రహణాలు ఖగోళ అద్భుతం, రాహువు మింగడం కట్టు కథే!
Solar Eclipse: సూర్యగ్రహణం వేళ తింటే ఏమీ జరగదని జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సూర్యగ్రహణం సమయంలో అల్పాహారం చేసి అవగాహన కల్పించారు.
Solar Eclipse: ఈ రోజు సూర్య గ్రహణం ఏర్పడింది. అక్టోబర్ 25వ తేదీన సాయంత్రం 4.29 గంటలకు ప్రారంభమై 6.26 గంటలకు ముగియనుందని పండితులు చెప్పారు. పాక్షిక సూర్య గ్రహణం ఉంటుందని చెప్పారు. దృక్ సిద్ధాంత గణితం ఆధారంగా అశ్వయుజ మాసం బహుళ పక్ష అమావాస్య స్వాతి నక్షత్రంలో సూర్య గ్రహణం ఏర్పడింది. అయితే, మన దగ్గర మాత్రం పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడిందని వెల్లడించారు. గ్రహణం వేళ ఏమీ తినకూడదని, ఇంట్లో నుండి బయటకు రావొద్దని అంటారు. తులసి ఆకులపై నీటిపై ఉంచితే సూర్య గ్రహణ ప్రభావం తగ్గుతుందని అంటారు. అలాగే సూర్య, చంద్ర గ్రహణాల వేళ ఇళ్లల్లోని ఆహార పదార్థాలు, నీళ్లలో గరిక వేయాలని అంటారు.
అవన్నీ కట్టుకథలే
సూర్యగ్రహణం గురించి చెప్పేవన్నీ కట్టు కథలని రాహువు సూర్యుడుని మింగడం వల్ల సూర్య గ్రహణం, కేతువు చంద్రుడిని మింగడం ద్వారా చంద్ర గ్రహణం వస్తుందని నమ్మడం మూర్ఖత్వమని జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు విశాఖపట్నంలో వెల్లడించారు. సూర్య, చంద్ర గ్రహణాలు ఖగోళంలో జరిగే ఒక అద్భుత ప్రక్రియేనని చెప్పారు. భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డు రావడం వలన గ్రహణం ఏర్పడుతుందని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు, ఎరుకొండ ఆనంద్, పట్టణ అధ్యక్షుడు షినగం శివాజీ తెలిపారు. సూర్య గ్రహణాన్ని పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం స్థానిక ఆర్ అండ్ బి కూడలి వద్ద జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూర్య గ్రహణాన్ని తిలకించడంతో పాటు అల్పాహార ఏర్పాట్లు చేశారు. గ్రహణం వేళ ఆహారం తిన్నా, నీళ్లు తాగినా ఏమీ కాదని జన విజ్ఞాన వేదిక చేసి చూపించింది. ఈ సందర్భంగా ఆనంద్, శివాజీ మాట్లాడుతూ గ్రహణాల పట్ల ప్రజల్లో రకరకాల అపోహలు ఉన్నాయని, ఈ అపోహలను తొలగించి ప్రజలను చైతన్య పరిచేందుకు జన విజ్ఞాన వేదిక గ్రహణాలు ఏర్పడే ప్రతి సారి అవగాహన కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు.
ఏమీ తినొద్దన్నవి కేవలం కట్టుకథలే
ప్రధానంగా గ్రహణం సమయంలో ఏమీ తినకూడదు, తా1గకూడదు అన్న అపోహ ప్రజల్లో గట్టిగా ఉందని, గ్రహణం ఏర్పడే సమయంలో ఏమి తిన్నా, త్రాగిన ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని ప్రజలకు తెలియజేసేందుకు గ్రహణం సమయంలో తినడం, త్రాగడం చేశామని స్పష్టం చేశారు. గర్భిణీలు కూడా గ్రహణాల సమయంలో తమ పనులను యథావిధిగా చేసుకోవచ్చని చెప్పారు. అదే విధంగా గ్రహణాన్ని నేరుగా తిలకిస్తే కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నందున ఫోటోలు తీసేందుకు వాడే నెగిటివ్ లు లేదా ఎక్స్ రే ఫిలిమ్స్ సహకారంతో చూడాలని సూచించారు.
సూర్యగ్రహణం వేళ వంటావార్పు
సూర్య గ్రహణం విషయంలో ప్రజల్లో నెలకొన్న అనేక మూఢ నమ్మకాల్ని వీడాలని, దళిత హక్కుల సమైక్య ఆధ్వర్యంలో, బుల్లయ్య కాలేజీ వద్ద గల అంబేద్కర్ హాల్ లో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. సూర్య గ్రహణం అనేది ఒక సహజ సిద్ధంగా ఏర్పడే ప్రక్రియ అని, అలాగనే ఖగోళ అద్భుతాన్ని తిలకించాలంటూ చైతన్య కార్యక్రమం నిర్వహించారు. సూర్య గ్రహణం సమయంలోనే బిర్యానీ వంట చేసి భోజనాలు పెట్టించారు. దళిత సమైక్య నాస్తిక సమాజం సభ్యులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.