Jagan Well Played : ఓ అడుగు వెనక్కి వేసి.. మరో అవకాశం సృష్టించుకున్న జగన్ ! బిల్లుల ఉపసంహరణ వెనుక పక్కా రాజకీయ వ్యూహం !
ఓ అడుగు వెనక్కి వేసి మరో అవకాశాన్ని జగన్ సృష్టించుకున్నారు. బిల్లులు న్యాయస్థానాల్లో కొస్తే అసలు చాన్స్ లేకుండా పోతుంది. ఉపసంహరించుకోవడం ద్వారా మరో అవకాశం కల్పించుకున్నారు.
మూడు రాజధానుల అంశంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గడం రాజకీయ వర్గాలను ఆశ్చర్య పరిచింది. అసలు ఇలాంటి అవకాశమే లేదని ఆయన మనస్థత్వ గురించి తెలిసిన వారు.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూఆయన తీసుకున్న నిర్ణయాలను పరిశీలించిన వారు ఇప్పటి వరకూ భావిస్తూ వస్తున్నారు. అందుకే హఠాత్తుగా మూడు రాజధానుల బిల్లులను వెనక్కి తీసుకోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఓ పక్కా ప్రణాళికతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
Also Read: త్వరలో మూడు రాజధానుల కొత్త బిల్లులు ... అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన !
న్యాయస్థానంలో కొట్టివేతకు గురైతే మరో చాయిస్ ఉండదు !
పిటిషన్ కొట్టి వేయమంటారా..? ఉపసంహరించుకుంటారా? ఇలాంటి హెచ్చరికలు న్యాయస్థానాల్లో పసలేని పిటిషన్లు వేసిన వారికి న్యాయమూర్తుల నుంచి ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు పిటిషనర్లు కొట్టి వేయవద్దని ఉపసంహరించుకుంటామని వేడుకుంటారు. ఎందుకంటే పిటిషన్ కొట్టి వేస్తే ఆ అంశానికి అంతటితో తెరపడుతుంది. మరోసారి ఏం చేసినా తీర్పునకు విరుద్దం అవుతుంది. అందుకే పిటిషన్ ఉపసంహరించుకుని మరింత సమాచారంతో మళ్లీ పిటిషన్ వేస్తామనో మరో కారణమో చెబుతారు. ప్రస్తుతం హైకోర్టులో పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు విచారణలో ఉన్నాయి. కోర్టు రోజువారీ విచారణ చేపడుతోంది. అభివృద్ది మొత్తం ఆగిపోయినట్లుగా కనిపిస్తోందని త్వరగా తేల్చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. సీఆర్డీఏ చట్టం రద్దు కానీ.., పాలనా వికేంద్రీకరణ బిల్లులు కానీ న్యాయసమీక్షలో నిలబడేవనేది పెద్దగా అనుభవం కూడాలేని లాయర్లు చెప్పేమాట. ఇక అడ్వకేట్ జనరల్ లాంటి వారికి తెలియనిదేమీ కాదు. విచారణ సందర్భంగా ధర్మాసనం చేస్తున్న వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయి. ఇదే వేగంగా విచారణ జరిగితే మరో నెల రోజుల్లో హైకోర్టు తీర్పు వచ్చే అవకాశం ఉంది. చట్టాలను కొట్టి వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంటే మరోసారి బిల్లులు పెట్టడం అనేది సాధ్యం కాని విషయం. అలా చేస్తే కోర్టు ధిక్కరణ.. రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. అందుకే వేగంగా బిల్లుల ఉపసంహరణ నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అందుకే బిల్లుల ఉపసంహరణ నిర్ణయాన్ని ముందుగా కోర్టుకు తెలిపి..,స ఆ తర్వాత అసెంబ్లీలోప్రవేశ పెట్టినట్లుగా భావిస్తున్నారు.
ఓ అడుగు వెనక్కి వేసి మరో అవకాశం సృష్టించుకున్న జగన్!
ఉన్న పళంగా బిల్లులను వెనక్కి తీసుకుంటూ నిర్ణయం తీసుకోవడం వల్ల తన నిర్ణయం విషయంలో జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గినట్లుగా ఉంటుంది కానీ.., ముందడుగు వేయడానికి మరో అవకాశం తనకు తానే సృష్టించినట్లుగా భావింవచ్చు., ఇప్పుడు ఉపసంహరించుకోవడం వల్ల హైకోర్టు ఈ పిటిషన్లపై విచారణను ముగించే అవకాశం ఉంది. బిల్లులు ఆమోదించిన విషయాన్ని ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్తారు. చట్టబద్దంగా బిల్లులను ఉపసంహరించినందున..., హైకోర్టు కూడా ఈ అంశంలో ప్రత్యేకంగా విచారణ జరిపేదేమీ ఉండకపోవచ్చని న్యాయనిపుణుల అంచనా. ఉపసంహరించినందున బిల్లుల కొట్టివేత అనేమాటే రాదు. అలా రాదు కాబట్టే సీఎం జగన్ మళ్లీ బిల్లులు పెడతామని నిర్మోహమాటంగా చెప్పారని భావించవచ్చు.
Also Read : తప్పు ప్రభుత్వాలది.. శిక్ష రైతులకు ! అమరావతి రైతుల పోరాటానికి 700 రోజులు !
మళ్లీ బిల్లులు పెట్టినా రైతులు కోర్టుకెళ్తారు.. - కావాల్సింది కూడా అదే!
పాలనా వికేంద్రీకరణ బిల్లులను ప్రవేశ పెట్టినప్పుడు శరవేగంగా విసాఖకు వెళ్లిపోవాలనిఅుకున్నారు. కానీ ఆలస్యం అయిన తర్వాత ఇప్పుడు వద్దు అని అని అనుకుంటున్నారు. గతంలో విచారణను కరోనా పేరుతో వాయిదా కోరినప్పుడే చాలా మందికి ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. అలాగే ఇటీవల ప్రారంభమైన విచారణలోనూ ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులపై అభ్యంతరం వ్యక్తం చేసి వారిని తప్పించాలని కోరారు. ఇది కూడా విచారణను ఆలస్యం చేయడానికేనని అనుకున్నారు. కానీ ఆ ఎత్తు పారలేదు. దీంతో విచారణ వేగంగా జరిగితీర్పు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో వివాదం కొనసాగాలంటే మళ్లీ మొదటికి తీసుకు రావాలన్నవ్యూహంతోనే కోర్టులో పిటిషన్ ఉపసంహరించుకుని.. కొత్త బిల్లుపేరుతో మళ్లీ మొదటి నుంచి ప్రారంభించే వ్యూహం అమలు చేస్తున్నారని భావిస్తున్నారు.
వచ్చే ఎన్నికలకు మూడు రాజధానులే ముడి సరుకు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలకు మూడు రాజధానులనే ముడి సరుకుగా వాడుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఐదేళ్ల పరిపాలన కన్నా.., మూడు రాజధానుల అంశం ఎజెండాగా ఎన్నికలకు వెళ్లడమే మంచిదన్న నిర్ణయానికి ఆ పార్టీ వ్యూహకర్తలు రావడం వల్లనే బిల్లులు వెనక్కి అనే నిర్ణయం వచ్చిందని భావిస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ బిల్లులను ప్రవేశపెడతారు. ఆ తర్వాత రైతులు కోర్టులకు వెళ్తారు. ఆ వివాదం ఎన్నికల వరకూ సాగుతుంది. అప్పుడు ఇదే అంశంపై ఎన్నికలకు వెళ్తారు. ఐదేళ్ల పాలన అంశం ఓటింగ్ ఎజెండా కాకుండా పోతుంది. అదే వ్యూహంతో జగన్ ఆయన వ్యూహకర్తలు అడుగులు ముందుకేశారని భావింవచ్చు.