Three Capitals Jagan : త్వరలో మూడు రాజధానుల కొత్త బిల్లులు ... అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన !
సమగ్రమైన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను మళ్లీ ప్రవేశపెడతామని సీఎం జగన్ ప్రకటించారు. ఈ సారి అన్ని వర్గాల మద్దతూ పొందుతామన్నారు.

మూడు రాజధానులపై వెనక్కి తగ్గలేదని ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. త్వరలోనే సమగ్రమైన బిల్లులతో మళ్లీ అసెంబ్లీలో ప్రవేశ పెడతామని ప్రకటించారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో కొత్త బిల్లులు ప్రవేశ పెట్టింది. గతంలో ఉన్న సీఆర్డీఏను పునరుద్ధరించారు. పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును కూడా రద్దు చేస్తున్నట్లుగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందన్నారు. భాగస్వాములతో సంప్రదింపులు జరపకపోవడం, శాసనమండలిలో బిల్లులు సెలక్ట్ కమిటీకి వెళ్లడం వంటి కారణాల వల్ల బిల్లులు వెనక్కి తీసుకుంటున్నట్లుగా బుగ్గన చెప్పారు.
ఈ అంశంపై సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా మూడు రాజధానులపై వెనక్కి తగ్గలేదని ఆయన స్పష్టం చేశారు. పూర్తి సమగ్రమైన వికేంద్రీకరణ బిల్లును తీసుకొస్తామన్నారు. 1953 నుంచి 1956 వరకూ కర్నూలులో రాజధాని..గుంటూరులో హైకోర్టు ఉండేదని గుర్తు చేశారు. రాజధాని ప్రాంతం అంటే తనకు వ్యతిరేకత లేదని.. తనకు ఇక్కడే ఇల్లు ఉందన్నారు. ఈ ప్రాంతం అంటే తనకు ప్రేమ అని జగన్ చెప్పారు. గత ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఉల్లంఘించి రాజధానిని ఖరారు చేసిందని.. అలా ఎంపిక చేసిన ప్రాంతం.. అటు గుంటూరు కాదు.. ఇటు విజయవాడ కాదని ఆక్షేపించారు.
రాజధాని ప్రాంతంలో 50వేల ఎకరాలకు లక్ష కోట్లు ఖర్చవుతాయని.. మౌలిక సదుపాయాల కల్పనకే లక్ష కోట్లు ఖర్చవుతాయని గత ప్రభుత్వ లెక్కలే చెప్పాయని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంలో రోడ్డు, కరెంట్, నీళ్లు లాంటి క నీస అవరాలకు లక్ష కోట్లు ఖర్చవుతాయని.. డబ్బు లేనప్పుడు రాజధాని అనే ఊహా చిత్రం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. విశాఖ రాష్ట్రంలో పెద్ద నగరం .. దానిపై కద్దిగా ఖర్చు పెడితే పెద్ద నగరాలతో పోటి పడొచ్చునని జగన్ గుర్తు చేశారు. చదవుతున్న వారి పిల్లలు ఇతర నగరాలకు వలస వెళ్లాల్సిందేనా అని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : తప్పు ప్రభుత్వాలది.. శిక్ష రైతులకు ! అమరావతి రైతుల పోరాటానికి 700 రోజులు !
రాష్ట్రం అభివృద్ది చెందాలన్న లక్ష్యంతోనే పాలనా వికేంద్రీకరణ చేపట్టామని సీఎం స్పష్టం చేశారు. విశాఖపై దృష్టి పెట్టి వాల్యూ అడిషన్ చేస్తే ఐదేళ్లలో హైదరాబాద్‌తో పోటీ పడే నగరం అవుతుందన్నారు. అయితే నిర్ణయం తీసుకున్నప్పటి నుండి మూడు రాజధానులపై అపోహలు.. న్యాయ పరమైన చిక్కులు సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాలను రకరకాలుగా వక్రీకరించారని విమర్శించారు. ఇప్పటికీ పాలనా వికేంద్రీకరణకే కట్టుబడ్డామని.. బిల్లులను మరింత మెరుగుపరుస్తామని.., సమగ్రమైన బిల్లులను ప్రవేశ పెడుతామని.. అందుకే ఇప్పుడు బిల్లులు ఉపసంహరించుకుంటున్నామని జగన్ ప్రకటించారు. కొత్త బిల్లులపై అన్ని వర్గాల ప్రజలను ఒప్పిస్తామన్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి





















