SpadeX: అంతరిక్షంలో స్పేడెక్స్ డాకింగ్ సక్సెస్ - ఇస్రో మరో ఘనత, నాలుగో దేశంగా భారత్
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియ విజయవంతమైంది. ఈ మేరకు ఇస్రో ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేసింది.
ISRO Successfully Docks Satellites As Part Of SpadeX: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో ఘనత సాధించింది. ఇటీవల ప్రయోగించిన స్పేడెక్స్ (SpadeX) మిషన్‌లో భాగంగా అంతరిక్షంలో ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియ తాజాగా విజయవంతమైంది. ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేసింది. నింగిలోకి పంపిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానించినట్లు తెలిపింది. ఇప్పటికే మూడుసార్లు డాకింగ్ ప్రక్రియ వాయిదా పడగా తాజాగా సక్సెస్ అయ్యింది. ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది.
SpaDeX Docking Update:
— ISRO (@isro) January 16, 2025
🌟Docking Success
Spacecraft docking successfully completed! A historic moment.
Let’s walk through the SpaDeX docking process:
Manoeuvre from 15m to 3m hold point completed. Docking initiated with precision, leading to successful spacecraft capture.…
ప్రయోగం ఇలా..
గతేడాది డిసెంబర్ 30వ తేదీ నుంచి తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (SHAR)లో నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సీ - 60 (PSLV C60)లో జంట ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్‌వీ బయలుదేరిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్ - 1బి, 15.12 నిమిషాలకు స్పేడెక్స్-1ఎ రాకెట్ నుంచి విడిపోయాయి. ఆ తర్వాత వీటి డాకింగ్ కోసం మూడుసార్లు ప్రయత్నించగా.. పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. చివరకు గురువారం వీటి అనుసంధాన ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలోనే 2 ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చారు. అక్కడ ఉపగ్రహాలను హోల్డ్ చేసి డాకింగ్ మొదలుపెట్టారు.
డాకింగ్ ప్రక్రియ విజయవంతమైనట్లు ప్రకటించిన ఇస్రో.. ఇందుకు శ్రమించిన సాంకేతిక బృందానికి, యావత్ భారతీయులకు అభినందనలు తెలిపింది. ఇప్పటివరకూ చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. తాజా ప్రయోగంతో ఈ తరహా సాంకేతికతలో భారత్ కూడా వాటి సరసన చేరింది.
కాగా, స్పేడెక్స్ (SpadeX) ప్రయోగంలో భాగంగా టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టింది. అంతరిక్షంలోనే వ్యోమనౌకలను డాకింగ్, అన్ డాకింగ్ చేయగల సాంకేతిక అభివృద్ధే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టారు. పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించిన 2 చిన్న వ్యోమ నౌకలను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింగ్ చేయించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఈ 2 ఉపగ్రహాల బరువు 440 కిలోలు ఉంటుందని ఇస్రో తెలిపింది. భూ ఉపరితలం నుంచి 470 కిలోమీటర్ల ఎత్తున వృత్తాకార కక్ష్యలో 2 వ్యోమనౌకలు స్వతంత్రంగా ఒకేసారి డాకింగ్ అయ్యేలా ఇస్రో శాస్త్రవేత్తలు ప్రణాళికలు సిద్ధం చేశారు. చంద్రుడిపై వ్యోమగామిని దించడం, జాబిల్లి నుంచి మట్టిని తీసుకురావడం, సొంత అంతరిక్ష కేంద్రం నిర్మించాలన్న భారత్ కల సాకారం కావాలంటే.. వ్యోమ నౌకల డాకింగ్, అన్ డాకింగ్ సాంకేతికత ఎంతో అవసరమని ఇస్రో పేర్కొంది.
Also Read: Budget 2025:ప్రయాణికుల భద్రత, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి.. 18శాతం పెరగనున్న రైల్వే బడ్జెట్